Begin typing your search above and press return to search.

హుజారాబాద్ కోసం జ‌ల జ‌గ‌డాలు అవ‌స‌ర‌మా?

By:  Tupaki Desk   |   2 July 2021 11:30 AM GMT
హుజారాబాద్ కోసం జ‌ల జ‌గ‌డాలు అవ‌స‌ర‌మా?
X
ప్ర‌స్తుతం అత్యంత హాట్ హాట్‌గా మారిన రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాలు తీవ్ర ఆందోళ‌న‌కు దారితీస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్ర‌బుత్వ దూకుడు వెనుక రాజ‌కీయ కోణం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో సెంటిమెంటును మ‌రోసారి రెచ్చ‌గొట్టి.. విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా కేసీఆర్ ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై పైచేయి సాధించేందుకు కేసీఆర్ జ‌ల వివాదాన్ని అస్త్రంగా చేసుకుని ముందుకు సాగుతున్నార‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

వాస్త‌వానికి నిన్న మొన్నటి వ‌ర‌కు ఇరు రాష్ట్రాల మ‌ధ్య వివాదం లేకుండా స‌జావుగా సంబంధాలు సాగుతున్నాయి. అలాంటిది ఒక్క‌సారిగా పులిచింత‌ల వ‌ద్ద రేగిన వివాదం నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాల్వ‌లో జ‌ల‌విద్యుదుత్ప‌త్తితో భోగి మంట‌ను త‌ల‌పిస్తోంది. కృష్ణారివ‌ర్ బోర్డు ఇరు రాష్ట్రాల‌కు కేటాయించిన నీటి కంటే ఎక్కువ‌గా తెలంగాణ అధికంగా వినియోగిస్తోంద‌ని.. నూరు శాతం విద్యుదుత్ప‌త్తి చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించ‌డంతోపాటు.. ఏకంగా కేసీఆర్ జీవో జారీ చేయ‌డం..ప్రాజెక్టుల వ‌ద్ద పోలీసులను మోహ‌రించ‌డం వంటివి మ‌రింత ఆజ్యం పోసిన‌ట్టు అయింది.

తెలంగాణ దూకుడుపై ఏపీ సీఎం జ‌గ‌న్ ఏకంగా ప్ర‌ధాని మోదీ స‌హా జ‌ల‌శ‌క్తి మంత్రికి లేఖ‌లు రాశారు. తెలంగాణ దూకుడుకు అడ్డుక‌ట్ట వేయాల‌ని ఆయ‌న కోరారు. ఇదిలావుంటే, తెలంగాణ‌, ఏపీ మంత్రులు ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌ల ప‌ర్వం కొన‌సాగిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. జ‌ల వివాదాలు ఇప్ప‌ట్లో స‌మ‌సిపోయేలా క‌నిపించడం లేదు. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి అవ‌స‌ర‌మా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. ఏదైనా స‌మ‌స్య ఉంటే.. ఇరు రాష్ట్ర సీఎంలు కూర్చుని చ‌ర్చించుకుంటే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి.

గ‌తంలోనూ ఇదే సూచ‌న‌లు ఇరు సీఎంల నుంచి వ్య‌క్త‌మ‌య్యాయి. ఏపీ సీఎం జ‌గ‌న్‌.. కేసీఆర్ ఇంటికి వెళ్ల‌డం, కేసీఆర్ ఏపీకి వ‌చ్చి.. జ‌గ‌న్ ఇంట్లోభోజ‌నం చేయడం .. వంటి ప‌రిణామాల‌తో ఇక‌, రెండు తెలుగు రాష్ట్రాలు అన్న‌ద‌మ్ముల మాదిరిగా ఉంటార‌ని.. అంద‌రూ అనుకున్నారు. కానీ, ఇంత‌లోనే జ‌ల వివాదం ఒక్క‌సారిగా రాజుకోవ‌డం.. లేఖ‌ల వ‌ర‌కు విష‌యం వెళ్ల‌డం, కృష్ణాబోర్డు నిర్ణ‌యానికి(విద్యుత్ ఉత్ప‌త్తిని ఆప‌మ‌ని) వ్య‌తిరేకంగా తెలంగాణ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం వంటివి.. స‌రిగాలేవ‌ని,, తెలంగాణ దూకుడు కేవ‌లం హుజూరాబాద్ ఎన్నిక‌ను దృష్టిలో పెట్టుకునే చేస్తున్న‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్ప‌టికైనా ఇరువురు సీఎంలు కూర్చుని చ‌ర్చించుకుంటారో లేదో చూడాలి.