Begin typing your search above and press return to search.

కేసీఆర్‌పై నెటిజ‌న్ల ఫైర్‌... రిజిస్ట్రేష‌న్ చార్జీల పెంపుపై తీవ్ర ఆగ్ర‌హం

By:  Tupaki Desk   |   31 Jan 2022 3:32 AM GMT
కేసీఆర్‌పై నెటిజ‌న్ల ఫైర్‌... రిజిస్ట్రేష‌న్ చార్జీల పెంపుపై తీవ్ర ఆగ్ర‌హం
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నెటిజ‌న్ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కేంద్రంలోని మోడీ స‌ర్కారు పెట్రోల్‌పై సెస్సు గుంజుకుంటోంద‌ని.. దొడ్డిదారిలో ఖ‌జానా నింపుకుంటోంద‌ని ప‌దే ప‌దే విమ‌ర్శించే కేసీఆర్‌.. ఇప్పుడు చేస్తోంది ఏంటి? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి కార‌ణం.. ఇప్పుడు రాష్ట్రంలోని కీల‌క ప్రాంతాల్లో భారీ ఎత్తున రిజిస్ట్రేష‌న్ చార్జీల‌ను పెంచేయ‌డ‌మే. దీనికి కార‌ణం.. మార్కెట్ ధ‌ర‌లు పెరిగాయ‌ని ప్ర‌భుత్వం చెప్ప‌డ‌మే! దీనిని దొడ్డిదారిలో ఖ‌జానాను నింపుకోవ‌డ‌మేన‌ని.. ప్ర‌జ‌లు దుయ్య‌బ‌డుతున్నారు.

తెలంగాణలో అధిక ప్రాధాన్యత కలిగిన గ్రామాలు, ప్రాంతాలు మొత్తం ఏడువేలు ఉన్నట్లు తేల్చిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆయా ప్రాంతాల్లో నిర్దేశిత విలువ కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ విలువలను పెంచింది. ఆరువేల‌కుపైగా ప్రాంతాలు, ఖాళీస్థ‌లాలు ప్రాధాన్య‌త కలిగినవికాగా, దాదాపు ఆరు వంద‌ల‌ గ్రామాల వ్య‌వ‌సాయ భూములు ప్రాధాన్య‌త క‌లిగిన‌విగా గుర్తించింది. ఖాళీ స్థ‌లాల‌కు గరిష్ఠంగా 60 శాతం, వ్య‌వ‌సాయ భూముల‌కు గ‌రిష్ఠంగా రిజిస్ట్రేష‌న్ విలువ‌లు 150 శాతం పెంచింది.

రాష్ట్రంలో వ్య‌వ‌సాయ భూములు, వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల విలువ‌ల పెంపున‌కు స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ల శాఖ అనేక ర‌కాల ప్రామాణికాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. గ‌త ఏడాది జులై నెల‌లో రాష్ట్రవ్యాప్తంగా వ్య‌వ‌సాయ భూములు, ఖాళీ స్థ‌లాలు, అపార్టుమెంట్ల‌కు నిర్దేశించిన శాతాల్లో ఒకే ర‌క‌మైన‌ రిజిస్ట్రేష‌న్ విలువ‌ల‌ను పెంచిన స్టాంపులు రిజిస్ట్రేష‌న్ శాఖ... అప్ప‌ట్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను సైతం పెంచింది. అయితే ఈసారి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ ఛార్జీల జోలికి అస‌లు వెళ్లలేదు. రిజిస్ట్రేష‌న్ విలువ‌లను మాత్ర‌మే పెంచింది.

ఈసారి గ‌తంలో మాదిరి కాకుండా రాష్ట్రంలోని ఆస్తులు, భూముల బ‌హిరంగా మార్కెట్ విలువ‌లు అనూహ్యంగా పెరిగిన‌ ప్రాంతాల‌ను ప్రాధాన్య‌త క‌లిగినవిగా, మిగిలిన వాటిని సాధార‌ణ‌మైన‌విగా రెండు ర‌కాలుగా విభజించింది. వ్య‌వ‌సాయ భూములు, వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల‌కు చెందిన బ‌హిరంగ మార్కెట్ విలువ‌ల‌ను గ్రామాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల వారీగా సేక‌రించింది. ఎక్క‌డెక్క‌డ బ‌హిరంగా మార్కెట్ విలువ‌ల‌కు, రిజిస్ట్రేష‌న్ విలువ‌ల‌కు వ్య‌త్యాసం అధికంగా ఉందో లెక్క తేల్చింది. ఎందుకు ఆయా ప్రాంతాల్లో భారీగా అంత‌రం ఏర్ప‌డింది.. అందుకు గల కార‌ణాలు ఏంటి.. త‌దిత‌ర అంశాల‌పై అధ్య‌య‌నం చేసింది.

రాష్ట్రంలో స‌గ‌టున వ్య‌వ‌సాయ భూముల విలువ‌లు 50 శాతం, ఖాళీ స్థ‌లాలు విలువ‌లు 35 శాతం, అపార్ట‌ుమెంట్ ప్లాట్ల విలువ‌లు 25 శాతం లెక్క‌న స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ శాఖ పెంచింది. అయితే అధిక‌ ప్రాధాన్య‌త క‌లిగిన ప్రాంతాల్లో ఇంత‌కంటే ఎక్కువ శాతాలు పెరిగాయి. ఎక‌రా 5 కోట్లు రూపాయిలు లోపు విలువ క‌లిగిన వ్య‌వ‌సాయ భూముల విలువ‌లు యాభై శాతం, 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయిలు మ‌ధ్య విలువ క‌లిగిన వ్య‌వ‌సాయ భూముల విలువ‌లు 20 శాతం, ప‌ది కోట్ల రూపాయిలు, అంత‌కంటే ఎక్కువ విలువ క‌లిగిన వ్య‌వ‌సాయ భూముల విలువ‌లు 10 శాతం లెక్క‌న పెంచింది. ఇదంతా.. ఖ‌జానాను నింపుకునేందుకేన‌ని.. ప్ర‌స్తుతం అప్పుల్లో ఉన్న స‌ర్కారు ఏదో ఒక విధంగా గ‌ట్టెక్కేందుకు చేస్తున్న ప్ర‌య‌త్న‌మేన‌ని.. నెటిజ‌న్లు ఫైర‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.