Begin typing your search above and press return to search.

రాముడి కోవెలా.. రాజకీయ వేదికా... ?

By:  Tupaki Desk   |   22 Dec 2021 10:30 AM GMT
రాముడి కోవెలా.. రాజకీయ వేదికా... ?
X
రాముడికి శత్రువులు ఎవరూ లేరు. ఆయన అందరి వాడు. మర్యాద పురుషోత్తముడు. కానీ రాముడు చుట్టూ ఎంత రాజకీయం నడచింది అన్నది ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామాలయాన్ని చూస్తే అర్ధమవుతుంది. మరి ఏపీలో కూడా అలాంటివే జరుగుతున్నాయా అన్న అనుమానాలు అందరికీ ఉన్నాయి.

ఉమ్మడి ఏపీలో భద్రాద్రి రామాలయం దక్షిణ అయోధ్యగా ఉండేది. ఇక ఏపీలో చూసుకుంటే ఉత్తరాంధ్రా వాసులకు మరో భద్రాద్రిగా విజయనగరం జిల్లా రామతీర్ధం ఉంటూ వస్తోంది. చంద్రబాబు సీఎం అయిన తరువాత ఏపీలో రామనవమి ఉత్సవాలను అధికారికంగా రామతీర్ధాలులోనే నిర్వహిస్తారని, ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని అంతా అనుకున్నారు.

కానీ అది జరగలేదు. కడప జిల్లాలోని ఒంటిమెట్ట రామాలయాన్నే అధికారికంగా నాటి టీడీపీ సర్కార్ ప్రకటించింది. ఇక విజయనగరం జిల్లా రామతీర్ధంలో చాలా చిన్న ఆలయమే ఉంది. పైగా అక్కడ ఎలాంటి అభివృద్ధి అన్నది పెద్దగా నోచుకోలేదు. ఇక ఇక్కడే బోడికొండ మీద శ్రీ కోదండరామిస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పునరుద్ధరించకపోవడం వల్ల భక్తులు కూడా పెద్దగా వెళ్ళేందుకు ఆలోచిస్తారు. సరైన నడక మార్గానికి ఏ విధమైన సదుపాయం కూడా ఇక్కడ లేదు.

ఈ నేపధ్యంలో గత ఏడాది డిసెంబర్ లో కోదండరామస్వామి వారి ఆలయంలో దుండగులు అరాచకం చేయడం, ఏకంగా రాముల వారి శిరస్సుని ఖండించడం వంటివి చేశారు. దాంతో రామభక్తులు అంతా కూడా ఎంతో బాధపడ్డారు. అయితే ఆ తరువాత నాడు జరిగింది అంతా కూడా ఫక్తు రాజకీయమే. రామభక్తుల పేరిట రాజకీయ పార్టీలు తెర తీసింది కూడా రాజకీయ రచ్చ మాత్రమే.

మొత్తానికి ప్రభుత్వం కూడా తలొగ్గి ఈ ఆలయాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ఏడాది గడచింది. ఇన్నాళ్ళకు ఈ ఆలయానికి శంకుస్థాపన జరగడం అంటే ఒక విధంగా లేటే అనుకోవాలి. అయితే అది కూడా సాఫీగా జరగకుండా మళ్ళీ ఇక్కడ రాజకీయం చోటు చేసుకుంటోంది.

దానికి కారణం అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ అని గట్టిగా చెప్పాలి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్న పూసపాటి అశోక్ గజపతిరాజు టీడీపీలో కీలకనేత. దాంతో రామాలయం రగడ కాస్తా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న తీరుగా సాగుతోంది. శంకుస్థాపన వేళ కూడా అలాంటి సన్నివేశాలే కనిపించాయి.

రెండు వైపులా కూడా రాజకీయమే పండించుకుందామన్న తాపత్రయం తప్ప ఆధ్యాత్మికత గురించి ఆలోచించేవారే లేరు అనే చెప్పాలి. ప్రభుత్వ వర్గాలు ఆలయ ధర్మకర్త అశోక్ ని ప్రోటోకాల్ ప్రకారం సంప్రదించి ఉండాల్సింది. ఆయన సలహా సూచనలూ పాటించి ఉండాల్సింది. అయితే ఎక్కడ ఆయనకు క్రెడిట్ వస్తుందో అని వారు ఆలోచించారు. అది పూర్తిగా తమ ప్రభుత్వ కార్యక్రమంగా తమ పార్టీ కార్యక్రమంగా వారు భావించడమే రగడకు ప్రధాన కారణం.

మరో వైపు చూస్తే అశోక్ గజపతిరాజు సైతం శిలాఫలకాన్ని తొలగించాలని చూడడం కూడా కొంత దూకుడు చర్య అనే అంటున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఆయన దీక్ష చేస్తూ రాజకీయ‌ విమర్శలే చేయడం కూడా పాలిటిక్స్ నే అద్దంపడుతోంది అంటున్నారు. మొత్తానికి చూస్తే అటూ ఇటూ కూడా రాముడి పేరు చెప్పి రాజకీయాలనే చేయాలని చూశారని అర్ధమవుతోంది. ఇంకో విషయం కూడా ఇక్కడ పేర్కొనాలి. అశోక్ గజపతి వంటి పెద్ద మనిషిని నెట్టాలని చూడడం మాత్రం దారుణమే అంటున్నారు.

అయితే అశోక్ లాంటి సీనియర్, పెద్ద మనిషి శిలాఫలకం తొలగించాలని చూడడమూ పొరపాటే అన్న విమర్శ‌లూ ఉన్నాయి. ఏది ఏమైనా గత ఏడాది తప్పు జరిగింది. దాన్ని దిద్దుకునే దిశగా ఆలయ్యాన్ని అభివృద్ధి చేయడం అంతా హర్షించేదే. కానీ అదే సమయంలో రాజకీయాలు అటూ ఇటూ చోటు చేసుకోవడమే బాధాకరమని ఆస్థిక జనులు అంటున్నారు.

తాము మంచి కార్యక్రమం చేస్తే ఓర్వలేకనే టీడీపీ వారు ఇలా చేస్తున్నారని విజయనగరం జిల్లా పరిషత్తు చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అంటున్నారు. ఇక ప్రోటోకాల్ ని పాటించకపోవడం కంటే పెద్ద తప్పు ఉంటుందా అని అశోక్ అంటున్నారు. మొత్తానికి ఈ వివాదాలు ఆగవు, ఈ రాజకీయమూ ఆగదు, దాన్ని పైన ఉన్న రాములోరు అలా చూస్తూనే ఉంటారు, భక్తజనులూ కళ్ళప్పగించి చూడాల్సిందే.