Begin typing your search above and press return to search.

ఏపీ ఎక్స్ ప్రెస్ లో సామాన్యులకు ప్రవేశం లేదా?

By:  Tupaki Desk   |   12 Aug 2015 4:51 AM GMT
ఏపీ ఎక్స్ ప్రెస్ లో సామాన్యులకు ప్రవేశం లేదా?
X
రాష్ట్ర విభజన అనంతరం.. ఏపీ ఎక్స్ ప్రెస్ పేరిట హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే రైలును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చటం తెలిసిందే. విభజన నేపథ్యంలో.. ఏపీకి ఒక ఎక్స్ ప్రెస్ రైలును కేటాయించనున్నట్లుగా కేంద్రం పేర్కొంది. అందుకు తగ్గట్లే.. బుధవారం నుంచి ఏపీ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కనుంది. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరే ఏపీ ఎక్స్ ప్రెస్ ను ఇకపై తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా వ్యవహరిస్తారు. ఈ రైలు వారం రోజులూ నడుస్తుంది.

ఇక.. విశాఖపట్నం నుంచి న్యూ ఢిల్లీ వరకు వెళ్లనున్న ఈ ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో అన్నీ ఏసీ బోగీలు ఉండటం ఒక విశేషమైతే.. ఇదే శాపంగా మారుతుందని చెబుతున్నారు. ఎందుకంటే.. ఏపీ ఎక్స్ ప్రెస్ లో నాన్ ఏసీ కేటగిరిలో ఉంటే స్లీపర్ క్లాస్.. జనరల్ బోగీలు కనిపించని పరిస్థితి. అంతేకాదు.. ఈ రైలు వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఢిల్లీ నుంచి సోమ.. బుధ.. శుక్రవారాల్లో బయలుదేరితే.. విశాఖ నుంచి బుధ.. శుక్ర.. ఆదివారాల్లో బయలుదేరనుంది. దేశ రాజధానికి వెళ్లే ఈ ఏపీ ఎక్స్ ప్రెస్ తీరు చూస్తే.. సామాన్యులు.. మధ్యతరగతి వారు ఎక్కేందుకు వీల్లేని విధంగా ఉండటం గమనార్హం. సామాన్య సీమాంధ్రుడు.. దేశ రాజధానికి వెళ్లే రైలు సౌకర్యం కల్పించకూడదని రైల్వే శాఖ భావిస్తోందా..?

ఏమాటకు ఆ మాట చెప్పాలి.. అదృష్టం అంటే తెలంగాణదే. రాష్ట్ర విభజనతో లోటు కాస్తా మిగులు అయిపోయిన ఆ రాష్ట్రం.. ఇప్పుడు దేశంలోని సంపన్న రాష్ట్రాల్లో ఒకటి. అంతేకాదు.. దేశంలో మెట్రో నగరాల్లో ఆ రాష్ట్రానికి ఒకటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది.

కలిసొచ్చే వాడికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్లుగా తెలంగాణ రాష్ట్రానికి మరో కలుసుబాటు వచ్చింది. ఇంతకాలం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ఏపీ ఎక్స్ ప్రెస్ ను.. బుధవారం (ఈ రోజు) నుంచి విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేస్తుంటే.. హైదరాబాద్ నుంచి ఏపీ పేరు తీసేసి తెలంగాణ ఎక్స్ ప్రెస్ పేరు మీద ఢిల్లీకి రైలుబండి నడుపుతున్నారు.

ఇక్కడ విషయం ఏమిటంటే.. తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఒక్క ఏపీ స్టేషన్ లో ఆగకున్నా.. విశాఖ నుంచి బయలుదేరే ఏపీ ఎక్స్ ప్రెస్ మాత్రం.. తెలంగాణ రాష్ట్రంలోని ఐదు స్టేషన్లలో ఆగనుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పేరు ఏపీ ఎక్స్ ప్రెస్ అయినా.. ఆంధ్రప్రదేశ్ లోని 8 స్టేషన్లలో (విశాఖపట్నం.. దువ్వాడ.. అనకాపల్లి.. సామర్లకోట.. రాజమండ్రి.. తాడేపల్లి గూడెం.. ఏలూరు.. విజయవాడ) మాత్రమే ఆగనుంది. అదే సమయంలో ఏపీ ఎక్స్ ప్రెస్ తెలంగాణలో 5 స్టేషన్లలో (ఖమ్మం.. పెద్దపల్లి.. వరంగల్.. రామగుండం.. సిర్పూర్ కాగజ్ నగర్) ఆగనుంది. ఇప్పటివరకూ ఢిల్లీకి వెళ్లేందుకు ఉన్న రైలు బళ్లలో తెలంగాణకు అదనంగా ఒకటి చేరితే.. ఏపీకి మాత్రం కొత్తది ఒక్కటే మిగిలింది.. అది కూడా వారానికి మూడు రోజులు మాత్రమే. సుడి అంటే తెలంగాణ రాష్ట్రానిదే కదూ.