Begin typing your search above and press return to search.

ఆ రోజు ఇంగ్లండ్ చేసిన పనిని ఏమాత్రం మరవొద్దు : గవాస్కర్

By:  Tupaki Desk   |   11 Sep 2021 4:44 AM GMT
ఆ రోజు ఇంగ్లండ్ చేసిన పనిని ఏమాత్రం మరవొద్దు : గవాస్కర్
X
ఇండియా , ఇంగ్లండ్ జట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న చివ‌రి టెస్ట్ ఈ రోజు ప్రారంభానికి కొన్ని గంట‌ల ముందు రద్ద‌యిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా ఆ మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ ను రీషెడ్యూల్ చేయ‌డానికి ఈసీబీతో బీసీసీఐ చ‌ర్చిస్తోంది. ఈసీబీతో బీసీసీఐకి మంచి సంబంధాలు ఉండ‌టంతో, ఈ ర‌ద్ద‌యిన మ్యాచ్‌ ను మ‌ళ్లీ నిర్వ‌హించే అంశంపై రెండు బోర్డులు చ‌ర్చిస్తున్నాయి. సరైన విండో కోసం చూస్తున్నాయి. వ‌చ్చే ఏడాది టీ20, వ‌న్డే సిరీస్ కోసం టీమిండియా మ‌ళ్లీ ఇంగ్లండ్ వెళ్లనుంది. అప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇక రద్దైన ఐదో టెస్టును రీషెడ్యూల్ చేయాలనే బీసీసీఐ ప్రతిపాదనను భారత దిగ్గజం, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ స్వాగతించాడు. 2008 దాడులను ఓ ఉదాహరణగా చూపాడు. 2008లో ముంబైలో దాడులు ప్రారంభమైన రోజున కటక్లో భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే మ్యాచ్ ఉంది. దాడుల కారణంగా 7మ్యాచ్ ల సిరీస్ లోని చివరి రెండు వన్డేలను రద్దు చేశారు. దాంతో ఇంగ్లండ్ క్రికెటర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. దాడుల నేపథ్యంలో ఆ తర్వాత జరగాల్సిన 2 మ్యాచ్ ల టెస్టు సిరీస్ పై సందిగ్ధత నెలకొంది. అయితే టెస్టు సిరీస్ ఆడటానికి మళ్లీ భారత్ కు తిరిగొచ్చింది ఇంగ్లీష్ జట్టు. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్, ముంబైలో కాకుండా అహ్మదాబాద్, చెన్నైలలో మ్యాచులు జరిగాయి. ఈ సిరీస్ లో కెవిన్ పీటర్సన్ నేతృత్వంలోని ఇంగ్లీష్ జట్టు భారత్ చేతిలో 1-0తో టెస్ట్ సిరీస్ కోల్పోయింది.

ఆ విషయాన్ని సునీల్ గవాస్కర్ గుర్తుచేస్తూ 2008లో ఇంగ్లండ్ చూపిన సానుకూల ధోరణిని మరచిపోకూడదని చెప్పాడు. ఉగ్రదాడి తర్వాత టెస్టు సిరీస్ కోసం ఇంగ్లీష్ జట్టు మళ్లీ భారత్ కు వచ్చిందని, ఇప్పుడు మనం కూడా అందుకు కృతజ్ఞత చూపించాలన్నాడు. సన్నీ తాజాగా సోనీ స్పోర్ట్స్‌ తో మాట్లాడుతూ 'రద్దయిన టెస్టును రీషెడ్యూల్ చేయడం సరైన నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. 26/11 దాడి తర్వాత ఇంగ్లండ్ చేసిన పనిని భారత్ మర్చిపోకూడదు. వారు మళ్లీ తిరిగొచ్చారు. భారత్ లో భద్రత ఉంటుందని భావించడం లేదు. అందుకే మేము అక్కడికి రాము అని చెప్పే పూర్తి హక్కు ఆరోజు ఇంగ్లండ్ కు ఉంది. కానీ వారు అలా అనలేదు అని తెలిపాడు.

2008లో కెవిన్ పీటర్సన్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు. ఇంగ్లండ్ జట్టు మళ్లీ రావడానికి అతడే ప్రధాన కారణం. ఆ రోజు నాకు భారత్ వెళ్లడం ఇష్టం లేదని కేపీ ఒక్క మాట అంటే, అక్కడే సిరీస్ ముగిసేది. కానీ అతడు అలా అనలేదు. అందరిని ఒప్పించాడు. దాంతో చెన్నైలో అద్భుతమైన టెస్ట్ మ్యాచ్ జరిగింది. చివరి రోజున భారత్ 380 పరుగులను ఛేజ్ చేసి విజయం సాధించింది. ఆ రోజు ఇంగ్లాండ్ చేసిన పనిని మరవద్దు అని అన్నాడు.