Begin typing your search above and press return to search.

యువతిపై దారుణంగా దాడి చేసిన నెల్లూరు యువకుడు అరెస్టు

By:  Tupaki Desk   |   16 Sept 2021 10:26 AM IST
యువతిపై దారుణంగా దాడి చేసిన నెల్లూరు యువకుడు అరెస్టు
X
సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ బుధవారం ఒక వీడియో వైరల్ గా మారింది. దాదాపు రెండున్నర నిమిషాల నిడివి ఉన్న సదరు వీడియోలో.. నిర్జన ప్రాంతంలో ఒక మహిళను.. ఒక యువకుడు కర్రతో దారుణంగా కొట్టటం.. గాజులు పగిలి రక్తం కారుతున్నా వదలకుండా కొట్టిన వైనం.. తాను చేస్తున్న రాక్షసకాండను వీడియో తీయించటం.. చొక్కా మీద చేయి వదులు.. లేకపోతే నీ బట్టలు మొత్తం చించేస్తానంటూ వీరావేశాన్ని ప్రదర్శించిన నిందితుడ్ని నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు.

మూడు నెలల క్రితం జరిగిన ఈ దారుణానికి సంబంధించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను చూసిన పోలీసులు సుమోటోగా తీసుకొని.. నిందితులను గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇంతకీ ఈ వీడియోలో ఉన్న మహిళను.. నిందితుడు ఎందుకు కొట్టాడు? అంతలా ఎందుకు హింసించాడు? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని పోలీసులు వెల్లడించారు. నెల్లూరు రామకోటయ్య నగర్ కు చెందిన వెంకటేశ్.. శివకుమార్ లు స్నేహితుడు. వెంకటేశ్ టిప్పర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇంట్లోని గొడవలతో అతడి భార్య వెంకటేశ్ ను విడిచి పెట్టి వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో వెంకటేశ్ మరో యువతితో సన్నిహితంగా ఉండేవాడు. అయితే.. అతగాడి ప్రవర్తన నచ్చకపోవటంతో అతన్ని దూరం పెడుతూ వస్తోంది బాధిత యువతి. దీంతో జీర్ణించుకోలేకపోయిన అతడు.. మూడు నెలల క్రితం మాట్లాడుకుందాం రావాలని చెబుతూ.. కొత్తూరు సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అమానుషంగా ఆమెను కొట్టసాగాడు. చేతితో.. కర్రతో కొట్టాడు. గాజులు పగిలి రక్తం వస్తున్నా.. విడవకుండా రాక్షసానందం పొందాడు. తన స్నేహితుడు శివ ద్వారా వీడియో తీశాడు. తనను విడిచిపెట్టాలని కోరితే.. విడవకుండా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు రావటం.. అది కాస్తా వైరల్ అయ్యింది. దీంతో స్పందించిన పోలీసులు వెంటనే..నిందితుడ్ని.. అతడికి సహకరించిన స్నేహితుడ్ని అరెస్టు చేశారు.