Begin typing your search above and press return to search.

రామ్ నాథ్ పెద్ద‌గా ప‌రిచ‌యం లేద‌న్న సీఎం

By:  Tupaki Desk   |   20 Jun 2017 5:00 AM GMT
రామ్ నాథ్ పెద్ద‌గా ప‌రిచ‌యం లేద‌న్న సీఎం
X
రామ్ నాథ్ కోవింద్‌.. నిన్న మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కూ ఈ పేరు చాలా అప‌రిచితం. కొద్ది మందికి.. కొన్ని ప్రాంతాల వారికి మాత్ర‌మే ఆ పేరు సుప‌రిచితం. ఎప్పుడైతే పాల‌క ఎన్డీయే ప‌క్ష రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఆయ‌న్ను ప్ర‌క‌టించారో,, కాసేప‌టికే ఆయ‌న పేరు దేశ ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితమైంది. అంతేనా.. గూగుల‌మ్మ ద‌య‌తో ఆయ‌న గురించి మొత్తం జ‌ల్లెడ వేశారు.

చివ‌ర‌కు ఆయ‌నకు సంబంధించిన అన్ని వివ‌రాలే కాదు.. ఆయ‌న‌పై చేసిన ట్విట్ట‌ర్ వ్యాఖ్య‌ల్ని సైతం తెర మీద‌కు తెచ్చేశారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేకున్నా.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత‌ల‌కు రాజ్ నాథ్ సుప‌రిచితులే. ఎందుకంటే ఆయ‌న రెండుసార్లు రాజ్య‌స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఒక పెద్ద రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్ గా ఉంటున్నారంటే.. ముఖ్య‌మంత్రి స్థానాల్లో ఉన్న వారికి త‌ప్ప‌నిసరిగా తెలిసే ఉంటుంది.

కానీ.. అలా అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లేన‌ని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ త‌న మాట‌ల‌తో చెప్ప‌క‌నే చెప్పేశారు.

రాష్ట్రప‌తి అభ్య‌ర్థి విష‌యంలో ఏకాభిప్రాయ సాధ‌న కోసం ప్ర‌య‌త్నిస్తున్న మోడీ.. అందులో భాగంగా ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును సాయం కోరిన‌ట్లుగా సీఎంవో చెప్పుకుంది. రాష్ట్రప‌తి అభ్య‌ర్థి మీద నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత ప‌లువురు ముఖ్య‌మంత్రుల‌తో నేరుగా మాట్లాడిన ప్ర‌ధాని మోడీ.. ఏపీ ముఖ్య‌మంత్రితో కూడా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌త‌తో మాట్లాడాల్సిందిగా చంద్ర‌బాబును కోరారు. దీంతో.. ఆయ‌న రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వాల్సిందిగా కోరుతూ మ‌మ‌త‌కు ఫోన్ చేశారు.

ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మ‌మ‌త‌తో మాట్లాడిన చంద్ర‌బాబు.. రామ్ నాథ్ అభ్య‌ర్థిత్వం గురించి చెప్పి.. మ‌ద్ద‌తు ఇచ్చే విష‌యాన్ని క‌దిపారు. దీనికి ఆమె ఇచ్చిన స‌మాధానం వింటే షాక్ తినాల్సిందే. రామ్ నాథ్ గురించి త‌న‌కు పెద్ద‌గా తెలీద‌ని.. ప‌రిచ‌యం లేద‌ని.. ఆయ‌న గురించి పార్టీ నేత‌ల‌తో మాట్లాడిన త‌ర్వాతే త‌న నిర్ణ‌యం చెబుతాన‌ని ఆమె చెప్పారు. మొత్తానికి రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా మోడీ ప‌రివారం ఎంపిక చేసిన వ్య‌క్తి.. ఒక సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌కు.. ఓ కీల‌క రాష్ట్రానికి, అది కూడా ప‌క్క రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా సుదీర్ఘ‌కాలంగా ఉంటున్న అధినేత‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేద‌ని చెప్ప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/