Begin typing your search above and press return to search.

బోండా ఉమా... పలుకే బంగారమా.. ?

By:  Tupaki Desk   |   7 Jan 2022 2:30 AM GMT
బోండా ఉమా... పలుకే బంగారమా.. ?
X
ఆయన టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. మీడియా ముందుకు వచ్చారంటే బాంబులే పేలుస్తారు. ఆ మధ్యన మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినపుడు చంద్రబాబు దీక్ష చేసిన చోట బోండా ఉమా మాటల దూకుడు చూసిన వారికి వెన్నులో వణుకే పుట్టింది. మీ పార్టీ ఆఫీస్ కి వచ్చి ఇలాగే చేస్తామంటూ వైసీపీకే నాడు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బోండా ఉమా క్రిష్ణా జిల్లాలో నోరు ధాటి ఉన్న నేత. టీడీపీకి సదా కాపు కాసే నాయకుడు. చంద్రబాబు మెచ్చిన నేత కూడా.

అలాంటి బోండా ఉమా సడెన్ గా సైలెంట్ అయ్యారు. అదే క్రిష్ణా జిల్లాలో వంగవీటి రాధా ఎపిసోడ్ ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. తన ఇంటి ముందు రెక్కి నిర్వహించారని, తనను చంపేందుకు ప్లాన్ చేశారంటూ రాధా ఈ మధ్యన చేసిన ఆరోపణలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఆయనకు భద్రతను పెంచుతూ వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు ఏకంగా ఇంటికి వెళ్లి రాధాను పరామర్శించి వచ్చారు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా రాధా ఇంటికి వెళ్ళి భరోసా ఇచ్చారు.

మరి ఇంత జరిగినా రాధా సామాజికవర్గానికి చెందిన నాయకుడు, టీడీపీలో కీలక నేత అయిన బోండా ఉమా మాత్రం ఎక్కడా అయిపూ అజా లేరు అంటున్నారు. ఆయన పెదవి విప్పితే ఒట్టు అన్నట్లుగా తయారయ్యారు అంటున్నారు. దీని మీద సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది. ఏ చిన్న విషయం జరిగినా మీడియా ముందుకు వచ్చేసే బోండా ఉమ కాపులకు ఐకాన్ లాంటి రంగా కుమారుడు రాధా విషయంలో ఎందుకిలా మౌనం దాల్చారు అన్నదే అంతుబట్టడంలేదుట.

రాధాక్రిష్ణతో ఏమైనా ఉమాకు విభేధాలు ఉన్నాయా అన్న చర్చ కూడా ఇదే సందర్భంగా సాగుతోంది. నిజానికి రాధా 2019 దాకా వైసీపీలో ఉన్నారు. తనకు విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వలేదు అన్న కారణంతో ఆయన ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. అక్కడ కూడా ఆయన కోరుకున్న సీటు లభించలేదు. ఇదిలా ఉంటే ఆ ఎన్నికల్లో సెంట్రల్ నుంచి బోండా ఉమా పోటీ చేశారు. అయితే రాధా నాడు తనకు సహాయ నిరాకరణ చేయడం వల్లనే స్వల్ప తేడాతో ఓడానన్న బాధ ఏదో బోండా ఉమలో ఉందని అంటారు.

నాటి నుంచే ఆయన రాధా విషయంలో అలా ఎడం పాటిస్తున్నారు అన్న మాటా ఉందిట. ఇక రాధాకు టీడీపీలో ప్రాముఖ్యత కనుక లభిస్తే తనకు భవిష్యత్తు రాజకీయాల్లో ఇబ్బందులు వస్తాయని కూడా ఉమా అంచనా వేసుకుంటున్నారు అని కూడా అంటున్నారు. రాధా రంగా కుమారుడు. ఈసారి ఆయన కోరుకున్న సీటు అయితే చంద్రబాబు కచ్చితంగా ఇవ్వకతప్పదు. అది అటూ ఇటూ తిరిగి విజయవాడ సెంట్రల్ అయితే కచ్చితంగా బోండా ఉమాకే ఇబ్బంది.

పోనీ ఉమ సీటుని అలా ఉంచి తూర్పు నుంచి రాధాను పోటీ చేయించినా కూడా ఉమాకు ఇరకాటమే. రేపటి రోజున టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవిని చేపట్టాలని బోండా ఉమా ఇప్పటి నుంచే ఆశపడుతున్నారు. రాధా కనుక సీన్ లో ఉంటే ఆయనకే ఫస్ట్ ప్రయారిటీగా మంత్రి పదవి దక్కడం ఖాయం. మరో వైపు పార్టీలో చూసుకుంటే ఎంపీ కేశినేని నానితో విభేదాలు బోండా ఉమాకు ఉన్నారు. నాగుల్ మీరా. బుద్ధా వెంకన్న బోండా ఉమా ముగ్గురూ ఒక వర్గంగా క్రిష్ణా జిల్లా టీడీపీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

ఇపుడు కేశినేని నాని రాధాను దువ్వుతున్నారు. ఆయన్ని ముందు పెట్టి రాజకీయం నడపాలనుకుంటున్నారు. దాంతో అది నేరుగా బోండా ఉమాకే రాజకీయ చిక్కులను తెచ్చిపెడుతుంది అని ఆయన భయపడుతున్నారు. మొత్తానికి చూసుకుంటే రాధా తన మీద ఎవరో హత్యాయత్నం చేశారు అని ఆరోపించడంతోనే ఆయనకు ఒక్కసారిగా విలువ పార్టీలో పెరిగింది. ఇక నిన్నటి వరకూ ఎలా ఉన్నా ఇపుడు రాధా కచ్చితంగా టీడీపీలోనే కొనసాగుతారు అని అంటున్నారు. దాంతో రాధా హవా ముందు తాము తేలిపోతామన్న కలవరం ఏదో బోండా ఉమాలో ఉందనే అంటున్నారు. అందుకే ఆయన సైలెంట్ అయ్యారని కూడా చెబుతున్నారు.

అయితే బోండా ఉమా ప్రస్తుతం విజయవాడలో లేరని, విదేశాల్లో ఉన్నారని, ఆయన వచ్చిన తరువాత తప్పకుండా రాధా ఇంటికెళ్ళి పరామర్శిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే కనీసం ఫోన్ అయినా బోండా ఇప్పటివరకూ రాధాకు చేయకపోవడం వల్లనే ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. మొత్తానికి చూసుకుంటే బోండా ఉమా మౌనం వెనక ఏముందో చూడాల్సిందే.