Begin typing your search above and press return to search.

ట్వీట్ తో గులాబీ పార్టీకి షాకివ్వబోయి.. తానే షాక్ తిన్నాడే?

By:  Tupaki Desk   |   17 Nov 2020 12:45 PM IST
ట్వీట్ తో గులాబీ పార్టీకి షాకివ్వబోయి.. తానే షాక్ తిన్నాడే?
X
సమకాలీన రాజకీయాల్లో కాస్తంత వాక్ శుద్ధితో పాటు.. విషయాల మీద అవగాహన ఉన్న కొద్ది మంది నేతల్లో సీనియర్ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఒకరు. ఏదైనా ఇష్యూను టేకప్ చేస్తే.. దాని గురించి లోతుగా అధ్యయనం చేస్తారన్న పేరు ఆయనకు ఉంది. ప్రజారాజ్యంలో మొదలైన ఆయన ప్రయాణం.. టీఆర్ఎస్ మీదుగా కాంగ్రెస్ వరకు వచ్చి ఆగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి తరచూ పంచ్ లు విసిరే ఆయన.. తాజాగా ఆయన ట్వీట్ ఆయనకే రివర్స్ అయ్యింది.

గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చాటటం ద్వారా పరువు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దుబ్బాక ఉపఎన్నికను మర్చిపోయి.. గ్రేటర్ ఎన్నికల్లో తమ అధిక్యతను ప్రదర్శించాలని భావిస్తున్న వేళ.. బీజేపీ దూకుడు ఆ పార్టీకి తెగ ఇబ్బందికరంగా మారిందంటున్నారు. ఇదిలా ఉంటే.. గ్రేటర్ ఎన్నికల వేళ.. టీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి పంచ్ లు విసిరేందుకు ట్వీట్ అస్త్రాన్ని ప్రయోగించారు దాసోజు.

అయితే.. అది కాస్తా తేడా కొట్టి.. మిస్ ఫైర్ కావటమే కాదు.. తిరిగి తనకే పంచ్ విసిరిన తీరు ఆసక్తికరంగా మారింది. ఏదో చేయబోతే.. మరేదో అయినట్లుగా తెలంగాణ అధికారపక్షాన్ని ఇరుకున పడేసేందుకు చేసిన ట్వీట్.. తిరిగి తిరిగి ఆయనకే పంచ్ విసిరింది. ఎందుకిలా అంటే.. దాసోజు వారి కవి మనసును ట్వీట్ రూపంలోకి మార్చటంలో దొర్లిన పొరపాటే కారణంగా చెప్పాలి.

దుబ్బాకలో ఓటర్ల దెబ్బకు కేసీఆర్ అండ్ కో.. మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో కూడా సీన్ రిపీట్ చేయాలని దాసోజు ట్విట్టర్ ఖాతాలో ఆయన పోస్టు చేసినట్లుగా ట్వీట్ ఉంది. ఇక్కడ దాసోజు ఉద్దేశం.. దుబ్బాకలో మాదిరి గ్రేటర్ లో సంచలన విజయం సాధించాలన్న ఉద్దేశంతో చేసినా.. అది కాస్తా రాంగ్ గా మారి.. బీజేపీ గెలవాలన్న భావన కలిగేలా చేసింది. దీంతో.. పలువురు ఆయనకు రిప్లై ఇస్తూ.. ఇక్కడ కూడా బీజేపీ గెలవాలనేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

దుబ్బాకలో మాదిరే టీఆర్ఎస్ కు గ్రేటర్ లో కూడా ఓటమి తప్పదన్న మెసేజ్ రాంగ్ గా వెళ్లటంతో దాసోజ్ మాస్టారు ఇప్పుడు డిఫెన్సులో పడిపోయారు. ఎన్నికల వేళలో ప్రత్యర్థి పార్టీకి పంచ్ లు వేసే క్రమంలో.. అది కాస్తా తిరిగి మీద పడేలా చేయొద్దు దాసోజు.. ఏమంటారు?