Begin typing your search above and press return to search.

వామపక్షాలు ఏకమవుతాయా ?

By:  Tupaki Desk   |   28 Dec 2021 7:30 AM GMT
వామపక్షాలు ఏకమవుతాయా ?
X
ఈ ప్రశ్న దశాబ్దాలుగా వినబడుతూనే ఉన్నాయి. వామపక్షాల ఐక్యత కోసం ఒకసారి సీపీఐ ప్రతిపాదిస్తే సీపీఎం ఏమీ మాట్లాడలేదు. మరోసారి సీపీఎం ప్రతిపాదించినపుడు సీపీఐ స్పందించదు. దీంతో ప్రతిపాదన ప్రతిపాదన గానే దశాబ్దాలుగా సాగుతోంది. ఇదంతా ఇపుడు ఎందుకంటే అమరావతి కేంద్రంగా తాడేపల్లిలో సీపీఎం మహాసభలు ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా వామపక్షాల ఐక్యత విషయంలో మరోసారి చర్చ మొదలైంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వామపక్షాల ఐక్యతకు పిలుపిచ్చారు.

వాస్తవానికి వామపక్షాలు ఏకమైపోయినా, విడివిడిగా ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదనే అనుకోవాలి. ఎందుకంటే రెండు పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో బాగా బలహీన పడిపోయాయి. వాటి ప్రస్తుత పరిస్థితులు ఏమిటంటే ఏవో ఉన్నాయంటే ఉన్నాయన్నట్లుగా కంటిన్యు అవుతున్నాయంతే. ఎక్కడైనా ధర్నాలకు, లేకపోతే మీడియా సమావేశాలకు మాత్రమే వామపక్షాలు పనికొస్తున్నాయి. ఒకపుడు ఎంతో గట్టిగా ఉన్న రెండు పార్టీలు ఇపుడీ స్థితికి ఎందుకు దిగజారిపోయాయి ?

ఎందుకంటే ప్రజల్లో ఆదరణ కోల్పోయాయి కాబట్టే. ఒకపుడు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్టీ నేతలు, కార్యకర్తలు 24 గంటలు రోడ్లపైనే ఆందోళనలు చేస్తు కనిపించేవారు. కానీ ఈ రోజున ఎక్కువగా మీడియా సమావేశాల్లో మాత్రమే కనబడుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లుగా తాము నడుచుకోకుండా కొందరు వ్యక్తుల ప్రభావానికి వామపక్షాలు ప్రధానంగా సీపీఐ లొంగిపోతోందనే ఆరోపణలు అందురు వింటున్నదే. దీనికి ఉదాహరణగా తీసుకుంటే అమరావతి రాజధాని రైతుల ఎపిసోడే నిదర్శనం

రైతుల నుండి బలవంతంగా భూమిని సమీకరించి రాజధానిని నిర్మిస్తున్నారని చంద్రబాబునాయుడుపై ఆరోపణలు చేశాయి ఈ పార్టీలు. మళ్లీ ఇపుడు చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అమరావతిలోనే రాజధాని ఉండాలంటు ఆందోళనలు చేస్తున్నాయి. ఇలాంటి అనేక సందర్భాల్లో జనాల ఆలోచనలతో సంబంధాలు లేకుండా వామపక్షాలు తమదారిలో తాము వెళుతున్నాయి. అందుకనే జనాల మద్దతు కోల్పోయాయి. సీపీఐ అయితే మరీ తోక పార్టీ లాగా అయిపోయింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కలిసినా, విడిగా ఉన్నా పెద్దగా తేడా అయితే కనబడదు.