Begin typing your search above and press return to search.

వైసీపీ : కొత్త ఇంఛార్జ్ .. కోటి ఆశ‌లు

By:  Tupaki Desk   |   8 Jun 2022 9:30 AM GMT
వైసీపీ : కొత్త ఇంఛార్జ్ .. కోటి ఆశ‌లు
X
ఆంధ్రావ‌ని వాకిట ఐ ప్యాక్ నుంచి ఒక‌రు క్రియాశీల‌క రాజ‌కీయాల్లో వ్యూహ‌క‌ర్త‌గా మార‌నున్నారు. రిషి రాజా సింగ్-ను ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వైసీపీ నియ‌మించ‌నుంది. ఇవాళ్టి నుంచి ఆయ‌న బాధ్య‌త‌లు అందుకోనున్నారు. దీంతో వైసీపీలో కోటి ఆశ‌లు రేగుతున్నాయి. ముఖ్యంగా గ‌తంలో ప‌నిచేసిన విధంగానే ఈ సారి కూడా ప్ర‌శాంత్ కిశోర్ గ్యాంగ్ క్షేత్ర స్థాయిలో ప‌నిచేసి, మంచి ఫ‌లితాలు అందుకోవాల‌ని ఆరాట ప‌డుతోంది.

ఇందుకోసం భారీ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ కోరింద‌ని కూడా తెలుస్తోంది. వైసీపీ కూడా ఇందుకు సానుకూలంగా ఉంది. ఐ ప్యాక్ కూడా జిల్లాల వారిగా యాక్టివిస్టుల‌ను వెతుకుతోంది. అన్నీపూర్త‌యితే త్వ‌ర‌లోనే స‌ర్వేలు ఆరంభం కావ‌డం త‌థ్యం.

వాస్త‌వానికి బొత్స లాంటి సీనియ‌ర్లు గ‌తంలోనూ ప్ర‌శాంత్ కిశోర్ ను వ్య‌తిరేకించారు అన్న వార్త‌లున్నాయి. త‌మ‌కు ఎవ‌రి వ్యూహాలు అక్క‌ర్లేదు అని, గ్రామ స్థాయిలో వాస్త‌విక విష‌యాలు తాము అంచ‌నా వేయ‌గ‌లం అని కూడా కొన్ని ప్ర‌యివేటు సంభాష‌ణ‌ల్లో అన్నారు.అయితే నాటి మాట‌లు ఎలా ఉన్నా ఈ సారి మాత్రం రిషి అనే ఉన్న‌త విద్యావంతుడి నేతృత్వంలోనే వైసీపీ ప‌నిచేయ‌నుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి దృష్టంతా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైసీపీ కార్య‌క్ర‌మంపైనే ఉంది.

ఈ కార్య‌క్ర‌మం నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ తీసుకుని మ‌రింత బాగా ప‌న్చేయాల‌ని చూస్తున్నారాయ‌న. వీటి ఫ‌లితాలు తెలిశాకే ఐ ప్యాక్ కూడా రంగంలోకి దిగి, జిల్లాల‌లో ఏ మేర‌కు మార్పులు చేయాలో అన్న‌ది అధిష్టానానికి సూచించ‌నుంద‌ని తెలుస్తోంది. మంత్రి ధ‌ర్మాన చెప్పిన విధంగా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కేవ‌లం రెండు నెల‌ల కార్య‌క్ర‌మం అయితే కాదు.

ఎన్నిక‌ల వ‌చ్చే వ‌ర‌కూ దీనిని కొన‌సాగించ‌డం, క్షేత్ర స్థాయి వాస్త‌వాలు తెలుసుకోవ‌డం, పార్టీ త‌ర‌ఫున సర్వేలు చేయించ‌డం అన్న‌వి జ‌రుగుతూనే ఉంటాయి.ఇప్పుడు పార్టీకి తోడు పీకే టీం కూడా సీన్లోకి రానుంది.

ఇదే స‌మ‌యాన వ‌లంటీర్ల నుంచి కూడా జ‌గ‌న్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఐవీఆర్ఎస్ (Interactive voice response systems) ద్వారా ఎమ్మెల్యే ప‌నిత‌నం కూడా అంచ‌నావేయ‌నున్నారు.కేవ‌లం ప‌ని భారం అంతా పీకే టీంకే అప్ప‌గించ‌కుండా, సీఎం నిరంత‌రం వీటిని ప‌ర్య‌వేక్షిస్తూ వివిధ మీడియాల‌ను మానిట‌ర్ చేయిస్తూ.. ఎన్నిక‌ల‌కు సిద్ధం కానున్నారు.