Begin typing your search above and press return to search.

జగన్‌ తో నేదురుమల్లి తనయుడి భేటీ

By:  Tupaki Desk   |   5 Aug 2018 10:05 AM GMT
జగన్‌ తో నేదురుమల్లి తనయుడి భేటీ
X
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి తనయుడు రాంకుమార్ రెడ్డి పిఠాపురంలో పాదయాత్రలో ఉన్న జగన్‌ ను కలవడం ఏపీలో రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న రాంకుమార్ రెడ్డిని ఏపీ బీజేపీ సెక్రటరీగా ముందు రోజే నియమించారు. ఆ నియామకం జరిగిన ఒక్క రోజులోనే ఆయన వైసీపీ అధినేతను కలవడం చర్చనీయాంశంగా మారుతోంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తే వైసీపీలో చేరడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా వెంకటగిరి టిక్కెట్‌ ను ఆనం రామనారాయణరెడ్డి కూడా ఆశిస్తున్నారు. అదింకా ఖరారు కాకపోవడంతో ఆయన ఇంకా వైసీపీలో యాక్టివ్‌ గా తిరగడం లేదని తెలుస్తోంది. ఆనం కూడా ఇదే స్థానాన్ని ఆశిస్తున్నప్పటికీ అవసరమైతే ఆయన్ను వేరే చోటికి మార్చి రాంకుమార్ రెడ్డిని వెంకటగిరి నుంచి పోటీ చేయించాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం.

కాగా గతంలో కాంగ్రెస్‌ లోనే ఉన్న రాంకుమార్‌ ను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడనే కారణంతో కాంగ్రెస్‌ పార్టీ సస్పెండ్‌ చేసింది. దీంతో ఎలాగూ కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌ లో దిక్కు లేకపోవడంతో సీనియర్‌ బీజేపీ నాయకుడు - ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినా అప్పటి నుంచి పార్టీలో నిమ్మకు నీరెత్తిన విధంగానే ఉన్నారు. మొన్ననే ఆయన్ను బీజేపీ ఏపీ పార్టీకి సెక్రటరీగా నియమించింది. అది జరిగిన ఒక్క రోజులోనే రాంకుమార్ వైసీపీలో తాను చేరడం ఖాయమన్నట్లుగా క్లియర్ సంకేతాలిచ్చారు.