Begin typing your search above and press return to search.

బుడ్డోడికి అప్పుడే ట్విట్ట‌ర్ ఖాతానా చిన‌బాబు?

By:  Tupaki Desk   |   2 May 2019 10:58 AM GMT
బుడ్డోడికి అప్పుడే ట్విట్ట‌ర్ ఖాతానా చిన‌బాబు?
X
ప్ర‌జాజీవితంలో ఉన్న వారు ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండాల‌నుకోవ‌టం త‌ప్పేం కాదు. అందులో భాగంగా సోష‌ల్ మీడియాలో వీలైనంత యాక్టివ్ గా ఉంటూ.. ప్ర‌జ‌ల‌కు నేరుగా తాము చెప్పాల‌నుకోవ‌టాన్ని త‌ప్పు ప‌ట్ట‌లేం. కానీ.. ఆ పేరుతో చేసే కొన్ని సిత్రాల్ని మాత్రం త‌ప్ప‌నిస‌రిగా త‌ప్పు ప‌ట్టాల్సిందే. తాజాగా ఏపీ మంత్రి క‌మ్ ఏపీ సీఎం పుత్ర‌ర‌త్నం నారా లోకేశ్ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన ట్వీట్ల‌ను చూస్తే.. ఈ విష‌యం ఇట్టే తెలిసిపోతుంది.

త‌న కొడుకు దేవాన్ష్ గురించి చెబుతూ.. త‌ను చాలా త్వ‌ర‌గా పెద్ద‌వాడు అయిపోతున్నాడ‌ని.. అత‌నితో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌లేక‌పోతున్నానంటూ తాజాగా ఒక పోస్ట్ పెట్టారు. ఈ సంద‌ర్భంగా దేవాన్ష్ తో గ‌డిపిన మ‌ధుర క్ష‌ణాల‌కు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేశారు. కొడుకుతో గ‌డిపిన స‌మ‌యం త‌న‌కు ఎప్ప‌టికి గుర్తుండిపోతుంద‌న్నారు. ఇదంతా ఓకే.

కానీ.. ఈ ట్వీట్ల‌లోప‌లు మార్లు దేవాన్ష్ ను (@naradevaansh) ట్యాగ్ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. నాలుగేళ్ల చిన్నాడైన నారా దేవాన్ష్ పేరుతో ఫేస్ బుక్.. ఇన్ స్టా గ్రామ్ ల‌తో పాటు వివిధ సామాజిక మాధ్య‌మాల‌లో అకౌంట్లు తెర‌వ‌టంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అస‌లు ఇవ‌న్నీ అధికారిక అకౌంట్లా? కాదా? అన్న దానిపైనా క్లారిటీ లేదు. అయితే.. ఈ అకౌంట్ల‌లో ఎలాంటి యాక్టివిటీలు లేకున్నా.. పెద్ద ఎత్తున ఫాలోవ‌ర్స్ ఉండ‌టం విశేషం.

దేవాన్ష్ నారా పేరుతో ఉన్న ట్విట్ట‌ర్ అకౌంట్లో 1831 మంది (ఇది రాసే స‌మ‌యానికి) ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇప్ప‌టికి ఒక్క ట్వీట్ కూడా చేయ‌ని దానికి ఇంత‌మంది ఫాలోవ‌ర్స్ ఉండ‌టం ఒక విశేష‌మైతే.. నారా లోకేశ్ త‌న ట్వీట్ల‌లో కొడుకు పేరును ట్యాగ్ చేయ‌టం గ‌మ‌నించాల్సిన అంశం.

ట్విట్ట‌ర్ రూల్స్ ప్ర‌కారం 13 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కూ అకౌంట్ ను ఓపెన్ చేయకూడ‌దు. అయితే.. త‌న కొడుకు త‌ర‌ఫున లోకేశ్ ఓపెన్ చేశారో.. లేక మ‌రెవ‌రైనా చేశారో తెలీదు కానీ.. ఇంత చిన్న వ‌య‌సులో ఉన్న కొడుకు పేరును అదే ప‌నిగా ట్యాగ్ చేయాల్సిన అవ‌స‌రం ఏమిటో అర్థం కాదు. ఇక‌.. అకౌంట్ తెర‌వ‌టాన్ని స‌మ‌ర్థించే వారు లేక‌పోలేదు. పేరును వేరే వారు అకౌంట్ ఓపెన్ చేస్తే.. భ‌విష్య‌త్తులో ఇబ్బంది కాబ‌ట్టి.. ఇప్పుడే తెరిచార‌న్న మాట‌ను చెబుతున్నారు.

ఈ వాద‌న‌లో కాస్త విష‌యం ఉన్న‌ప్ప‌టికీ.. అదే నిజ‌మైతే.. ఇప్ప‌టినుంచే ఆ అకౌంట్ ను చిన‌బాబు త‌న ట్వీట్ల ద్వారా ప్ర‌మోట్ చేయాల్సిన అవ‌స‌రం ఏముంది? కాస్త పెద్దవాడైన వెంట‌నే.. చేతికి వ‌చ్చే సెల్ ఫోన్ (ఇప్ప‌టికే వ‌చ్చిందో లేదో మ‌న‌కు తెలీదు) తో సోష‌ల్ మీడియా మీద దృష్టి ప‌డ‌టం.. త‌న అకౌంట్ల గురించి తెలుసుకోవాల‌న్న ఆత్రుత‌.. అంత మంచిది కాదంటున్నారు. ఏమైనా.. ముందుచూపుతో త‌న కొడుకు పేరుతో అకౌంట్లు ఓపెన్ చేయ‌టాన్ని త‌ప్పు ప‌ట్ట‌లేం కానీ.. ఇలా ప్ర‌చారం చేయ‌టం మాత్రం స‌రికాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.