Begin typing your search above and press return to search.

మీరే యశోదకు వెళతారు.. హెలికాఫ్టర్లో వచ్చేటోళ్లు సర్కారీ దవాఖానాకు వస్తారా?

By:  Tupaki Desk   |   14 Jun 2021 9:30 AM GMT
మీరే యశోదకు వెళతారు.. హెలికాఫ్టర్లో వచ్చేటోళ్లు సర్కారీ దవాఖానాకు వస్తారా?
X
అదేం సిత్రమో కానీ.. వరుస పెట్టి అదిరిపోయే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏమైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సూపర్ అని మురిసిపోయే వారికి ఆ మాత్రం సంతోషాన్ని దక్కకుండా చేయటం ఈ మధ్యన కేసీఆర్ కు ఒక అలవాటుగా మారింది. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ వెంటనే జరిగిన జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల్లో అదరగొట్టేసి.. పార్టీ పుంజుకుంటుందన్న వేళలో ఈటలపై కన్నెర్ర చేసి కొత్త ఎపిసోడ్ కు తెర తీశారు.

కరోనా సెకండ్ వేవ్ వేళ.. రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందే మేల్కొని ఉంటే బాగుండేదన్న విమర్శ వినిపిస్తున్న వేళ.. గాంధీ.. వరంగల్ ఎంజీఎంకు వెళ్లి.. అక్కడి రోగులకు ధైర్యం చెప్పిన తీరు.. ఐసీయూలో ఉన్న వారికి సైతం దగ్గరగా వెళ్లిన తీరు.. ఆ వెంటనే తీసుకున్న నిర్ణయాలు కేసీఆర్ మీద అభిమానం మరింత పెరిగేలా మారాయి.అప్పటివరకు ఆయన చేసిన తప్పుల్ని పక్కన పెట్టేద్దామన్న మాట పలువురి నోట వినిపించింది.

ఇలాంటివేళ. .వరంగల్ జైలును తరలించేసి.. అక్కడ భారీ పెద్దాసుపత్రిని నిర్మిద్దామన్న ఆలోచనకు సానుకూల స్పందన లభించింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. సీఎం కేసీఆర్ అనుకున్న తర్వాత ఎంత పెద్ద భవనమైనా సరే నేలమట్టం కావాల్సిందే. వరంగల్ జైలు స్థానంలో పెద్ద ధర్మాసుపత్రిని కట్టేయాలన్న ఆయన ఆలోచనకు తగ్గట్లే.. వారం పది రోజులకే దాన్ని ఆనవాళ్లు లేకుండా చేసి.. త్వరలో దాని శంకుస్థాపన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు.

ఇంత వరకు ఎపిసోడ్ అంతా అదిరేలా ఉందని ఎవరైనా చెబుతారు. మరేం జరిగిందో ఏమో కానీ.. సీఎం కేసీఆర్ మనసులోని మాటను చెప్పి ఒక్కసారి షాకివ్వటమే కాదు.. విమర్శల నోటికి పని కల్పించేలా చేశారు. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో 24 అంతస్తులతో.. ఆధునిక సదుపాయాలతో గ్రీన్ బిల్డింగ్ ను ఏర్పాటు చేస్తామనటం వరకు బాగానే ఉన్నా.. ఈ ఆసుపత్రికి రోగులు హెలికాఫ్టర్ లో వచ్చేందుకు వీలుగా ఆసుపత్రి భవనం మీద హెలిప్యాడ్ నిర్మిస్తామని చెప్పటం షాకింగ్ గా మారింది.

హెలికాఫ్టర్ లో ఆసుపత్రికి వచ్చే స్థాయి ఉన్నోళ్లు అయితే హైదరాబాద్ కు వెళతారు. అది కూడా కార్పొరేట్ ఆసుపత్రికి. అంతేకానీ.. ఎట్టి పరిస్థితికి సర్కారీ దవాఖానాకు రారు. అదెంత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయినప్పటికీ. ఎక్కడి దాకానో ఎందుకు? ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ.. ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల కాలంలో ఒంట్లో బాగోకుంటే యశోదకు వెళ్లటమే కానీ.. సర్కారీ దవాఖానాకు పోయింది లేదు. అలాంటప్పుడు.. హెలికాఫ్టర్ లో వచ్చే రోగుల కోసం హెలిప్యాడ్ నిర్మిస్తామన్న మాటలు విన్నప్పుడు. వంటకం అద్భుతంగా కుదిరిందని సంతోషించే వేళలో గుప్పెడు ఉప్పు అదనంగా పోస్తే ఎలా ఉంటుందో.. తాజాగా కేసీఆర్ మాటలు అలానే ఉన్నాయని చెప్పక తప్పదు.