Begin typing your search above and press return to search.

మోడీపై శివ‌సేన డైరెక్ట్ అటాక్‌

By:  Tupaki Desk   |   29 Sep 2015 3:37 PM GMT
మోడీపై శివ‌సేన డైరెక్ట్ అటాక్‌
X
కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వంలో భాగస్వామ్య పక్షమైనప్ప‌టికీ ఇప్ప‌టికే ఉప్పూ నిప్పులా ఉన్న బీజేపీ-శివ‌సేన మైత్రి మ‌ధ్య మ‌రింత గ్యాప్ పెరిగింది. ఇది కూడా ప్ర‌తిప‌క్షాలవ‌ల్లో లేదా ప్ర‌జా స‌మ‌స్య‌ల వ‌ల్లో కానే కాదు. రెండు పార్టీల వైఖ‌రి వ‌ల్ల‌! అది కూడా మ‌రాఠ టైగ‌ర్ భాల్ ఠాక్రే వార‌స‌త్వ పార్టీ అయిన శివ‌సేన వ‌ల్ల‌. ఈ మ‌ధ్య త‌ర‌చుగా బీజేపీ విధానాల‌ను ప్ర‌శ్నిస్తున్న శివ‌సేన తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అమెరికా వేదిక‌గా ఇచ్చిన బ‌హిరంగ స్టేట్‌ మెంట్‌ కు విరుద్ధ‌మైన పొగ‌డ్త చేయ‌డం తాజాగా చ‌ర్చ‌నీయాంశం అయంది.

కాంగ్రెస్‌ కు చెందిన‌ మాజీ ప్రధానమంత్రులు పి.వి.నరసింహరావు - మన్మోహన్ సింగ్ లపై తాజాగా శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. భారత ఆర్థిక వ్యవస్థకు వారిరువురూ చేసిన సేవలు మరువలేనివని పేర్కొంది. శివసేన అధికారిక పత్రిక సామ్నాలో తాజాగా రాసిన‌ క‌థ‌నం ఈ మేర‌కు వారిని పొగడ్త‌ల జ‌ల్లుల్లో ముంచెత్తింది. ఆ మాజీ ప్రధానులు భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం చేసిన సేవలు మ‌రువ‌లేనివ‌ని కొనియాడింది. అవ‌సాన‌ద‌శ‌లో ఉన్న దేశ ఎకాన‌మీని పీవీ న‌ర్సింహారావు నిల‌బెడితే....ఆర్థిక‌మాంద్యం చెల‌రేగిన స‌మ‌యంలోనూ మ‌న్మోహ‌న్ సింగ్ మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కుదులేకాకుండా చూశార‌ని ప్రస్తుతించింది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఎదుర్కున్న రెండు క్లిష్ట సంద‌ర్భాల్లోనూ ఈ ఇద్ద‌రు ప్ర‌ధాన‌మంత్రులు త‌మ‌దైన శైలిలో ప‌రిష్క‌రించార‌ని, త‌ద్వారా భార‌త‌కీర్తిని నిల‌బెట్టార‌ని సామ్నా సంపాద‌కీయం అభినందించింది. దీంతోపాటు సాంకేతిక రంగంలో పురోభివృద్ధికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ - ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ చేసిన కృషి కూడా విస్మరించద‌గిన‌దేమీ కాద‌ని సంపాద‌కీయం పేర్కొంది.

అమెరికా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్రధాని నరేంద్రమోడీ శాన్ ఫ్రాన్సిస్కోలో మాట్లాడుతూ యూపీఏ హయాంలో అవినీతి సంస్కృతి వేళ్లూనుకుందని విమర్శించిన నేపధ్యంలో శివసేన మాజీ ప్రధానులను పొగడటం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి తోడు అవినీతికి మారుపేరుగా మోడీ ప‌దేప‌దే పేర్కొనే గాంధీ వార‌సుల‌ను శివ‌సేన అధికార ప‌త్రిక కీర్తించ‌డం క‌చ్చితంగా మోడీకి ఇంటిపోరు వంటిదేన‌ని రాజ‌కీయ‌వేత్త‌లు వ్యాఖ్యానిస్తున్నారు.