Begin typing your search above and press return to search.

మనోడికి రామన్ మెగసెసె పురస్కారం..

By:  Tupaki Desk   |   3 Aug 2019 10:19 AM IST
మనోడికి రామన్ మెగసెసె పురస్కారం..
X
మరోసారి మనోడి సత్తా ప్రపంచానికి చాటేలా ఒక పురస్కారం వరించింది. ఆసియా నోబెల్ గా అభివర్ణించే ప్రఖ్యాత రామన్ మెగసెసె పురస్కారం ఎన్డీటీవీకి చెందిన సీనియర్ పాత్రికేయుడు రవీశ్ కుమార్ సొంతం చేసుకున్నారు. నిస్సహాయుల గొంతుకగా నిలిచినందుకు ఆయన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రామన్ మెగసెసె గురుతుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని 1957 నుంచి ఇవ్వటం మొదలుపెట్టారు. ఇప్పటివరకూ భారత్ కు చెందిన పలువురు ప్రముఖుల్ని ఈ పురస్కారం వరించింది.

ప్రముఖులు ఆర్కే లక్ష్మణ్.. పాలగుమ్మి సాయినాథ్.. అరుణ్ శౌరి.. కిరణ్ బేడీ.. అర్వింద్ కేజ్రీవాల్ కు ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ప్రకటించిన పురస్కారాన్ని మనోడితో పాటు మరో నలుగురు ఎంపికయ్యారు. వారిలో మయన్మార్ కు చెందిన కో స్వీ విన్.. థాయిలాండ్ కు చెందిన నిలపైజిత్.. ఫిలిప్పీన్స్ కు చెందిన రేముండో పుజాంతే కాయాబ్యాబ్.. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జాంగ్ కిలు ఉన్నారు. వీరందరికి ఈ నెలాఖరున ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగే కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.

ఇక.. రవీశ్ కుమార్ విషయానికి వస్తే.. ఆయన సీనియర్ పాత్రికేయుడిగా సుపరిచితుడు. ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. బిహార్ కు చెందిన ఆయన.. జిత్వార్ పూర్ అనే గ్రామంలో జన్మించారు. 1996లోఎన్డీటీవీలో రిపోర్టర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. అనంతరం హిందీలో తొలిసారి 24 గంటల న్యూస్ ఛానల్ ను స్టార్ట్ చేయటం.. ఆయన్ను ప్రైమ్ టైం కార్యక్రమానికి వ్యాఖ్యతగా నియమించారు.

ప్రైమ్ టైమ్ లో సాధారణంగా ఫోకస్ కాని సామాన్యుల కష్టాల్ని దేశ ప్రజలకు కళ్లకు కట్టేలా చూపించటంలో ఆయన సక్సెస్ అయ్యారు. తన కార్యక్రమం ద్వారా దేశంలోని చాలామంది సామాన్యుల గొంతుకను ఆయన వినిపించి.. తన ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పొచ్చు. అనేక ఒత్తిడులు ఉండే మీడియాలో తనకంటూ ఒక మార్క్ ను చూపించేందుకు ప్రయత్నించినట్లుగా చెప్పాలి. నైతికతతో తన వృత్తిని నిర్వహిస్తారన్న పేరుంది. వాస్తవాల ఆధారంగా వార్తల్ని ప్రసారం చేసేందుకు ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పాలి.