Begin typing your search above and press return to search.

మరీ అంత ఆత్రం ఎందుకు బాబు.. ఆ మాత్రం వెయిట్ చేయలేరా?

By:  Tupaki Desk   |   3 March 2021 10:30 AM GMT
మరీ అంత ఆత్రం ఎందుకు బాబు.. ఆ మాత్రం వెయిట్ చేయలేరా?
X
దేనికైనా ఓపిక ఉండాలి. అందునా రాజకీయాల్లో అది మరింత తప్పనిసరి. కానీ..ప్రస్తుతం ఉన్న రాజకీయనేతల్లో తనను తాను సూపర్ సీనియర్ గా చెప్పుకునే చంద్రబాబు.. తప్పుల మీద తప్పులు చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న పురపాలిక ఎన్నికల నేపథ్యంలో.. బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పుర పోరు ముగిసిన తర్వాత అంటే ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రంలో ప్రజలపై జగనన్న ఆస్తిపన్ను పిడుగు పడబోతుందని ఆయన వార్నింగ్ ఇస్తున్నారు.

ఈ పన్నుల భారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చంద్రబాబు తన పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ మైండ్ సెట్ తెలిసిన తర్వాత కూడా ఇలాంటి ఆటలు ఆడటమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. నిజంగానే జగన్ ప్రభుత్వం భారీగా ఆస్తిపన్ను పెంచాలని భావించి.. నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలే తప్పించి.. అంచనాతో.. ఊహాగానాలతో ప్రచారం చేయటం.. ప్రభుత్వంపై విరుచుకుపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయం బాబుకు ఎందుకు అర్థం కాదన్నది ప్రశ్న.

అదే సమయంలో తమ పార్టీ పురపోరులో గెలిస్తే.. ఆస్తిపన్నును ఇప్పుడున్నదానిలో సగానికి తగ్గిస్తామని ఆయన హామీ ఇస్తున్నారు. అధికారపక్షం మీద ఆరోపణ చేయటం.. విపక్షంగా ఉన్న తాము పురపోరులో అధికారంలోకి వచ్చి పన్ను తగ్గింపు ప్రకటన రెండూ పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ అవుతుందని చెబుతున్నారు. చంద్రబాబు చేస్తున్న ప్రచారంపై జగన్ సర్కారు ఒక క్లారిటీ ఇస్తూ.. పన్నుల్ని పెంచటం లేదంటే బాబు అడ్డంగా బుక్ కావటమే కాదు.. వచ్చే నాలుగు ఓట్లు కూడా రావు.

అదే సమయంలో.. బాబు చెబుతున్న మరోపాయింట్.. తాము గెలిస్తే ఆస్తిపన్నును సగానికి తగ్గించటం. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఈ పని ఎందుకు చేయనట్లు? విపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయటం ఏమిటి? అన్నది ప్రశ్న. ఆస్తిపన్ను పెంపు అనివార్యమైతే.. ప్రభుత్వం ప్రకటించే వరకు వెయిట్ చేసి.. ఆ తర్వాత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం ఒక పద్దతి. అంతేకానీ.. పెంచుతారన్న అంచనాతో చేసే ప్రకటనలతో ఏదో సాధించాలన్న బాబు యత్నాలకు జగన్ ప్రభుత్వంలో ఎలాంటి ఫలితం ఉండదన్న విషయాన్ని ఇన్ని ఎదురుదెబ్బలు తిన్న తర్వాత కూడా బాబుకు అర్థం కాకపోవటం ఏమిటి? దేనికి తొందరపడాలో.. దేనికి వేచి చూడాలో కూడా చంద్రబాబుకు తెలీదా? ఎన్నికల వేళ హడావుడిగా చేసే ఇలాంటి ఆత్రపు ప్రకటనల వల్ల మైలేజీ కంటే కూడా డ్యామేజీనే ఎక్కువ అవుతుందన్న విషయం బాబుకు ఎప్పుడు అర్థమవుతుందో?