Begin typing your search above and press return to search.

కొత్త రాజ్యాంగం దెబ్బ: దెబ్బకు టీఆర్ఎస్ 'అంబేద్కర్' జపం

By:  Tupaki Desk   |   4 Feb 2022 8:30 AM GMT
కొత్త రాజ్యాంగం దెబ్బ: దెబ్బకు టీఆర్ఎస్ అంబేద్కర్ జపం
X
కొత్తరాజ్యాంగం కావాలంటూ మొన్నీ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ పై దుమ్మెత్తిపోశాడు. ఆ వ్యాఖ్యలతో అంబేద్కర్ ను కేసీఆర్ అవమానించాడని బీజేపీ పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లింది. దళితులను అవమానించాడని ఫోకస్ చేసింది. దీంతో డిఫెన్స్ లో పడిపోయిన కేసీఆర్, టీఆర్ఎస్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీంతో ‘అంబేద్కర్’ జపం చేస్తోంది. నష్టనివారణ చర్యలుచేపట్టిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు హైదరాబాద్ లో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటుకు తలించి కాస్త అయినా చల్లబరిచే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. బడుగు బలహీన వర్గాల నాయకులు సీఎం మాటలపై విరుచుకుపడుతున్నారు. దీన్ని చక్కదిద్దేపనిలో పడ్డారు పార్టీ అధ్యక్షుడు కేటీఆర్. ప్రజల్లోకి వెళ్లి ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని, దీనిపై చర్యలు తీసుకోకుంటే మూల్యం చెల్లించాల్సి వస్తుందని పార్టీలోని దళిత నేతలు కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ లాంటి వారు అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన సరిదిద్దుకునే చర్యలకు శ్రీకారం చుట్టారు.

ఉద్యమ సమయంలో కొత్త రాష్ట్రానికి దళితుడే మొదటి ముఖ్యమంత్రి అని ప్రకటించిన చంద్రశేఖర్ రావు ఆ దిశగా విఫలమయ్యారు. ఈ మాటల నుంచి ప్రజలను మళ్లించేందుకు దేశంలో అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో చూడబోతున్నారని ప్రకటనలు కూడా చేశారు. ఇది కూడా మాటల వరకే పరిమితమైంది. దీనికి తోడు బడ్జెట్ పై సీఎం కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యాంగాన్ని తప్పు పడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పక్కరాష్ట్రాలకు సైతం పాకి రచ్చ మొదలైంది.

ప్రతిపక్ష పార్టీల, బడుగు బలహీణ వర్గాల నాయకులు రోడ్డెక్కారు. సీఎం దిష్టిబొమ్మల దహనం, రాస్తారోకోలతో ఆందోళనలు చేపడుతున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్రతిపక్ష నాయకులు సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని పట్టుబడుగుతున్నారు. టీఆర్ఎస్ వైపు నుంచి ప్రజలను తమ వైపునకు తిప్పుకోవాలని చూస్తున్నారు. సీఎం నోటి దురుసుతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని పార్టీ నాయకులు కూడా అధ్యక్షుడి ముందు మొరపెట్టుకున్నారు.

సమస్యను చక్కదిక్కకుంటే భారీగా నష్టపోతామన్న కేటీఆర్ ఆ పనిని నెత్తినేసుకున్నారు. హైదరాబాద్ లోని ఇందిరానగర్ డిగ్నిటీ హౌజింగ్ కాలనీ ప్రారంభోత్సవంతో ఆ దిశగా నడుంకట్టారు. సీఎం అన్న మాటలను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని, సీఎం రాజ్యాంగంలో సవరణలు చేయాలనే ఉద్దేశ్యంతోనే మాట్లాడారే తప్ప అంతటి మహానుభావుడిని పల్లెత్తు మాట అనలేదంటూనే, అంబేద్కర్ కు తాము వీరాభిమానినని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలో 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సమావేశంలో చెప్పారు. ఏది ఏమైనా రాజ్యాంగం, దాని రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తమ వాడిని చేసుకొని, బడుగు, బలహీణ వర్గాలు పార్టీని వీడకుండా చూడడంలో అధ్యక్షుడు కేటీఆర్ ఎంత సఫలీకృతుడవుతారో వేచి చూడాలి..