Begin typing your search above and press return to search.

ఆ వీవీఐపీల కారణంగా ముంబయి కరోనా రోగులకు వైద్యసేవలు అందట్లేదట

By:  Tupaki Desk   |   14 April 2021 2:45 AM GMT
ఆ వీవీఐపీల కారణంగా ముంబయి కరోనా రోగులకు వైద్యసేవలు అందట్లేదట
X
కరోనా కరాళ నృత్యం చేస్తోంది. పెరుగుతున్న కేసులతో కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. రోజుకు 1.61 కొత్త కేసులు నమోదు కావటంతో.. ఆసుపత్రుల్లో సేవల కొరత అంతకంతకూ పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే.. సామాన్యులకు వైద్య సేవలు నిల్ అనే పరిస్థితి వచ్చేసింది. ఆసుపత్రుల ఎదుట వైద్య సేవల కోసం దారుణ రీతిలో నిరీక్షించాల్సిన దుస్థితి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. మహారాష్ట్రలో ఇలాంటి దారుణ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది.

పలు జిల్లాల్లో ఆసుపత్రుల్లో వైద్య సేవల కోసం రోగులు.. ఆసుపత్రి ఆవరణలోనే పెద్ద ఎత్తున వేచి చూడాల్సి వస్తోంది. ఆక్సిజన్ సిలిండర్ ను ఆటోకు తగిలించుకొని వెయిట్ చేయటం.. కొందరు రోగులకు కుర్చీల్లో కూర్చోబెట్టి ఆక్సిజన్ సిలిండర్లను పెడుతున్న దయనీయ పరిస్థితి పలు చోట్ల కనిపిస్తోంది. చాలాచోట్ల సరైన సమయంలో.. సరైన వైద్యం అందని కారణంగా పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పలువురు క్రికెటర్లు.. సినిమా తారలు.. వీవీఐపీలు.. స్వల్ప లక్షణాలతో ఉన్నప్పటికీ.. దీర్ఘకాలం ఆసుపత్రుల్లోనే ఉండి చికిత్స చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు. వీరి కారణంగా పలువురికి వైద్య సేవలు అందటం లేదని విమర్శించారు. లక్షణాలు స్వల్పంగా ఉన్నా.. ముంబయిలోని కొందరు వీవీఐపీలు ముందుజాగ్రత్తలో భాగంగా సుదీర్ఘ కాలానికి ఆసుపత్రుల్లో బెడ్లు బుక్ చేసుకుంటున్నారని.. దీని కారణంగా మిగిలిన వారికి వైద్య సాయం అందించలేకపోతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి.