Begin typing your search above and press return to search.

మోడీతో విందుకోసం 50 వేల మంది క్యూ?

By:  Tupaki Desk   |   14 Aug 2015 7:02 AM GMT
మోడీతో విందుకోసం 50 వేల మంది క్యూ?
X
తన మాటలతో ఎన్నికల సమయంలో ఎన్నో ఆశలు రేపిన భావి భారత ప్రధానిగా అభివర్ణించిన నరేంద్ర మోడీ.. అనుకున్నట్లే ప్రధాని అయ్యారు. తన పదిహేను నెలల పదవీ కాలంలో పెద్దగా ప్రభావం చూపించనప్పటికీ.. ఒక్క విషయంలో మాత్రం ఆయన పేరు ప్రఖ్యాతులు మారుమోగుతున్నాయి. విదేశీ పర్యటనల విషయంలో రికార్డు స్థాయిలో పర్యటిస్తున్న ఆయన.. స్వదేశంలో తక్కువ.. విదేశాల్లో ఎక్కువ అన్న వ్యంగ్య వ్యాఖ్యను విపక్షాల నుంచి ఎదుర్కొంటున్నారు.

సరాసరిన నెల.. రెండు నెలలకో విదేశీ పర్యటనలు చేస్తున్న మోడీ.. వచ్చే వారంలో దుబాయ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓపెన్ విందును ఏర్పాటు చేస్తున్నారు. దీన్లో పాల్గొనటానికి భారీఎత్తున భారతీయులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. పెద్ద సంఖ్యలో అంటే.. ఏ పది వేలో.. ఇరవై వేలో కాదు.. ఏకంగా యాభై వేల మందికి పైనే మోడీతో కలిసి ఓపెన్ విందు చేయాలని అతృత ప్రదర్శిస్తున్నారట.

విందులో పాల్గొనదలిచిన వారు ముందుగా రిజిస్ట్రేషన్లు చేయాలని చెప్పటంతో.. ముమ్మరంగా తమ పేర్లను రిజిష్టర్ చేయించుకుంటున్నారు. ఇప్పటివరకూ 48 వేల మంది భారతీయులు తమ పేరును నమోదు చేయించుకోవటం గమనార్హం. ఒకట్రెండు రోజుల్లో ఈ సంఖ్య యాభై వేలకు దాటిపోతుందని చెబుతున్నారు. అయితే.. ఓపెన్ విందుకు సుమారు 40 వేలకు పైనే ప్రజలు హాజరయ్యే వీలుందని చెబుతున్నారు.

ఈ విందు కోసం ఓ స్టేడియంను బుక్ చేశారు. ఇక.. దుబాయ్ లో వేడి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్టేడియం మొత్తం ఏసీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతున్న నేపథ్యంలో స్టేడియం మొత్తం ఒక రోజు ముందు నుంచి ఏసీతో కూల్ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. దుబాయ్ లాంటి దేశంలో భారీగా విందు పేరుతో సమావేశం నిర్వహించిన మొదటి ప్రధాని మోడీ మాత్రమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.