Begin typing your search above and press return to search.

మరో కరోనా లక్షణం..వ్యాధిగ్రస్తుల్లో 1/4 వంతు మందికి హెయిర్ లాస్

By:  Tupaki Desk   |   14 Aug 2020 11:30 PM GMT
మరో కరోనా లక్షణం..వ్యాధిగ్రస్తుల్లో 1/4 వంతు మందికి హెయిర్ లాస్
X
రోజులు గడిచేకొద్దీ కరోనా లక్షణాలు మరిన్ని బయట పడుతున్నాయి. దగ్గు - జలుబు - జ్వరం - రుచి - వాసన గ్రహించే శక్తి కోల్పోవడం - విరేచనాలు - ఎక్కిళ్ళు కరోనా లక్షణాలు. కోవిడ్ బారిన పడిన వారికి, కోలుకున్న వారికి జుట్టు ఊడిపోతోందని తాజాగా తెలిసింది. కరోనా వచ్చిన వారిలో 90 శాతం మందికి ఊపిరితిత్తుల సమస్య తలెత్తుతుండగా, గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తోంది. ఒకసారి కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత చాలా సైడ్ ఎఫెక్టులు ఫేస్ చేయాల్సి వస్తోంది. పలు అవయవాల పనితీరు కూడా మునుపటికంటే తగ్గుతుంది. వీటిపై ఇప్పటికే జనం ఆందోళన చెందుతుండగా తాజాగా కరోనా బారినపడ్డ వారికి, కోలుకున్న వారికి జుట్టు రాలి పోతోందని సెలబ్రిటీ వరల్డ్ తో పాటు, సైన్స్ వరల్డ్ వెలుగులోకి తెచ్చింది. దీంతో జనం మరింత ఆందోళనకు గురవుతున్నారు. అస్సామీ మిలానో అనే హీరోయిన్ కూడా తాను కరోనా బారిన పడడంతో జుట్టు ఊడి పోయిందని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

మరో సర్వేలో నటాలీ లాంబర్ట్ అనే వైద్య నిపుణుడు చెబుతూ కోవిడ్ బారిన పడ్డ వారిలో 1/4 వంతు మందికి ఈ సమస్య ఎదురవుతున్నట్లు తెలిపారు. ఇలా జుట్టు ఊడిపోవడాన్ని 'టెలోజన్ ఎఫ్యూవిమ్ ' అంటారు. కరోనా లేకపోయినా ఈ లక్షణం కనిపించవచ్చు. దేశంలో కరోనా తీవ్రత అధికమవడంతో జనాలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమకు కూడా వైరస్ సోకుతుందేమోనన్న ఆందోళనలో గడుపుతున్నారు. ఇలా నిత్యం ఆలోచనల్లో కూరుకుపోతున్నారు. కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యోగులు పోగొట్టుకున్నారు. తమ సహచరులను కోల్పోయారు. మునుపటిలా ఏ పరిస్థితులు లేవు. వైరస్ గురించి, ఉపాధి గురించి ఆలోచనలు పెరిగి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా ఆలోచించడం వల్ల కూడా జుట్టు ఊడిపోతోందని, కరోనా ఒక్కటే కారణం కాదని కొందరు చెబుతున్నారు.