Begin typing your search above and press return to search.

వ‌ర్ణ వివ‌క్ష ఉద్య‌మం ఎఫెక్ట్‌: హిందుస్తాన్ యూనిలీవర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   26 Jun 2020 2:30 AM GMT
వ‌ర్ణ వివ‌క్ష ఉద్య‌మం ఎఫెక్ట్‌: హిందుస్తాన్ యూనిలీవర్ సంచ‌ల‌న నిర్ణ‌యం
X
వ‌ర్ణ వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా పోరాటం అమెరికాలో కొన‌సాగుతోంది. ఆ దేశంలో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దాని ప్ర‌భావం ప్ర‌పంచ దేశాల‌పై కూడా ప‌డింది. ప‌లు దేశాల్లో వ‌ర్ణ వివ‌క్ష నివార‌ణ చ‌ర్య‌లు మొద‌ల‌య్యాయి. దాని ప్ర‌భావం ఇప్పుడు భార‌త‌దేశంపై ప‌డింది. దేశంలోనే అతి పెద్ద సంస్థ‌గా ఉన్న‌ హిందుస్తాన్ యూనిలీవర్ ఒక ఉత్ప‌త్తి మార్చ‌డానికి నిర్ణ‌యించింది. ఫెయిర్ అండ్ లవ్లీ అనే పేరు మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ బ్యూటీ ప్రొడక్ట్‌ పేరును మార్చాలని హిందుస్తాన్ యూనిలీవర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఇటీవల అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వర్ణ వివక్షపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంద‌ని తెలుస్తోంది. ఫెయిర్ అనే పదం తొలగించ‌నున్నారు. ఇక నుంచి తమ ఉత్ప‌త్తుల్లో ఫెయిర్ అనే పదాన్ని తొలగించి కొత్త పేరుతో రీబ్రాండ్ చేయనున్నట్టు హిందూస్తాన్ యూనిలీవర్ ప్రకటించింది. కొత్త పేరుకు ఇంకా రెగ్యులేటరీ ఆమోదం లభించాల్సి ఉందని తెలిపింది. కొత్తగా తీసుకురాబోయే ప్రొడక్ట్ కేవలం ఫెయిర్‌ బ్యూటీకి మాత్రమే కాకుండా ఇతర స్కిన్ టోన్స్‌ను కూడా ప్రతిబింబించేలా ఉంటుందని వివ‌రించిది.

ప్రస్తుతం మార్కెట్లో దొరికే ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాక్‌పై కాంతివంతమైన చర్మం కోసం, తెలుపు కోసం వంటి రాతలు కనిపిస్తాయని, ఈ ధోరణి సరైనది కాదని హిందూస్తాన్ యూనిలీవర్ ప్ర‌తినిధి సన్నీ జైన్ భావిస్తున్న‌ట్లు తెలిపారు. చర్మానికి సంబంధించి తెలుపు, కాంతి, మెరుపు వంటి పదాలు వాడటం సరైనది కాదని తాము గుర్తించిన‌ట్లు చెప్పారు. త‌మ‌ ఉత్పత్తులను ప్రజలకు కమ్యూనికేట్ చేసే విధానం సవరించుకుంటున్నట్లు వెల్ల‌డించారు. ఇకపై ఫెయిర్ అండ్ లవ్లీ అన్ని రకాల స్కిన్ టోన్స్‌ను సెలబ్రేట్ చేస్తుందని హిందూస్తాన్ యూనిలీవర్ పేర్కొంది. గతవారం అమెరికన్ మల్టీ నేషనల్ జాన్సన్ అండ్ జాన్సన్ భారత్‌లో తమ ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజులకే ఫెయిర్&లవ్లీ ఈ నిర్ణయం తీసుకుంది. అంటే వ‌ర్ణ వివ‌క్ష ప్ర‌భావం కంపెనీల‌పై తీవ్రంగా ప‌డింది. ఎక్క‌డ త‌మ‌కు త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డుతుందేమోన‌ని ముందే అప్ర‌మ‌త్త‌మై చ‌ర్య‌లు తీసుకున్నారు. కొన్ని విధానాలను, పద్దతులను మార్చుకోవడం ద్వారా వాటిని రీబ్రాండ్ చేసుకోవాలని హిందూస్తాన్ యూనిలివ‌ర్ భావిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో ఫెయిర్ అండ్ లవ్లీ విక్ర‌యాల విలువ ఏటా 560 మిలియన్ డాలర్లు ఉంది.