Begin typing your search above and press return to search.

తొందరపడటం ఎందుకు? ఇలా దొరికిపోయి తిట్లు తినటం ఎందుకు లోకేశా?

By:  Tupaki Desk   |   5 Sept 2021 9:20 AM IST
తొందరపడటం ఎందుకు? ఇలా దొరికిపోయి తిట్లు తినటం ఎందుకు లోకేశా?
X
చీమ చిటుక్కుమన్నా.. అది ఏపీ సర్కారు చేసే పాడు పనిగా అభివర్ణించటం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్ కు ఒక అలవాటు. అదే ఆయన్ను తరచూ అడ్డంగా బుక్ అయ్యేలా చేయటమే కాదు.. అభాసుపాలు అవుతున్నారు. ఏదైనా ఒక విషాదం చోటుచేసుకున్నంతనే వెంటనే.. దాన్ని ప్రభుత్వానికి ఆపాదించేసి.. విమర్శలతో విరుచుకుపడి.. జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేయాలన్న తపన..తొందర కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే అలవాటు ఆయనకు తలనొప్పిగా మారటమే కాదు.. తల పట్టుకునేలా చేసిందని చెప్పాలి. ఇంతకూ ఏం జరిగిందంటే..

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి విష్ణు అనే బాలుడు మరణించటం తెలిసిందే. అయితే.. ఇదంతా ఏపీ ప్రభుత్వ వైఫల్యం.. నిర్లక్ష్యంతోనే అంటూ లోకేశ్ సోషల్ మీడియా టీం ఆగమాగం చేస్తోంది. అంతేకాదు.. ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేశారు. నాడు బడి - నేడు పాడుబడి అంటూ సోషల్ మీడియాలో ఆయన క్యాప్షన్ చూసినంతనే ఆకర్షించేలా ఉన్నా.. అసలు వాస్తవాలు తెలిసిన వారు మాత్రం తిట్టిపోస్తున్నారు. చిన్నారి మరణాన్ని సైతం వదిలిపెట్టకుండా పాడు రాజకీయం చేస్తారా? అని మండిపడుతున్నారు.

ఆగస్టు 29న (ఆదివారం) ఆడుకోవటానికి వెళ్లిన విష్ణు.. నాడు - నేడు జాబితాలో లేని శిదిలావస్థలో ఉన్న స్కూలు భవనం వద్దకు వెళ్లి ఆడసాగాడు. అనూహ్యంగా స్లాబ్ కూలిపోవటంతో ఆ చిన్నారి మరణించాడు. దీనికి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం.. అవినీతి కారణంగానే ఇదంతా జరిగిందని.. బాలుడు చనిపోయాడంటూ తప్పుడు కథనాల్ని వండేశారు. అయితే.. ఆ బాలుడు చదువుతున్నది ప్రభుత్వ పాఠశాలలో కాదని.. ప్రైవేటు స్కూల్లో అన్న విషయం బయటకు వచ్చింది. ట్వీట్ లో పేర్కొన్న అంశాలకు.. వాస్తవాలకు ఏ మాత్రం పొంతన లేకపోవటంతో లోకేశ్ తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఏపీలో ఏం జరిగినా అదంతా జగన్ వైఫల్యమన్నట్లుగా హడావుడి చేయటం సరికాదంటున్నారు. ఉత్సాహం ఉండాల్సిందే. కానీ.. అత్యుత్సాహం మొదటికేమోసం తీసుకొస్తుంది. ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేస్తుందన్న విషయాన్ని లోకేశ్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.