Begin typing your search above and press return to search.

ఇప్పుడు ఈ కుంటి సాకులు ఏమిటి రవిశాస్త్రీ!

By:  Tupaki Desk   |   13 July 2019 5:57 AM GMT
ఇప్పుడు ఈ కుంటి సాకులు ఏమిటి రవిశాస్త్రీ!
X
కోట్ల రూపాయల జీతభత్యాలు తీసుకుంటున్నావు.. నీకు కోరుకున్న సపొర్టింగ్ స్టాఫ్ కూడా ఉంది. సపోర్టింగ్ స్టాఫ్ సైతం నువ్వు కోరుకున్న వాళ్లే ఉన్నారు. కోచ్ గా పదవిని తీసుకుని రెండేళ్లు అయినట్టున్నాయి. తీరా ప్రపంచకప్ సెమిఫైనల్లో ఓటమి పాలయ్యే వరకూ నీకు నాలుగో నంబర్ లో సరైన బ్యాట్స్ మన్ లేడనే విషయం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించక తప్పదు టీమిండియా కోచ్ రవిశాస్త్రిని!

ప్రపంచంలోనే అత్యంత అధిక వేతనం పొందుతున్న కోచ్ టీమిండియాకే ఉన్నాడు. కుంబ్లే ఆధ్వర్యంలో జట్టు విజయపథంలో నడుస్తున్నా రవిశాస్త్రికి కోచింగ్ బాధ్యతలు దక్కాయి. ఇన్నాళ్లూ అడిగే వాళ్లు లేరు - ప్రశ్నించే వారు లేరు. కెప్టెన్ కొహ్లీతో రవిశాస్త్రికి సత్సంబంధాలు నడిచాయి. పెద్దగా పరాజయాలు లేవు. స్వదేశంలో వన్డే సీరిస్ ను కోల్పోయినప్పుడే ఎవరైనా గట్టిగా నిలదీసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదేమో!

సెమిస్ లో పరాజయం అనంతరం రవిశాస్త్రి నాలుగో నంబర్లో సరైన బ్యాట్స్ మన్ లేకుండా పోయాడని వాపోతున్నాడు. అయితే ఈ విషయం ఇన్నాళ్లూ తెలియదా? దేశంలో యంగ్ క్రికెటర్ల లోటు లేదు! ఐపీఎల్ లో అనేక మంది యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక దేశవాళీలో కూడా బోలెడంత మంది ఆటగాళ్లు ఆడుతున్నారు.

వారిలో ఒకరిని కాకపోతే పది మందిని తీసుకుని.. వారిని జట్టు అవసరానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవాల్సింది. ప్రత్యామ్నాయ ఆటగాళ్లను అందుబాటులో పెట్టుకోవాల్సింది. రిజర్వ్ బెంచ్ లో పటిష్టమైన కూర్పును ఏర్పాటు చేసుకోవాల్సింది. కోచ్ గా రవి శాస్త్రి అలా చేయాల్సింది. అయితే తీరా చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది ఈయన తీరు. సెమిస్ లో వైఫల్యం అనంతరం జట్టులోని లోటుపాట్ల గురించి ఈ కోచ్ కు అర్థం అయినట్టుగా ఉన్నాయి.

ఇప్పటికే తన వేషాలతో రవిశాస్త్రి టీమిండియా ఫ్యాన్స్ చేత విమర్శలకు గురయ్యాడు. ఇప్పుడు ఓటమిపై ఇచ్చిన వివరణతో మరింతగా ఇతడిపై విమర్శలు చెలరేగుతూ ఉన్నాయి.