Begin typing your search above and press return to search.

కార్యకర్తల పిచ్చి.. వైసీపీకి తలనొప్పి..!

By:  Tupaki Desk   |   17 Nov 2019 3:04 PM IST
కార్యకర్తల పిచ్చి.. వైసీపీకి తలనొప్పి..!
X
ఊసరవెళ్లి రంగులు మారుస్తున్నట్టు ప్రతీ ఐదేళ్లకు మన ప్రభుత్వ ఆఫీసులు, పాలన కేంద్రాలు రంగులు మార్చుకుంటున్నాయి. పాలన ఎవరిదైతే వారి రంగు పులుముకుంటోంది. డైరెక్టుగా ఇలా చేయమని పాలకులు చెప్పకున్నా కింది స్థాయి కార్యకర్తల అతి ఇప్పుడు ప్రభుత్వ అధినేతలకు తలనొప్పులు తెచ్చిపెడుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ వాసనలే కనిపించాలి.. బీజేపీ కేంద్రంలో ఉండడంతో అది గద్దెనెక్కిన రాష్ట్రాల్లో కాషాయం కనిపిస్తోంది. బీజేపీకి ముందు కాంగ్రెస్ మూడు జెండాలు తళతళామెరిసేవి. ఇక తెలంగాణలో గులాబీ గుబాళింపులు కొనసాగుతున్నాయి.. 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ హయాంలో మొత్తం పంచాయతీల నుంచి ప్రభుత్వ కార్యాలయాలు.. ఆఖరుకు అన్నా క్యాంటీన్లకు కూడా పచ్చరంగు వేసి జనాలకు పచ్చకామెర్లను తీసుకొచ్చారు..

ప్రాంతాలను బట్టి పాలనను బట్టి రంగులు మారుతున్నాయి. మారుతుంటాయి కూడా.. కానీ అది ఇప్పుడే ఫోకస్ కావడం వైసీపీని ఇరుకునపెడుతోంది... ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ సర్కారును ఇబ్బందుల పాలుచేస్తోంది. యాధృశ్చికంగా జరుగుతున్న ఈ ఘటనలు వైరల్ అవుతున్నాయి.

మొన్నటికి మొన్న ఓ పంచాయతీ సర్పంచ్ వైసీపీపై పిచ్చి ప్రేమతో మూడు రంగుల జెండా ఉన్న పంచాయతీ ఆఫీసుకు వైసీపీ కలర్ వేయడం దుమారం రేపింది. వైసీపీ అధిష్టానం పెద్దలు చీవాట్లు మళ్లీ పాతరంగుకు మార్చాల్సి వచ్చింది.

ఇప్పుడూ అదే జరిగింది. తాజాగా మరణించిన ఓ వైసీపీ కార్యకర్తకు సమాధి కట్టించిన తోటి కార్యకర్తలు.. అతడి సమాధికి వైసీపీ రంగు వేశారు. ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. చనిపోయినా కార్యకర్త సమాధిని కూడా వదలరా అంటూ కామెంట్లు వచ్చిపడుతున్నాయి.. ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఆ సదురు కార్యకర్తకు డైరెక్టుగా సీఎం జగనో.. విజయసాయిరెడ్డియో చెప్పి వేయించిన రంగులు కాదవి.. పార్టీ పై అభిమానం.. చచ్చిన వ్యక్తికున్న ఆదరణ చూసి సొంతంగా ఎవరో వైసీపీ కార్యకర్తలు చేసిన అత్యుత్సాహం ఇదీ.. కానీ దీనికి జగన్ ను వైసీపీని టార్గెట్ గా చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

ఇలా వైసీపీ అభిమానుల పిచ్చి ప్రేమ చివరకు వైసీపీ అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. సమాధిని కూడా వదలకుండా పార్టీ రంగులు వేసిన తీరు ఇప్పుడు వైరల్ గా మారింది.