Begin typing your search above and press return to search.

ఇంకా నాయుడు ఏంటి?.. అధికారంలో ఉంది మీరేగా అంబ‌టి వ‌ర్యా!!

By:  Tupaki Desk   |   6 May 2022 2:30 PM GMT
ఇంకా నాయుడు ఏంటి?.. అధికారంలో ఉంది మీరేగా అంబ‌టి వ‌ర్యా!!
X
చంద్రబాబు పాపం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని, సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టును తామే పూర్తిచేస్తామని ఏపీ జలవనరుల శాఖ కొత్త‌ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఆయన మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక‌.. తొలిసారి పోలవరం ప్రాజెక్టును క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. ప్రాజెక్టు పనులను, పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయ‌న‌ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడమే కారణమని చెప్పారు.

ప్రాజెక్టులో కీలక పనులు వదిలేసి, త్వరితగతిన పూర్తయ్యే పనులు చేసి వాటి బిల్లులను పాస్‌ చేయించుకోవాలనే తాపత్రయంతో అప్పటి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమాలు చేసిన పాపం వల్లే ఇలా జరిగిందన్నారు. దేశంలోగానీ, ప్రపంచంలోగానీ ఎక్కడా డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినలేదని, కేవలం చంద్రబాబునాయుడు వల్లే ఇక్కడ జరిగిందని చెప్పారు. దీంతో దాదాపు రూ.400 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ పునరుద్ధరణకు అధికారులు మూడు ఆప్షన్లను పరిశీలిస్తున్నారని తెలిపారు.

సీడబ్ల్యూసీ, పీపీఏ, డీడీఆర్‌పీ సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పోల వరం ప్రాజెక్టు ఎత్తును ఒక్క అంగుళం కూడా తగ్గించేది లేదని సీఎం వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. ప్రాజెక్టు వ్యయం ఇప్పటికే రూ.47000 కోట్లకు పెరిగిందని, ప్రాజెక్టు ఆలస్యమయ్యే కొద్దీ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్వాసితుల కు అదనంగా ప్యాకేజీ ఇవ్వడానికి సీఎం హామీ ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు.

ఇంకా చింత‌కాయ్ క‌బుర్లేనా?: జ‌నం మాట‌!!

అయితే.. అమాత్యుడు అంబ‌టిపై.. జ‌నం వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ``ఇంకా పాత చింత‌కాయ్ క‌బుర్లేనా.. అమాత్యా!?`` అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎందుకంటే.. చంద్ర‌బాబు హ‌యాం ముగిసి.. మూడేళ్లు అయిపోయింది. అప్ప‌టి నుంచి పోల‌వ‌రంపై.. వైసీపీ స‌ర్కారు.. ఇంకా.. క‌బుర్లు చెబుతూనే ఉంద‌నేది.. జ‌నం మాట‌. 2020లోనే నీళ్లు ఇచ్చేస్తామ‌ని.. త‌ర్వాత‌.. 2021కి పారిస్తామ‌ని.. చెప్పిన మాట‌లు.. చంద్ర‌బాబువి కాదు క‌దా?! అని ప్ర‌శ్నిస్తున్నారు.

``చంద్ర‌బాబు అధికారంలో నుంచి దిగిపోయి.. మూడేళ్లు అయిపోయింది. మీరు అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు అయిపోయింది. ఇంకా పాత పాటే పాడుతూ.. పాత ప్ర‌భుత్వాన్నే విమ‌ర్శిస్తూ.. ఎన్నాళ్లు ఇలా గ‌డిపేస్తారు.. అమాత్య శేఖ‌రా? అంబ‌టి రాంబాబు వ‌ర్యా?!`` అని జ‌నాలు పెద‌వి విరుస్తున్నారు. అంతేకాదు.. గ‌తంలో మంత్రిగా చేసిన‌.. అనిల్ కుమార్ తొడ‌గొట్టి.. మీసం మెలేసి మ‌రీ.. అసెంబ్లీ చేసిన కామెంట్ల‌ను వారు.. పోస్టు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ``వెయిటు.. వెయిటు..`` అంటూ.. ప్ర‌తిప‌క్షంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. తాము 2021 నాటికి నీటిని ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన ఆ మంత్రి వెళ్లిపోయారు.. ఇక‌, ఇప్పుడు.. మీరు.. మ‌ళ్లీ క‌థ‌ను మొద‌టికి న‌డిపిస్తున్నారు.. అంటూ.. జ‌నాలు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి దీనిపై అంబ‌టి ఏం చెబుతారో చూడాలి.