Begin typing your search above and press return to search.

నెట్ న్యూట్రాలిటీకి అమెరికా గుడ్ బై..

By:  Tupaki Desk   |   15 Dec 2017 9:58 AM GMT
నెట్ న్యూట్రాలిటీకి అమెరికా గుడ్ బై..
X
అగ్ర‌రాజ్యం అమెరికా మ‌రో కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఈ ద‌ఫా విశ్వ‌మంతా వినియోగించే..ఇంట‌ర్నెట్‌ పై క‌న్నువేసింది. ఇంటర్నెట్‌ లో భేదాలు లేవు.. అందరూ సమానమే.. ఇదే నెట్ న్యూట్రాలిటీ. కానీ అమెరికా దీనికి గుడ్ బై చెప్పేసింది. 2015లో ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను రద్దు చేసింది. అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌ సీసీ) నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకంగా ఓటేసింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఇండియా లాంటి పలు దేశాలపై కూడా ప్రభావం చూపనుంది. ఇండియన్ అమెరికన్ - ట్రంప్‌ కు సన్నిహితుడైన ఎఫ్‌ సీసీ చైర్మన్ అజిత్ పాయ్ ఈ సంచలన నిర్ణ‌యం తీసుకున్నారు. అమెరికాలోని ఏటీఅండ్‌ టీ - కామ్‌ కాస్ట్ - వెరిజాన్‌ లాంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల(ఐఎస్‌ పీ)కు దక్కిన ఘన విజయంగా దీనిని అభివర్ణిస్తున్నారు. దీనివల్ల నెట్ వినియోగదారులు ఎలాంటి కాంటెంట్‌ ను చూడాలన్నది ఇక ఈ ఐఎస్‌ పీల చేతుల్లో ఉంటుంది. నెట్ న్యూట్రాలిటీ వద్దని ఐఎస్‌ పీలు - కావాలని కాంటెంట్ ప్రొవైడర్లు వాదిస్తున్నారు. ఇప్పుడు ఎఫ్‌ సీసీ నెట్ న్యూట్రాలిటీకి మంగళం పాడటంతో వాళ్ల నిర్ణ‌యంపై న్యాయపోరాటానికి కాంటెంట్ ప్రొవైడర్లు సిద్ధమవుతున్నారు.

ఇంట‌ర్నెట్ భాష ప్ర‌కారం నెట్ న్యూట్రాలిటీ అంటే అందరు కాంటెంట్ ప్రొవైడర్లకు సమానమైన నెట్ హక్కులు ఉండటం. 2015లో ఒబామా ప్రభుత్వం దీనికి ఓకే చెప్పింది. దీనివల్ల ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కావాలని కొన్ని సైట్లను స్లో చేయడం - బ్లాక్ చేయడం లేదా కొన్ని సైట్ల స్పీడు పెంచడం లాంటివి చేయకుండా ఈ నిబంధనలు అడ్డుకుంటున్నాయి. అన్ని వెబ్‌ సైట్లకు సమానమైన నెట్ యాక్సెస్ ఉండాలన్నది నెట్ న్యూట్రాలిటీ ఉద్దేశం. దీనివల్ల ఒకరు డబ్బులు ఎక్కువగా ఇచ్చారు కదా అని ఆ వెబ్‌ సైట్‌ కు పోటీగా వస్తున్న వెబ్‌ సైట్ల వేగాన్ని ఎలా పడితే అలా తగ్గించే వీలు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఉండదు. అయితే ఐఎస్‌ పీలు మాత్రం తాము అలా వేగాన్ని తగ్గించడంగానీ, బ్లాక్ చేయడంగానీ చేయబోమని.. కాకపోతే డబ్బు చెల్లించేదానిని బట్టి వేగాన్ని పెంచడం చేస్తామని వాదిస్తూ వస్తున్నారు. తాజా నిర్ణ‌యంపై ఇండియన్ అమెరికన్ - ట్రంప్‌ కు సన్నిహితుడైన ఎఫ్‌ సీసీ చైర్మన్ అజిత్ పాయ్ మాట్లాడుతూ.. `నెట్ న్యూట్రాలిటీ అనేది లేని సమస్యను పరిష్కరిస్తామన్నట్లుగా ఉంది` అని వ్యాఖ్యానించారు.

అయితే...ఎఫ్‌ సీసీ తీసుకున్న ఈ నిర్ణయం నేరుగా కాకపోయినా.. ఇండియా లాంటి ఇతర దేశాలపైనా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నెట్ న్యూట్రాలిటీని ఎత్తేయడం వల్ల ఫేస్‌ బుక్ - యూట్యూబ్‌ లాంటి పెద్ద సంస్థలకు పోటీగా ఉన్న విమియో - రెడిట్‌ లాంటి వెబ్‌ సైట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తమకు పోటీగా రాకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎంతైనా చెల్లించడానికి పెద్ద సంస్థలు సిద్ధంగా ఉంటాయి. దీంతో వీళ్ల వెబ్‌ సైట్ల వేగం పెరిగి.. వీళ్లకు పోటీగా ఎదుగుతున్నవి కనుమరుగైపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అమెరికాలో ఇలాంటి చిన్నాచితకా వెబ్‌ సైట్లు అడ్రెస్ లేకుండా పోవడం వల్ల ఆ వెబ్‌ సైట్లను వాడే ఇండియాలాంటి దేశాల్లోని యూజర్లపై కూడా ప్రభావం పడుతుంది. అయితే ఇంటర్నెట్ విషయంలో తాము ఎలాంటి వివక్ష చూపబోమని గత నెలలోనే మన ట్రాయ్ ప్రకటించడం కాస్త ఊరట కలిగించే విషయం. అయిన‌ప్ప‌టికీ కార్పొరేట్ సంస్థ‌ల ఒత్తిడికి క‌నుక తలొగ్గితే..నెట్ ప‌నిచేయ‌డంపై త‌ప్ప‌కుండా ప్ర‌భావం చూపిస్తుంది. అంటే మీ స్మార్ట్ ఫోన్ వాడ‌కంలో తేడా వ‌చ్చేస్తుంద‌న్నమాట‌.