Begin typing your search above and press return to search.

వేర్ ఆర్ యూ పవన్ కళ్యాణ్?

By:  Tupaki Desk   |   9 March 2021 9:04 AM GMT
వేర్ ఆర్ యూ పవన్ కళ్యాణ్?
X
ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ను ఇప్పుడు ఏపీ ప్రజలు.. నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తప్పదని.. తాము ఏపీ ప్రభుత్వానికి దీనిపై స్పష్టం చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనపై ఏపీ ప్రజలు భగ్గుమన్నారు. ఈ విషయం ఏపీ సర్కార్ కు కూడా తెలిసి నిజాలు చెప్పని వైనంపై రగిలిపోతున్నారు. ఇక కేంద్రంలోని హోంమంత్రి అమిత్ షాను కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లాబాయింగ్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉండడం చర్చనీయాంశమవుతోంది.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆంధ్రా అంతా మారు మోగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న చేసిన ప్రకటనతో ఏపీ భగ్గుమంది. ఏపీ అంతా ఆందోళనలతో మారుమోగుతున్నా ఇన్ని రోజులు బీజేపీతో మాట్లాడుతున్నా అని చెప్పిన పవన్ కళ్యాణ్.. కేంద్రం ప్రకటించి 24 గంటలు అవుతున్నా దాని మీద ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. పవన్ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ప్రజలు, నేతలంతా జుట్టు పీక్కుంటున్న పరిస్థితి నెలకొందట..

జనసేన తరుఫున ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని అంటున్నారు.. బీజేపీతో కటీఫ్ చేసుకోవాలని కొంత మంది నేతలు జనసేనానిని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీని పవన్ కళ్యాణ్ తరిమికొడుతారు అని జనసేన సభ్యులు గట్టిగా విశ్వసిస్తున్నారట..

అసలే పవన్ పోటీచేసిన దగ్గరే ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉందని.. అక్కడి ప్రజలు అంతా పవన్ మీద నమ్మకం పెట్టుకుంటే ఆయన స్పందనలు చూసి ‘ఎక్కడికి వెళ్లావ్’ అయ్యా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారట.. ఇలా విశాఖ ఉక్కు రాజుకుంటున్న వేళ పవన్ మౌనం చూసి నేతలు, ప్రజలు కూడా హతాషులవుతున్న పరిస్థితి నెలకొందట..