Begin typing your search above and press return to search.

సరికొత్త మార్పులతో ఈసారి ఐపీఎల్ సీజన్

By:  Tupaki Desk   |   8 Jan 2020 4:31 AM GMT
సరికొత్త మార్పులతో ఈసారి ఐపీఎల్ సీజన్
X
కొత్త క్యాలెండర్ వచ్చినంతనే క్రికెట్ అభిమానుల కు ఐపీఎల్ సీజన్ గుర్తుకు వస్తుంది. క్రికెట్ ను అమితంగా ప్రేమించి.. ఆరాధించే యూత్ కు పరీక్షలు ఇలా అయిపోతాయో లేదో.. అలా వచ్చేసే ఐపీఎల్ సీజన్ అంతులేని ఎంజాయ్ మెంట్ ను ఇస్తుందని చెప్పాలి. తాజా ఐపీఎల్ 13 సీజన్ కు సంబంధించి బోలెడన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి.

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు సంబంధించి పలు మార్పులు చోటు చేసుకున్నాయి. గతానికి భిన్నంగా మ్యాచ్ టైమింగ్స్ మొదలు కొని.. మ్యాచుల నిర్వహణకు సంబంధించి కూడా మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరింత ఆసక్తికరమైన అంశం ఏమంటే.. గతానికి భిన్నంగా ఈసారి ఐపీఎల్ షెడ్యూల్ మరో పన్నెండు రోజులు పెరగటం విశేషం.

గతంలో నెలన్నర (45 రోజులు) సాగే లీగ్ ఈసారి మాత్రం మూడు రోజులకు తక్కువ రెండు నెలల పాటు సాగుతుంది. అంటే.. 57 రోజులన్న మాట. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మ్యాచులు రాత్రి ఎనిమిది గంటలకు కాకుండా అరగంట ముందుగా అంటే.. 7.30 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకూ జరిగిన సీజన్లలో వారంలో ఐదు రోజులు రోజుకు ఒక మ్యాచ్ అయితే.. వారాంతంలో మాత్రం రోజుకు రెండు మ్యాచుల్ని నిర్వహించేవారు.అయితే.. ఈసారి మాత్రం వారంలోని అన్ని రోజుల్లోనూ రోజుకు ఒక్క మ్యాచ్ మాత్రమే నిర్వహించనున్నారు.

ఎందుకిలా? అంటే.. వారాంతంలో నిర్వహిస్తున్న మ్యాచులలో.. సాయంత్రం షురూ అయ్యే మ్యాచులకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండటమే. దీంతో.. ఆయా మ్యాచులకు స్టేడియాలు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో.. జట్టు ఆదాయం మీద ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ షెడ్యూల్ లో మార్పులు చేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు బయటకు వచ్చిన అన్ని అంశాలు అనధికారికంగా బయటకు వచ్చిన వివరాలే కానీ అధికారికం ఎంతమాత్రం కాదు.

మ్యచ్ టైమింగ్స్ ను అరగంట ముందుకు జరపటం వెనుక అసలు ఉద్దేశం.. మ్యాచ్ అయిన తర్వాత స్టేడియం నుంచి ఇంటికి వెళ్లటం చాలామందికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో అరగంట ముందుకు జరిపితే.. లక్షలాది మందికి అంతోఇంతో ప్రయోజనం కలుగుతుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన మార్పులకు సంబంధించిన వివరాలు ఐపీఎల్ ను మరింత ఆసక్తికరంగా మారుస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ అంచనా నిజమెంతో తేలాలంటే.. సీజన్ షురూ అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.