Begin typing your search above and press return to search.

కొత్త ముఖ్య‌మంత్రి.. అంత‌లోనే రాజీనామా డిమాండ్‌

By:  Tupaki Desk   |   21 Sep 2021 9:23 AM GMT
కొత్త ముఖ్య‌మంత్రి.. అంత‌లోనే రాజీనామా డిమాండ్‌
X
ముఖ్య‌మంత్రి పీఠాన్ని అందుకోవాల‌ని ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడు ల‌క్ష్యంగా పెట్టుకుంటార‌న‌డంలో సందేహం లేదు. ప‌ద‌వి కోస‌మే రాజ‌కీయాల్లోకి అడుగులు పెట్టే నేత‌లు రాష్ట్ర స్థాయిలో ముఖ్య‌మంత్రి కావాల‌ని క‌లలు కంటారు. ఒక‌సారి ఆ ప‌ద‌వి ద‌క్కిన త‌ర్వాత దాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తారు. ఇక ఈ నాయకుడికి ఊహించ‌కుండా సీఎం పీఠం ద‌క్కింది.. ప్ర‌మాణ స్వీకారం చేసి ఒక్క రోజు కూడా కాలేదు మ‌ళ్లీ అంత‌లోనే రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆయ‌న‌పై గ‌తంలో ఉన్న ఆరోప‌ణ‌లే అందుకు కార‌ణం. ఇంత‌కీ ఆ ముఖ్య‌మంత్రి ఎవ‌రంటే? కొత్త‌గా పంజాబ్ సీఎం పీఠంపై కూర్చున్న చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీ.

రెండు వ‌ర్గాలుగా విడిపోయిన పంజాబ్ కాంగ్రెస్‌లో చివ‌ర‌కు ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం ఎమ్మెల్యేల అసంతృప్తితో కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌క త‌ప్ప‌లేదు. పీసీసీ అధ్య‌క్షుడు సిద్ధూతో విభేధాలే అందుకు కార‌ణ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న రాజీమానాతో ఖాళీ అయిన సీఎం కుర్చీపై కాంగ్రెస్ అధిష్ఠానం చ‌రణ్‌జిత్ సింగ్ చ‌న్నీని కూర్చొబెట్టింది. సిద్ధూతో మంచి సాన్నిహిత్యం ఉండ‌డంతో వ‌చ్చే ఏడాది రాష్ట్ర శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌తో క‌లిసి చ‌న్నీ పార్టీని న‌డిపిస్తార‌ని అధిష్ఠానం భావించింది.

అయితే పంజాబ్‌కు తొలి ద‌ళిత ముఖ్య‌మంత్రి అయిన చ‌న్నీపై అప్పుడే విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నే డిమాండ్ విన‌బ‌డుతోంది. ఆయ‌న సీఎం కుర్చీ దిగాల‌ని జాతీయ మ‌హిళా క‌మిష‌న్ డిమాండ్ చేసింది. గ‌తంలో ఆయ‌న మంత్రిగా ఉన్న‌పుడు ఓ మ‌హిళా ఐఏఎస్ అధికారిణికి అభ్యంత‌క‌ర సందేశం పంపించి వేధించార‌ని ఆ క‌మిష‌న్ పేర్కొంది. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి మ‌రొక‌రు రాక‌ముందే ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేసింది. మ‌హిళ‌ల‌తో అస‌భ్య‌క‌రంగా వ్య‌వ‌హ‌రించిన చ‌న్నీ లాంటి వ్య‌క్తిని సీఎం చేయ‌డం సిగ్గు చేట‌ని క‌మిష‌న్ అధ్య‌క్షురాలు రేఖా శ‌ర్మ విమ‌ర్శించారు.

2018లో ఆయ‌న మంత్రిగా ఉన్న‌పుడు ఓ ఐఏఎస్ అధికారిణికి అభ్యంత‌ర‌క‌ర‌మైన సందేశాలు పంపించార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన మీటూ ఉద్య‌మంలో భాగంగా ఆ ఐఏఎస్ అధికారిణి ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. కానీ ఆ ఏడాదిలో ఆ కేసు ప‌రిష్కార‌మైన‌ట్లు అప్ప‌టి సీఎం అమ‌రీంద‌ర్ స్ప‌ష్టం చేశారు. ఆ అధికారిణి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌కుండా నేరుగా అప్ప‌టి సీఎం అమ‌రీంద‌ర్ దృష్టికి తీసుకెళ్లార‌ని ఆయ‌న దానికి ఓ ముగింపు ఇచ్చార‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై అప్ప‌ట్లో మ‌హిళా క‌మిష‌న్ చ‌న్నీకి నోటీసులు కూడా జారీ చేసింది. ఆ త‌ర్వాత ఆ ఐఏఎస్ అధికారిణి కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిన‌ట్లు స‌మాచారం. దీంతో ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింద‌ని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు చ‌న్నీ సీఎం కావ‌డంతో ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఈ వ్య‌వ‌హారాన్ని త‌వ్వి తీస్తున్నారు. మీటూ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా మ‌హిళా క‌మిష‌న్ కూడా ఆయ‌న‌పై విమ‌ర్శుల చేస్తోంది. మ‌రి ఆరంభంలోనే ఎదుర‌వుతున్న ఈ ఆరోప‌ణ‌లు విమ‌ర్శ‌ల‌కు చ‌న్నీ ఎలాంటి స‌మాధానం ఇస్తారో చూడాలి.