Begin typing your search above and press return to search.

నాన్న మాటలే స్ఫూర్తి.. దేశం కోసం ఎంతటి బాధైనా దిగమింగుతా.. సిరాజ్​

By:  Tupaki Desk   |   24 Nov 2020 10:30 AM IST
నాన్న మాటలే స్ఫూర్తి..  దేశం కోసం ఎంతటి బాధైనా దిగమింగుతా.. సిరాజ్​
X
మహ్మద్​ సిరాజ్​ అద్భుతమైన యువ పేసర్​. ఐపీఎల్ 2020లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి టీంఇండియాకు ఎంపికయ్యాడు. ఎంతో గొప్ప అవకాశం దక్కిందని కుటుంబ సభ్యులు సంతోషంగా ఫీలయ్యారు. సిరాజ్​ కూడా ఆస్ట్రేలియా టూర్​ కు వెళ్లాడు. కానీ అక్కడ ప్రాక్టీస్​ చేస్తున్నప్పుడే ఓ పిడుగులాంటి వార్త అతడి చెవిన పడింది. తనను గొప్ప క్రికెటర్ గా టీం ఇండియా తరపున ఎదిగితే చూడాలనుకున్న తన తండ్రి ఇక లేడన్న వార్త తెలిసింది. తనలో ఎంతో స్ఫూర్తి నింపిన తండ్రి తుదిశ్వాస విడిచాడన్న వార్త విని సిరాజ్​ కుప్ప కూలాడు. విషయం తెలిసిన బీసీసీఐ అతడిని ఇండియాకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ సిరాజ్​ మాత్రం ఇండియాకు వెళ్లేందుకు ఒప్పుకోలేదు. ‘ఇప్పుడు నేను ఇండియాకు వెళ్లడం కంటే.. టీం ఇండియా తరఫున ఆడితేనే నా తండ్రి ఆత్మ శాంతిస్తుంది’ అని బీసీసీఐ కి చెప్పాడు. బీసీసీఐ చైర్మన్​ గంగూలి కూడా సిరాజ్​ నిర్ణయం విని ఎంతో ఆశ్చర్య పోయాడు. సిరాజ్​ వజ్ర సంకల్పాన్ని మెచ్చుకున్నాడు. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లోనే ఆటగాడి ఆత్మ స్థైర్యం, నైతిక పరివర్తన బయట కు వస్తాయని ప్రశంసించాడు.

మరోవైపు సిరాజ్​ తల్లి కూడా అతడితో భావోద్వేగంతో మాట్లాడారు. 'నువ్వు దేశానికి ఆడాలనేది నీ తండ్రి కల. దాన్ని నిర్వర్తించడమే నీ ముందున్న కర్తవ్యం. చక్కటి ప్రదర్శనతో అందరి మనసులు గెలుచుకో’ అని తన తల్లి సిరాజ్​కు చెప్పింది. ఈ సందర్భంగా సిరాజ్​ మీడియాతో మాట్లాడుతూ.. ‘ మాది చాలా బీద కుటుంబం నా తండ్రి ఆటో నడుపుతూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. అతడి కోరిక తీర్చడం నా బాధ్యత. కెప్టెన్​ కోహ్లీ కూడా నాకు స్ఫూర్తి నింపాడు. నాకు ధైర్యం చెప్పాడు. ఈ టూర్​ లో బాగా రాణించి అందరి మన్ననలు పొందాలన్నదే నా ధ్యేయం.

'మేరా బేటా దేశ్‌కా నామ్‌ రోషన్‌ కరేగా' అని మా నాన్న ఎప్పుడూ అంటుండేవారు. ఆ మాటలు నాకెప్పటికీ గుర్తుంటాయి. ’ అని సిరాజ్​ చెప్పాడు. 2007లో ఢిల్లీ తరఫున రంజీట్రోఫీ మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు కోహ్లీ తన తండ్రిని కోల్పోయాడు. అయినా తర్వాతి రోజు మైదానంలో అడుగుపెట్టిన విరాట్ 97 పరుగులు సాధించాడు. అప్పుడు కోహ్లీ అందరి మెప్పు పొందాడు. ఇప్పుడు సిరాజ్​ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకొని.. దేశం తరఫున ఆడేందుకు నిర్ణయించుకున్న సిరాజ్​ తెగువను వాళ్లు మెచ్చుకుంటున్నారు.