Begin typing your search above and press return to search.

నిజమే.. కనిమొళి అడిగిన దాన్లో న్యాయం ఉంది బాస్

By:  Tupaki Desk   |   4 Jan 2022 6:30 AM GMT
నిజమే.. కనిమొళి అడిగిన దాన్లో న్యాయం ఉంది బాస్
X
మగ.. ఆడ అన్న తేడా లేదని చెప్పినా.. జెండర్ కు సంబంధించిన ఇష్యూల వరకు వచ్చేసరికి.. ఎవరి బాధ వారికే ఎక్కువగా తెలుస్తుంది. మగాళ్లకు ఉండే ఇబ్బందులు వారికే బాగా తెలిసినట్లుగా.. ఆడవారి విషయాలు.. వారి కంటే బాగా మగాళ్లకు తెలిసే అవకాశమే లేదు. మరి.. అలాంటప్పుడు కేంద్రంలోని మోడీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకునే వేళ.. ఆ చిన్న విషయాన్ని ఎలా మిస్ అవుతారు? దేశంలో అమ్మాయిల పెళ్లి వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలనుకోవటం తెలిసిందే. అయితే.. ఈ ప్రతిపాదనపై పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటివేళ.. ఈ ఇష్యూ లెక్క తేల్చేందుకు వీలుగా బీజేపీ నేత వినయ్‌ సహస్రబుద్దే నేతృత్వంలోని 31 మందితో కూడిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే పెద్ద తేడా దొర్లింది. పూర్తిగా ఆడవాళ్లకు సంబంధించిన ఈ ఇష్యూ మీద ఒక నిర్ణయాన్ని వెల్లడించేందుకు ఒక్కరంటే ఒక్క మహిళను ఎంపిక చేయటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ కమిటీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితా దేవ్‌ ఒక్కరే మహిళ కావటం గమనార్హం. అలా అని పార్లమెంటులో మహిళలు లేరా? అంటే.. ఏకంగా 110 మంది ఉన్నారు. అంతమంది మహిళలు ఉన్నప్పుడు.. వారికి సంబంధించిన విషయాన్ని వారి అభిప్రాయాలకు పెద్దపీట వేయాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వ్యవహరించటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.

ఇప్పటికే ఈ కమిటీ ఏర్పాటుపై పలువురు తప్పు పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా స్పందించారు. స్త్రీలకు ఏ హక్కులు ఉండాలనేదిఇంకా మగాళ్లే నిర్ణయిస్తున్నారు. మహిళలను మౌన ప్రేక్షకుల్లా మార్చేస్తున్నారని ట్విటర్ లో ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. స్త్రీలకు సంబంధించిన అంశంపై మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉన్న కమిటీ అధ్యయనం చేస్తుందనే విషయం తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోందన్నారు.

ఈ బిల్లుపై జరిగే చర్చల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం.. భాగస్వామ్యం ఉండేలా చూడాలని మిమ్మల్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. అందరి వాదనలు అవసరమే.. అయితే.. ఈ అంశంలో మాత్రం మహిళల అభిప్రాయాల్ని స్టాండింగ్ కమిటీ వినటం.. అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఒక కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నప్పుడు.. దాన్ని అమలు చేసే విషయంలోనూ.. అంతే కమిట్ మెంట్ ఉందన్న విషయం తెలిసేలా ఉండాలి కదా? ఈ విషయాన్ని మోడీ సర్కారు ఎలా మిస్ అయినట్లు?