Begin typing your search above and press return to search.

యెస్ బ్యాంకుకు ‘కొత్త రక్షకులు’ పోటెత్తుతున్నారు

By:  Tupaki Desk   |   18 March 2020 5:30 AM GMT
యెస్ బ్యాంకుకు ‘కొత్త రక్షకులు’ పోటెత్తుతున్నారు
X
రెండు వారాల్లో ఎంత మార్పు. సరిగ్గా చెప్పాలంటే వారం క్రితం.. యెస్ బ్యాంక్ షేరు ఐదు రూపాయిలకు పడిపోయింది. ఆ సమయం లో ఆ షేరును ముట్టుకోవాలంటే కూడా భయపడిపోయిన పరిస్థితి. ఆ బ్యాంకును కాపాడే విషయంలో కేంద్రం కంకణం కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతున్నా.. షేర్లు కొనుగోలు చేయటానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఇలాంటివేళ.. ఎస్ బీఐ ఆ బ్యాంకుకు రక్షకుడిలా వ్యవహరిస్తుందన్న ప్రకటన తో ఆ బ్యాంక్ ఇమేజ్ కొంతమేర మారింది.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో షేరు ధర భారీగా పెరగటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రానున్న రోజుల్లో ఈ షేర్ రేంజ్ మామూలుగా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్ బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ చేసిన ఒక ప్రకటన తో ఆ బ్యాంకు షేర్ ఒక రేంజ్ కు వెళ్లటం ఖాయమంటున్నారు. దీనికి తోడు.. యెస్ బ్యాంకు కు దన్నుగా నిలిచే విషయంలో ఒక్క ఎస్ బీఐ మాత్రమే కాదు.. పలు బ్యాంకులు రంగంలోకి వచ్చేశాయి.

తొలుత రూ.7250 కోట్ల పెట్టుబడితో యెస్ బ్యాంకులో 49 శాతం వాటాను తీసుకోవాల్సిందిగా ఎస్ బీఐను అడగటం.. అందుకు సదరు బ్యాంక్ ఓకే అనటం జరిగింది. అయితే.. ఇతర బ్యాంకులు.. ఆర్థిక సంస్థలు సైతం తాము కూడా యెస్ బ్యాంకు వాటాల్ని తీసుకునేందుకు ఆసక్తిని ప్రదర్శించి ముందుకు వచ్చాయి. దీంతో.. 49 శాతం వాటా తీసుకోవాలనుకున్న ఎస్ బీఐ కేవలం 43 శాతం వాటాకే పరిమితమైంది. దీంతో రూ.6050 కోట్లను మాత్రమే ఎస్ బీఐ పెట్టుబడిగా పెట్టింది. అయితే.. యెస్ బ్యాంకులో వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లుగా ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. అంతేకాదు.. మరో వెయ్యి కోట్లను హెచ్ డీఎఫ్ సీ.. యాక్సిస్ బ్యాంకు రూ.600 కోట్లు.. కోటక్ మహీంద్రా రూ.500 కోట్లు.. ఫెడరల్.. బంధన్ బ్యాంకులు చెరో రూ.300 కోట్లు.. ఐడీఎఫ్ సీ బ్యాంకు రూ.250 కోట్ల చొప్పున వాటాలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావటం తో.. యెస్ బ్యాంకు రూపురేఖలు మారిపోయినట్లేనని చెబుతున్నారు.

దీనికి తోడు.. తాము కొనుగోలు చేసిన యెస్ బ్యాంక్ షేరును మూడేళ్లలోపు ఒక్కటంటే ఒక్క షేరు కూడా అమ్మే ప్రసక్తే లేదని.. ఎస్ బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ వెల్లడించటం తో ఆ షేరుకు రానున్న రోజుల్లో ఒక రేంజ్ కు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎస్ బీఐ వద్ద ఉన్న 60.50 కోట్ల షేర్లలో ఒక్కటంటే ఒక్క షేరు కూడా అమ్మకుండా తమకు తాము స్వీయ లాకింగ్ పిరియడ్ పెట్టుకోవటం యెస్ బ్యాంకు కలిసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.