Begin typing your search above and press return to search.

ప‌ద‌వి ఎవ‌రికి చేదు... ?

By:  Tupaki Desk   |   24 Nov 2018 3:30 PM GMT
ప‌ద‌వి ఎవ‌రికి చేదు... ?
X
పదవి అంటే ఎవరికి ఇష్టం ఉండదండీ....అందులోను అది ముఖ్యమంత్రి పదవి... ఆ పదవి కోసం ఏమైనా చేస్తారు. ఉద్యమాలు చేయిస్తారు... సమ్మెలు చేయిస్తారు... ఏదైనా చేస్తారు - చేయిస్తారు. ఒక్కసారి అంటే ఒక్కసారి అదృష్టం కలిసొచ్చి పదవి దక్కితే మరో ఐదేళ్ల వ‌ర‌కూ ఆ ఊసే ఉండదు..ఇంతలో తరతరాలు కావాల్సినంత సంపాదించుకోవచ్చు. ఇంతకీ ఇదంతా ఏమిటి అనుకుంటన్నారా..తెలంగాణ ముందస్తు ఎన్నికలకు మహాకూటమిలో ముఖ్యమంత్రి రేసులో దాదాపు 50 మంది అభ్యర్దులు పోటీపడుతున్నారని తెలుస్తోంది.

అవును మరి తెలంగాణ రాష్ట్ర సమితి అయితే పుట్టి నాలుగున్నర సంవత్సరాలే అయ్యింది. కాని వందేళ్లు చరిత్ర ఉన్న కాంగ్రెస్ ‌పార్టీ - దాదాపు 35 సంవత్సరాలు చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో కనీసం 50 మంది సీఎం అభ్య‌ర్థులు ఉండటం పెద్ద విశేషమా అంటున్నారు. ఈ అంశంతో చాలు అధికార తెలంగాణ‌ రాష్ట్ర సమితి నాయకులకు ప్రతిపక్షాన్ని ఎండగట్టడానికి! దీనిపై తెలంగాణ మంత్రులైన K. తారక రామారావు - T.హరీష్‌ రావులు తమ వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. కర్మకాలి మహాకూటమి కనుక తెలంగాణ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నాయకుల అధికార దాహం తీర్చడానికి ప్రతి మూడు నెలలకు ముఖ్యమంత్రులను మారుస్తారని వారన్నారు.

అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ మహాకూటమిలో రేసులో దాదాపు 10 మంది అభ్యర్దుల‌ కంటే ఉండరని - టిఆర్‌ ఎస్ పార్టీ నాయకులు ప్రతి అంశాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని అన్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణలో మహిళ అభ్యర్దులు మేము కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నామని కాలుదువ్వుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ మహిళా అభ్యర్దులైన గీతా రెడ్డి - డి.కె. అరుణ - ఇందిరా రెడ్డి వంటి నేతలు - ఈ విషయమై అఖిల భారత మహిళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన సుస్మితా దేవ్‌ తో మంతానాలు మొదలు పెట్టారని అంటున్నారు.

తెలంగాణకు మొదట మహిళ ముఖ్యమంత్రిని చేస్తే చరిత్రలో కాంగ్రెస్ పార్టీ పేరు - రాహాల్ గాంధీ పేరు నిలిచిపోతుందని - తమ అధినేత అయిన రాహుల్ గాంధీని మభ్యపెడుతున్నారని వినికిడి. ఈ విషయమై ఏం జరుగుతోందో తేలాలంటే డిసెంబరు 11 దాకా వేచి చూడాల్సిందే.