Begin typing your search above and press return to search.

ప్రపంచంలో మరే కంపెనీకు లేని ఘనత 'యాపిల్' సొంతమైంది

By:  Tupaki Desk   |   5 Jan 2022 7:30 AM GMT
ప్రపంచంలో మరే కంపెనీకు లేని ఘనత యాపిల్ సొంతమైంది
X
తెలుగులో మూడక్షరాలు.. ఇంగ్లిషులో ఐదు అక్షరాల ఈ కంపెనీ పేరు విన్నంతనే.. దాని ఉత్పత్తులు కొనాలన్న తహతహ ప్రపంచంలోని ప్రతి ఒక్కరు పొందుతారు. ఒకసారి ఆ సంస్థ ఉత్పత్తుల్ని వాడటం మొదలు పెడితే.. దాని మ్యాజిక్ లో మునిగిపోయి.. మళ్లీ అందులో నుంచి బయటకు రాని టాలెంట్ దాని సొంతం. అదే.. యాపిల్. ప్రపంచంలో మరే కంపెనీ సాధించలేని ఘనతను తాజాగా ఆ కంపెనీ సొంతం చేసుకుంది. యాపిల్ మార్కెట్ తాజా విలువ ఏకంగా 3 లక్షల కోట్ల డాలర్లు..అదే మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.225 లక్షల కోట్ల మైలురాయిని దాటేసింది. ఈ ఘనతను సాధించిన తొలి కంపెనీగా యాపిల్ నిలిచింది. మరో విశేషం ఏమంటే.. ఈ విలువ.. మన దేశ జీడీపీతో సమానం కావటం గమనార్హం.

తాజాగా యాపిల్ మార్కెట్ షేరు విలువ 182.86 డాలర్లకు చేరుకుంది. దీంతో.. ఈ ఘనతను సాధించింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. నాలుగేళ్ల లోపే కంపెనీ మార్కెట్ విలువ మూడింతలు పెరిగింది. కరోనా సంక్షోభం చాలా కంపెనీలకు ఉరితాడులా మారితే.. టెక్నాలజీ సంస్థలకు మాత్రం అదో వరంగా మారటం తెలిసిందే. నిజానికి అమెరికా స్టాక్ మార్కెట్ ముందడుగులు వేయటానికి ఈ టెక్నో కంపెనీలే అండగా నిలిచాయి. ఇక.. యాపిల్ విషయానికి వస్తే నాలుగు దశాబ్దాల క్రితం అంటే.. 1980లో స్టాక్ మార్కెట్ లో ఈ కంపెనీ లిస్టు అయిన వేళ దీని మార్కెట్ విలువ కేవలం 180 కోట్ల దాటర్లు మాత్రమే.

అలా మొదలైన దాని ప్రయాణం.. తొలి లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువకు చేరుకోవటానికి 2018 ఆగస్టు వరకు పట్టింది. కంపెనీ ప్రారంభించిన 38 ఏళ్లకు మొదటి లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువకు చేరుకోవటానికి సమయం పడితే.. అక్కడి నుంచి రెండో లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువను సొంతం చేసుకోవటానికి 24 నెలలు మాత్రమే పట్టింది. మరింత ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మూడో లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని చేరుకోవటానికి యాపిల్ కు కేవలం 16 నెలల సమయాన్ని మాత్రమే తీసుకుంది.

యాపిల్ సత్తా ఏమిటన్న విషయాన్ని ఒక ఉదాహరణలో చెప్పాలంటే.. భారత ఐటీ సంస్థల వద్ద ఉన్న మొత్తం నగదు నిల్వలు కలిపినా కూడా యాపిల్ వద్ద ఉన్న నగదు నిల్వలే ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలోని 186 దేశాల జీడీపీ విలువ కంటే యాపిల్ మార్కెట్ విలువ ఎక్కువ. మన దేశ జీడీపీ 2.62 లక్షల కోట్ల డాలర్లు మాత్రమే. మరో ఆసక్తికరమైన పోలికను చెప్పాలంటే.. బోయింగ్.. కోకకోల.. డిస్న.. ఎగ్జాన్ మొబిల్.. మెక్ డొనాల్డ్స్.. నెట్ ఫ్లిక్స్.. వాల్ మార్ట్ సంస్థల మార్కెట్ విలువను కలిపినా.. యాపిల్ కంటే తక్కువే. ఇదొక్క పోలిక చాలు.. యాపిల్ రేంజ్ ఎంతన్నది అర్థం చేసుకోవటానికి.