Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియాకు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు ... ఓటీటీపై నిఘా!

By:  Tupaki Desk   |   25 Feb 2021 4:04 PM IST
సోష‌ల్ మీడియాకు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు ... ఓటీటీపై నిఘా!
X
సోషల్ మీడియాలో వస్తోన్న కంటెంట్‌ ను నియంత్రించే వ్యూహంలో భాగంగా కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సంబంధిత చట్టాన్ని సవరించడం ద్వారా ఓటీటీ ప్లాట్‌ ఫాం లపై నియంత్రణకు కేంద్రం తాజా సంస్కరణలను గురువారం ప్రకటించింది. ఇంటర్నెట్ ఆధారిత‌, ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్ ‌ల‌కు కొత్త నియ‌మావ‌ళిని కేంద్రం రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన ఇవాళ కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ కొన్ని విష‌యాల‌ను వెల్ల‌డించారు. సోష‌ల్ మీడియా దుర్వినియోగంపై విస్తృత స్థాయిలో చ‌ర్చించామ‌ని మంత్రి తెలిపారు.

డిజిట‌ల్ కాంటెంట్ విష‌యంలో 2018 డిసెంబ‌ర్‌ లో ముసాయిదా త‌యారు చేశామ‌ని, దీంట్లో రెండు క్యాట‌గిరీలో ఉంటాయ‌న్నారు. అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ ట్వీట్ లేదా సందేశం పోస్టు చేసిన వారి తొలి వ్య‌క్తి స‌మాచారాన్ని కోర్టు ఆదేశం లేదా ప్ర‌భుత్వ ఆదేశం ప్ర‌కారం సోష‌ల్ మీడియా సంస్థ‌లు బ‌హిర్గతం చేయాల‌ని మంత్రి ర‌విశంక‌ర్ తెలిపారు. దేశ సార్వ‌భౌమ‌త్వం, స‌మ‌గ్ర‌త‌, భ‌ద్ర‌త‌, శాంతిభ‌ద్ర‌త‌లు, విదేశీ వ్య‌వ‌హారాలు, అత్యాచారం, అస‌భ్య కాంటెంట్ ‌ను ప్ర‌చారం చేసేవారి విష‌యంలోనే ఈ చ‌ర్య‌లు వ‌ర్తిస్తాయ‌ని మంత్రి వెల్ల‌డించారు.

సోష‌ల్ మీడియా దుర్వినియోగంపై ఫిర్యాదు ప‌రిష్కార వ్య‌వ‌స్థ‌ను కూడా రూపొందిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. గ్రీవియ‌న్స్ ఆఫీస‌ర్ స‌దురు స‌మ‌స్య‌ను 24 గంట‌ల్లో రిజిస్ట‌ర్ చేసి.. 15 రోజుల్లో ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తార‌ని మంత్రి ర‌విశంక‌ర్ చెప్పారు. ఓటీటీ ఫ్లాట్‌పామ్‌ల‌కు సంబంధించి మూడు విధానాల‌ను అవ‌లంబించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు. ఓటీటీతో పాటు డిజిట‌ల్ న్యూస్ మీడియా సంస్థ‌లు త‌మ వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సి ఉంటుంద‌న్నారు. రిజిస్ట్రేష‌న్ల‌ను త‌ప్ప‌నిస‌రి చేయ‌డం లేద‌ని, కానీ స‌మాచారాన్ని సేక‌రిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల‌తో పాటు డిజిట‌ల్ పోర్ట‌ల్స్ కోసం ఫిర్యాదు ప‌రిష్కార వ్య‌వ‌స్థ ఉండాల‌న్నారు.