Begin typing your search above and press return to search.

'హచ్...'అలా అలా చేతులు మారి.. సర్కారు పరం

By:  Tupaki Desk   |   11 Jan 2022 10:30 AM GMT
హచ్...అలా అలా చేతులు మారి.. సర్కారు పరం
X
అవి దేశంలో సెల్ ఫోన్ శకం మొదలైన రోజులు... అప్పుడు వచ్చేది ఓ సెల్యులార్ సంస్థ ప్రకటన.. మిగతావాటికి భిన్నంగా.. ఓ పగ్ బ్రీడ్ కుక్క పిల్లతో అందరినీ ఆకట్టుకునేది. ఆ కుక్క పిల్ల దాని యజమాని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉండేది. ఆ యాడ్ ఉద్దేశం సెల్ ఫోన్ ఆపరేటర్ సంస్థకు ప్రచారమైతే.. చివరకు ఆ కుక్క పిల్ల బ్రీడ్ కు ఎక్కువ ప్రచారం వచ్చింది. చాలాకాలం పాటు ప్రజల నోట్లో నానిన ఆ యాడ్... చివరకు ఎవరైనా ఒకరిని అంటిపెట్టుకుని తిరుగుతుంటే హచ్ కుక్క పిల్లలా తిరుగుతున్నావేంటి? అనే వరకు వచ్చింది. ఇదంతా సెల్యులార్ సంస్థ
హచ్ కంపెనీ గురించి.. మంచి యాడ్ లు, చక్కటి ప్యాకేజీలతో తొలినాళ్లలో ఆదరణ చూరగొన్న ఈ సంస్థ తర్వాత వెనుకబడింది. పోటీ మార్కెట్ లో నిలదొక్కుకోలేకపోయింది.

తర్వాత వొడాఫోన్ ఐడియాగా మారింది. దేశంలో మూడో అతి పెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవించింది. ఇప్పుడా వొడాఫోన్‌ – ఐడియా లిమిటెడ్‌లో మెజార్టీ వాటాలు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయాయి. బకాయిలను ఈక్విటీగా మార్చిన తర్వాత వొడాఫోన్ ఐడియాలో 35.8 శాతం వాటా సర్కార్‌ చేతిలోకి వెళ్లింది.. దీనిపై ఆ సంస్థ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

షేర్లు భారీగా పతనం ఈ పరిణామాల తర్వాత స్టాక్‌ మార్కెట్‌లో వొడాఫోన్‌ ఐడియా షేర్లు భారీగా పడిపోయాయి... టెలికం మార్కెట్‌లో పోటీ కారణంగా.. కస్టమర్లను భారీగా కోల్పోతున్న తరుణం, పెద్దగా లాభాలు లేని పరిస్థితులు ఉండడంతో ఈ చర్య తప్పడం లేదంటూ ఆ కంపెనీ సమర్థించుకుంది.. సోమవారం జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ వాటాకు అంగీకారం లభించింది.. ఇప్పటి వరకు యూకేకు చెందిన వొడాఫోన్‌ గ్రూప్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ 28.5 శాతం వాటాలు కలిగి ఉండగా, కుమార్ మంగళం బిర్లా ఆధ్వర్యంలోని ఆదిత్యా బిర్లా గ్రూప్‌కు 17.8 శాతం వాటా ఉంది. తాజా నిర్ణయంతో భారత ప్రభుత్వం వాటా 36 శాతానికి పెరిగింది.

అతిపెద్ద వాటాదారుగా కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసిన స్పెక్ట్రమ్‌పై వడ్డీ, సర్దుబాటు చేసిన స్థూల రాబడి బకాయిలను ఈక్విటీగా మార్చాలని నిర్ణయించుకున్నందున కేంద్ర ప్రభుత్వం వొడాఫోన్‌ ఐడియాలో అతిపెద్ద వాటాదారుగా అవతరించింది. గత అక్టోబర్‌లో కేంద్రం తన టెలికాం సంస్కరణల ప్యాకేజీలో టెలికాం కంపెనీలకు స్పెక్ట్రమ్, ఏజీఆర్ బకాయిలపై నాలుగు సంవత్సరాల మారటోరియం మంజూరు చేసింది.

వాయిదా వేసిన అప్పులపై వడ్డీని ఈక్విటీగా మార్చుకునే అవకాశం కూడా ఇచ్చింది. అయితే, ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా మారవచ్చు, కంపెనీని నడపడంలో పాలుపంచుకోకపోవచ్చు అని గతంలోనే వొడాఫోన్‌ ఐడియా సీఈవో రవీందర్ టక్కర్ తెలిపారు. కంపెనీని ప్రభుత్వ రంగ సంస్థగా మారుస్తుందని పేర్కొనడం సరికాదన్న ఆయన.. మేం కంపెనీని సమర్ధంగా,పోటీతత్వంతో నడపాలని ప్రభుత్వం కోరుకుంటోంది.. ప్రభుత్వంతో నేను జరిపిన సంభాషణలన్నింటిలోనూ, భారతదేశంలో టెలికాం కంపెనీలను కొనుగోలు చేయడం, నిర్వహించడం పట్ల ఆసక్తి లేదని స్పష్టంగా ప్రభుత్వం చెప్పిందని టక్కర్ తెలిపారు.