Begin typing your search above and press return to search.

ఛీత్క‌రిస్తే.. త‌ప్ప‌.. ప్ర‌జ‌లు గుర్తుకు రాలేదా? కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం

By:  Tupaki Desk   |   28 March 2022 8:00 AM IST
ఛీత్క‌రిస్తే.. త‌ప్ప‌.. ప్ర‌జ‌లు గుర్తుకు రాలేదా?  కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం
X
దేశంలో అతి పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ చిన్న బోయింది. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఘోరంగా దెబ్బ‌తింది. దీంతో ఇప్పుడు పాల‌క ప‌క్షంగా కేవ‌లం రెండు రాష్ట్రాల్లోనే మిగిలిపోయింది. రాజ‌స్తాన్‌, ఛ‌త్తీఘ‌డ్ ల‌లో మాత్ర‌మే కాంగ్రెస్ పూర్తిగా అధికారంలో ఉండ‌గా.. మ‌హారాష్ట్రంలో శివ‌సేన కూట‌మిలో కొన‌సాగుతోంది.

అంటే.. ప‌దేళ్ల కింద‌ట దాదాపు 18 రాష్ట్రాల్లో పాల‌క ప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ రెండు రాష్ట్రాల‌కు దిగ‌జారిపోయింది. దీనికి కార‌ణం.. చేసుకున్న స్వ‌యం కృత అప‌రాధాలే అంటున్నారు నెటిజ‌న్లు. కాగా, ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్ర‌జ‌లు గుర్తుకు వ‌చ్చారు. ఈ నెల 31 నుంచి ప్ర‌జా క్షేత్రంలో ఉద్య‌మాల‌కు రెడీ అవుతోంది కాంగ్రెస్‌.

ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు రావాల‌ని.. కేంద్రంలో చెవిటి పాల‌కుల‌కు వినిపించేలా గంట‌లు మోగించాల‌ని.. డ‌ప్పులు కొట్టాల‌ని పిలుపునిచ్చింది. పెరుగుతున్న పెట్రోల్ ధ‌ర‌లు, గ్యాస్ మంట‌ల‌కు నిర‌స‌న తెల‌పాల‌ని కోరింది. అయితే.. ప్ర‌జ‌ల నుంచి దీనికి మ‌ద్ద‌తు రావ‌డం గ‌గ‌నంగా మారింది. నిజానికి ఇప్పుడు పెట్రోల్ మంట‌లు మామూలుగా లేవు.

అదేస‌మ‌యంలో గ్యాస్ ధ‌ర‌లు, నిత్యావ‌స‌ర ధ‌ర‌లు కూడా పెరిగిపోయి.. ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పిలుపున‌కు అనూహ్య స్పంద‌న వ‌స్తుంద‌ని.. అంద‌రూ అనుకున్నారు. అయితే.. ఈ అనూహ్య స‌మ‌యంలో ప్ర‌జ‌ల నుంచి అనేక ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. వందేళ్ల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ప్ర‌జ‌లు గుర్తుకు వ‌చ్చారా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి.

ఎందుకంటే.. గ‌తంలో నెల‌కు లేదా.. ఆరు మాసాల‌కు ఒక‌సారి.. పెట్రోల్ ధ‌ర‌ల‌పై స‌మీక్ష జ‌రిపి పెంచే విధంగా ఉండేది. అయితే.. ఇదే కాంగ్రెస్‌(యూపీఏ) పాల‌న‌లో రోజు వారీగా స‌మీక్షించే విధానాన్ని తీసుకువ‌చ్చారు. అదేస‌మ‌యంలో గ్యాస్ వినియోగంపైనా ఉక్కుపాదం మోపింది యూపీఏ ప్ర‌భుత్వ‌మే.

అప్ప‌ట్లో ఏడాదికి 4 సిలిండెర్లు మాత్ర‌మే ఇస్తామ‌ని.. చేసిన ప్ర‌క‌ట‌న దేశ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. అదేస‌మ‌యంలో డీబీటీ(బ్యాంకులో స‌బ్జిడీ వేసే విధానం) తీసుకువ‌చ్చింది కూడా యూపీఏనే., అంటే.. నేరుగా గ్యాస్‌కు మొత్తం డ‌బ్బులు చెల్లిస్తే.. వినియోగ‌దారుల ఖాతాల్లోకి స‌బ్సిడీ నిధులు వేసే విధానం. అంటే.. ఇవ‌న్నీ.. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందిక‌రంగా మారిన ప‌రిణామాలే.

వీటిని ఆధారంగా చేసుకునే ఇప్పుడు.. బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌పై కొరడా ఝ‌ళిపిస్తోంది. నిత్యం స‌మీక్షిస్తున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల కార‌ణంగా ప్ర‌జ‌ల‌పై భారం ప‌డుతోంది. అదేస‌మ‌యంలో డీబీటీ విధానాన్ని కూడా బీజేపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకు ని.. సబ్సిడీని పూర్తిగా ఎత్తేసింది.
దాదాపు ఇప్పుడు గ్యాస్ సిలిండ‌ర్‌కు ప్ర‌జ‌లు.. 972(ఏపీలో పూర్తి మొత్తం) చెల్లిస్తుంటే.. దీనికి స‌బ్సిడీగా.. కేవ‌లం రూ. 15 మాత్ర‌మే వేస్తున్నారు. అంటే.. ఒక‌ర‌కంగా.. ప్ర‌జ‌ల‌కు కంట‌కంగా.. మారిన ఈ విధానాలు తెచ్చిందే కాంగ్రెస్ ప్ర‌భుత్వం. ఇవ‌న్నీ ప్ర‌జ‌లు మ‌రిచి పోయార‌ని.. ఈ పాపం బీజేపీకి అంట‌గ‌ట్టేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంద‌నే విమ‌ర్శ‌లు జోరుగా వ‌స్తున్నాయి.

అయితే.. ఇక్క‌డ బీజేపీని ఎవ‌రూ మ‌ద్ద‌తివ్వ‌డం లేదు. అలాగ‌ని స‌మ‌ర్ధించ‌డ‌మూ లేదు. కానీ, త‌గుదున‌మ్మా అంటూ.. కాంగ్రెస్ చేస్తున్న ప్ర‌చారానికి మాత్ర‌మే ప్ర‌జ‌ల‌నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తోంది. పైగా.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ముందు .. ఈ విధంగా ఎందుకు మాట్లాడ‌లేదు.

ఎందుకు ప్ర‌జ‌లు గుర్తుకు రాలేదు? ఎందుకు ప‌ళ్లాలు మోగించ‌లేదు.? గంట‌లు వాయించ‌లేదు.. ? అనే ప్ర‌శ్న‌ల‌కు కాంగ్రెస్ ముందుగా స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు.. జోల పాడ‌డం.. ఏమేర‌కు స‌మంజ‌సం.. ఇప్పుడు కూడా.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో సానుకూల ఫ‌లితం వ‌చ్చి వుంటే.. కాంగ్రెస్ స్పందించేదా? అనే ప్ర‌శ్న‌ల‌కు ఏం స‌మాధానం చెబుతారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఏదేమైనా.. ఛీత్క‌రిస్తే.. త‌ప్ప‌.. ప్ర‌జ‌లు గుర్తుకు రాలేదా? అనే ప్ర‌శ్న మాత్రం సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ కావ‌డం.. కాంగ్రెస్‌కు అశ‌నిపాతంగా మారింద‌నేది వాస్త‌వం.