Begin typing your search above and press return to search.

కొత్త మేయర్​ విజయలక్ష్మి.. జీవిత విశేషాలివే..!

By:  Tupaki Desk   |   11 Feb 2021 11:00 PM IST
కొత్త మేయర్​ విజయలక్ష్మి..  జీవిత విశేషాలివే..!
X
జీహెచ్​ఎంసీ మేయర్​గా గద్వాల్​ విజయలక్ష్మి ఎన్నికైన విషయం తెలిసిందే. విజయలక్ష్మి టీఆర్​ఎస్​ సీనియర్​ నేత కే. కేశవరావు కూతురు. మేయర్ పదవికోసం టీఆర్​ఎస్​లో చాలా మంది పోటీపడ్డారు. కానీ చివరకు విజయలక్ష్మికి అవకాశం దక్కింది. కేశవరావు కూతురు కావడం, ఉన్నత విద్యావంతురాలు కావడంతో ఆమెకు ఈ అవకాశం దక్కింది. విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ 93 కార్పొరేటర్‌గా రెండు సార్లు ఎన్నికయ్యారు. విజయలక్ష్మి రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది.. ఆమె రాజకీయాల్లోకి ఎలా వచ్చారు.. తదితర విషయాలు తెలుసుకుందాం..

విజయలక్ష్మి బాల్యం మొత్తం హైదరాబాద్​లోనే సాగింది. ఆమె హోలీ మేరీ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత రెడ్డి మహిళా కళాశాలలో ఇంటర్మీడియట్​.. భారతీయ విద్యాభవన్​లో జర్నలిజం, సుల్తానా ఉల్​లూమ్​ లా కళాశాలలో న్యాయవిద్యను అభ్యసించారు.
బాబిరెడ్డిని వివాహం చేసుకొని ఆమె అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. దాదాపు 18 ఏళ్లు ఆమె అమెరికాలో ఉన్నారు. నార్త్ కరోలినా యూనివర్సిటీలో.. కార్డియాలజీ విభాగంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేశారు.

2007లో ఆమె ఇండియాకు తిరిగొచ్చి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2016, 2021 జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ డివిజన్ కార్పొరేటర్​గా ఎన్నికయ్యారు. గతంలో కార్పొరేటర్​గా తన డివిజన్​ను ఆమె ఎంతో అభివృద్ధి చేశారు. దీంతో మళ్లీ ఆమెకే అవకాశం దక్కింది. విజయలక్ష్మికి మేయర్​ పదవి దక్కడానికి కేకే పాత్ర కూడా ఉంది.