Begin typing your search above and press return to search.

వైఎస్సార్ అలా.. జగన్ ఎందుకిలా... ?

By:  Tupaki Desk   |   16 Nov 2021 8:49 AM GMT
వైఎస్సార్ అలా.. జగన్ ఎందుకిలా... ?
X
వైఎస్సార్ వారసుడు జగన్. రాజన్న బిడ్డగా ప్రజలు ఆయన్ని ఆశీర్వదించారు. వైఎస్సార్ ది మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన ప్రజా జీవితం. ఆయన అందులో ఎక్కువ ఏళ్ళ పాటు ప్రతిపక్షంలోనే ఉన్నారు. అంటే ఒక విధంగా ప్రజలతో మమేకం అయి తన రాజకీయాన్ని చేసుకొచ్చారు అన్న మాట. ఓటమెరుగని వీరుడిగా వైఎస్సార్ ఉన్నారంటే జనంతో ఆయన బంధం ఎంత అన్నది అర్ధం చేసుకోవాల్సిందే. వైఎస్సార్ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ తండ్రి బాటే తనకు శిరోధార్యమని ఎపుడూ చెబుతూ ఉంటారు. కానీ ఆచరణలో చాలా విషయాల్లో చూస్తే వైఎస్సార్ కి జగన్ కి మధ్య ఎంతో వ్యత్యాసం ఉందనే అంటారు.

ఒక రాజకీయ నాయకునిగానే కాకుండా ముఖ్యమంత్రిగా చూసుకున్నా వైఎస్సార్ రూటే సెపరేట్. ఆయన ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాల నాయకులతో, క్యాడర్ తో నేరుగా రిలేషన్స్ కలిగి ఉండేవారు. ఇందులో ఎంతో మందిని పేరు పెట్టి పిలిచే వారు అని కూడా చెబుతారు. ఇక వైఎస్సార్  1998లో పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక ఉత్తరాంధ్రా జిల్లాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆయన నాటి టీడీపీ సర్కార్ మీద సమర శంఖాన్ని ఉత్తరాంధ్రా జిల్లాల నుంచే పూరించారు. 2003లో ఆయన చేపట్టిన పాదయాత్రను ఉత్తరాంధ్రాలోని ఇచ్చాపురంలో ముగించడం కూడా విశేషం.

ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాంతాలకు ఆయన ఎన్ని సార్లు వచ్చారో లెక్కే లేదు. ఆయన వచ్చిన ప్రతీసారీ ఈ జిల్లాలలోనే  కొన్ని రోజులు మకాం వేసి మరీ స్థానిక సమస్యల మీద విసృతంగా సమీక్ష నిర్వహించేవారు. అంతే కాదు ఏ పల్లెకైనా వెళ్తే అక్కడే రాత్రి బస చేసేవారు. అక్కడి ప్రజలతో మాట్లాడి వారి కష్టసుఖాలను నేరుగా తెలుసుకునేవారు. ఈ సందర్భంగా ఒక విషయం ఇక్కడ ప్రస్థావనార్హం. 2008 ప్రాంతంలో వైఎస్సార్ విశాఖ టూర్ పెట్టుకున్నారు. ఆయన రెండు రోజుల పర్యటన అంతా రూరల్ జిల్లాలోనే కొనసాగింది. ఒక రోజు  రాత్రికి ఆయన నర్శీపట్నంలో బస చేశారు. అక్కడ తంగేడు రాజుల ఆతీధ్యం స్వీకరించి పార్టీ నేతలతో మాటా మంతీ అక్కడే చేశారు. ఆ మరుసటి రోజు అక్కడే మీడియా సమావేశం సైతం నిర్వహించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం కోట ఉరట్ల స్కూల్ హెలీపాడ్ నుంచి విశాఖ బయల్దేరి వెళ్లారు. వైఎస్సార్ తాను ఉత్తరాంధ్రా జిల్లాల టూర్ చేపడితే మొత్తం జిల్లా సమస్యల మీద పూర్తి రిపోర్ట్స్ తో అధికారులను సిద్ధం కమ్మని చెప్పేవారు.

అటు అధికారులతో సమావేశాలను నిర్వహిస్తూనే ఇటు పార్టీ నేతలతో కూదా చర్చలు జరిపేవారు. అంటే ఒక జిల్లాకు తాను వస్తే మొత్తం సమస్యలను ఆకలింపు చేసుకోవడమే కాదు, వాటి పరిష్కారానికి ఎక్కడికక్కడ ఆదేశాలు ఇవ్వడం వైఎస్సార్ కే చెల్లింది అని ఇప్పటికీ అంటారు. ఇక పార్టీ పటిష్టతకు కూడా ఆయన అదే టైమ్ లో చేపట్టిన చర్యలు కూడా కాంగ్రెస్ కి మరింత పుష్టిని చేకూర్చాయని చెబుతారు. ఇపుడు ఆయన కుమారుడు జగన్ విషయాన్నే తీసుకుంటే ఆయన రీసెంట్ గా విశాఖ మీదుగా శ్రీకాకుళం వెళ్ళి అటు నుంచి ఒడిషా వెళ్లారు.

అక్కడ సీఎం నవీన్ పట్నాయక్ తో చర్చలు జరిపి అదే రోజు రాత్రి తాడేపల్లికి తిరిగి వెళ్ళిపోయారు. నిజానికి జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండున్నరేళ్ల కాలంలో ఈ వైపుగా వచ్చింది కూడా బహు తక్కువ. అందులో  రెండు మూడు గంటలు మించి ఉండడం కూడా అరుదే అని చెప్పాలి. నిజానికి ఈ మూడు జిల్లాల్లో ఎన్నో సమస్యలు  ఉన్నాయి. అలాగే ప్రజా ప్రతినిధులు కూడా సీఎం వస్తే మాట్లాడాలని, తమ బాధలను చెప్పుకోవాలని ఆత్ర పడతారు. కానీ జగన్ మాత్రం ఎవరికీ ఆ చాన్స్ ఇవ్వకుండా ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం చూస్తే వైఎస్సార్ ను పోల్చి చూస్తే జగన్ ఎందుకిలా చేస్తున్నారు అన్న ప్రశ్నలు అయితే వేసుకోవడం సహజం. ఇక జగన్ ఈ ప్రాంతానికే కాదు, ఏ జిల్లాకు వచ్చినా కూడా ఒక రాత్రి అయినా అక్కడ ఉండి అధికారులతో, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్న వారూ ఉన్నాయి. కానీ జగన్ మాత్రం సీఎం అయ్యాక ఏ జిల్లా టూర్ చేసినా రాత్రికి మాత్రం ఎక్కడా  ఉండని సీన్ ఉంది. ఒక విధంగా దీని వల్ల పార్టీకి, ప్రభుత్వానికి కూడా ఇబ్బందే అంటున్నారు. మరి జగన్ తన తీరుని మార్చుకుంటే ఆయన జిల్లా టూర్లకు పూర్తి స్థాయి ఫలితాలు వస్తాయని అంతా సూచిస్తున్నారు.