Begin typing your search above and press return to search.

కార్పొరేట్ ఆసుపత్రికి రిఫర్ చేస్తే రూ.లక్ష!

By:  Tupaki Desk   |   25 Aug 2020 10:15 AM IST
కార్పొరేట్ ఆసుపత్రికి రిఫర్ చేస్తే రూ.లక్ష!
X
కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటం తెలిసిందే. మొన్నటివరకు నగరాలు.. పట్టణాలకే పరిమితమైన పాజిటివ్ కేసులు.. ఇప్పుడు అన్నిచోట్లకు విస్తరిస్తున్నాయి. కేసులు సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికే వస్తే..మొత్తం పాజిటివ్ కేసుల్లో దాదాపు 85 శాతం కేసులు హైదరబాద్ పరిధిలోనే చోటు చేసుకునేవి.

గడిచిన నెలలో ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది. ఈ రోజున నమోదవుతున్న మొత్తం కేసుల్లో 40 శాతం మేర మాత్రమే హైదరాబాద్ కేసులు నమోదు అవుతుంటే.. మిగిలనవన్నీ జిల్లాల్లోనే నమోదువుతున్నాయి. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ లోనమోదవుతున్న కేసుల సంఖ్య 20 శాతానికి తగ్గిపోవటం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. కరోనా వైద్యం పేరుతో లక్షలు దండుకుంటున్న కార్పొరేట్ ఆసుపత్రులు.. తాజాగా సరికొత్త దందాకు తెర తీసినట్లుగా తెలుస్తోంది.

జిల్లాల్లో వైద్యం సరిగా లేని నేపథ్యంలో.. వారిని హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు వీలుగా దళారుల్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. వీరి పని.. కరోనా పాజిటివ్ పేషెంట్లకు హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లేలా నూరిపోయటమే. ఇలా కేసుల్ని రిఫర్ చేస్తే.. ఒక్కో పషెంట్ కు లక్ష రూపాయిల వరకు నజరానా ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇంత భారీ మొత్తం కార్పొరేట్ ఆసుపత్రి ఎలా ఇస్తుందంటే.. దానికి కారణం పేషెంట్ల మీద భారీగా బాదేయటమేనని చెబుతున్నారు.

నిన్నటికి నిన్న (సోమవారం) మాదాపూర్ లోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో కరోనా లేని పేషెంట్ కు వైద్యం చేసి రూ.4లక్షలకు పైనే బిల్లు వేశారు. తనకు ఎలాంటి సమస్యా లేకున్నా వైద్యం చేసి.. లక్షల్లో బిల్లు వేయటం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోవటం.. ఈ లొల్లి పెద్దది కావటంతో సదరు ఆసుపత్రి డిఫెన్సులో పడినట్లైంది.

కరోనా వైద్యం పేరుతో లక్షలు దండుకోవటానికి అలవాటు పడిన ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రులు జిల్లాల వారీగా ఏజెంట్లను పెట్టుకొని మరీ.. ఈ కొత్త దోపిడీకి తెర తీస్తున్నారని చెబుతున్నారు. ఒక పేషెంట్ ను కార్పొరేట్ ఆసుపత్రికి రిఫర్ చేస్తే దగ్గర దగ్గర లక్ష వరకు వస్తుండటంతో వారు సైతం దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. శవాల మీద పేలాలు ఏరుకునేలా చేస్తున్న ఈ తీరు చూస్తే.. కడుపు మండక మానదు. ఈ దందాపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.