Begin typing your search above and press return to search.

రుతురాజ్.. అంత పొగరెందుకు?

By:  Tupaki Desk   |   20 Jun 2022 11:30 AM GMT
రుతురాజ్.. అంత పొగరెందుకు?
X
టీమిండియా యువ బ్యాట్స్ మన్ రుతురాజ్ గైక్వాడ్ నెటిజన్ల ట్రోలింగ్ కు దొరికిపోయాడు. తన ప్రవర్తనతో అడ్డంగా బుక్కయ్యాడు. కెరీర్ ప్రారంభంలోనే ఇంత అహంకారమా? అంటూ విమర్శలకు గురవుతున్నాడు. పెద్దపెద్ద క్రికెటర్లకే లేని పొగరు నీకెందుకు? అంటూ అతడిని నెటిజన్లు ఆడుకుంటున్నారు. మైదానంలో ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆట తీరు ఎలా ఉన్నా.. మనుషులతో వ్యవహరించే ధోరణి ఇదేనా అని అతడిని నిలదీస్తున్నారు.

ఇంతకూ జరిగిందేమంటే..?

దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ కు టీమిడియా సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో దక్షిణాఫ్రికా సిరీస్ కు రుతురాజ్ రెగ్యులర్ ఓపెనర్ అయ్యాడు. సిరీస్ లోని ఐదు మ్యాచ్ ల్లోనూ అతడే ఓపెనింగ్ చేశాడు. పరుగులు సాధించడం ఎలా ఉన్నా.. అతడి ప్రతిభపై జట్టు మేనేజ్ మెంట్ నమ్మకం ఉంచింది. మంచి టెక్నిక్.. బంతిని సొగసుగా బాదే బ్యాటింగ్ శైలి.. సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచే తీరుతో రుతురాజ్ భవిష్యత్ క్రికెట్ తారగా పేరుగాంచాడు.

కానీ, అతడి వ్యవహార శైలే ఇప్పడు చర్చనీయాంశమైంది. వాస్తవానికి రుతురాజ్.. ప్రశాంతంగానే కనిపిస్తాడు. కానీ, లోపలి మనిషి ఎలా ఉంటాడనేది ఎవరూ చెప్పలేరు కదా..? అలాంటి సందర్భమే ఆదివారం దక్షిణాఫ్రికాతో ఐదో టి20 సందర్భంగా ఎదురైంది. రుతురాజ్ బ్యాటింగ్ కు దిగేందుకు ప్యాడ్లు కట్టుకుని సిద్ధమవగా.. వర్షం అంతరాయం కారణంగా డగౌట్ కే పరిమితం అయ్యాడు. ఈ సమయంలో గ్రౌండ్స్ మన్ ఒకరు అతడికి అతి సమీపానికి వచ్చి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. కానీ, రుతురాజ్ అతడిని ''దూరం జరుగు''అనే తరహాలో వారించి పంపించి వేశాడు. ఇదే విషయం ఇప్పుడు అతడిపై విమర్శలకు కారణమవుతోంది.

సీనియర్లు, దిగ్గజాలు ఎవరూ అలా చేయలే?

టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వరకు ఎవరూ అభిమానులతో ఇలా ప్రవర్తించిన సందర్భాలు లేవు. సచిన్ ఎక్కడ ఎవరికి ఎదురుపడినా.. చిరునవ్వుతో ఫొటో దిగేందుకు అవకాశం ఇచ్చేవాడు. ధోనీ కోసమైతే అభిమానులు నేరుగా మైదానంలోకి దూసుకొచ్చిన సందర్భాలెన్నో. కానీ, అతడు వారిని వారించకుండా కోరినట్లు వ్యవహరించేవాడు.

కోహ్లి, రోహిత్ కూడా అభిమానుల విషయంలో అంతే హుందాగా ప్రవర్తించేవారు. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ కెరీర్ ప్రారంభిస్తున్నరుతురాజ్ మాత్రం చాలా గర్వంగా ప్రవర్తించాడు. ఇదే నెటిజన్లకు కంటగింపుగా మారింది. ఆ విషయంలో రుతురాజ్ సీనియర్లను ఆదర్శంగా తీసుకుంటే మంచిది. అంతేకాదు.. కుర్రాడు.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చాడు కాబట్టి తెలిసీ తెలియక అతడు చేసిన పనిని నెటిజన్లు మన్నించాల్సిన అవసరం కూడా ఉంది.

ఆడింది అంతంతే..

దక్షిణాఫ్రికా సిరీస్ లో ఐదు మ్యాచ్ ల్లోనూ 25 ఏళ్ల రుతురాజ్ ఓపెనర్ గా వచ్చాడు. కానీ, ఒక్క మ్యాచ్ లోనే అతడు రాణించాడు. 23, 1, 57, 5, 10 ... ఇవీ అతడి స్కోర్లు. మూడో టి20లో తప్ప దేనిలోనూ అతడు రాణించలేదు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్బుతంగా ఆడుతుంటే.. రుతురాజ్ మాత్రం తేలిపోయాడు. ఫలితంగా అతడు అవకాశాలను చేజార్చుకున్నాడనే విమర్శలు వస్తున్నాయి.