Begin typing your search above and press return to search.

ఇప్పటికైతే ఎన్డీటీవీపై బ్యాన్ లేనట్లే

By:  Tupaki Desk   |   8 Nov 2016 8:42 AM IST
ఇప్పటికైతే ఎన్డీటీవీపై బ్యాన్ లేనట్లే
X
పఠాన్ కోట్ ఉగ్రదాడి సమయంలో నిబంధనలకు విరుద్ధంగా విజువల్స్ ను టెలికాస్ట్ చేశారంటూ.. ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ ఎన్డీటీవీ ప్రసారాల్ని ఒకరోజు పాటు నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీనిపై సర్వత్రా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. రాజకీయ పార్టీలు సైతం రంగ ప్రవేశం చేసి.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టాయి. ఎన్డీటీవీ ప్రసారాలపై మోడీ సర్కారు నిర్ణయం రెండో అత్యవసర పరిస్థితిలోకి వెళ్లిపోతుందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించటం.. ఆయన వ్యాఖ్యల తరహాలోనే మిగిలిన నేతలు గళం విప్పటంతో మోడీ సర్కారు ఆత్మరక్షణలో పడింది.

ఎన్డీటీవీ ప్రసారాలపై ఒకరోజు నిషేధంపై ప్రజలు కన్వీన్స్ అయ్యేలా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోకి ప్రభుత్వం వెళ్లటం.. అదే సమయంలో ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సదరు టీవీ ఛానల్ వినతిని విచారించేందుకు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో మోడీ సర్కారు తన నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో కాస్త వెనక్కి తగ్గింది.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎన్డీటీవీ ఛానల్ ప్రసారాలపై విదించిన బ్యాన్ ఉత్తర్వుల అమలు నిలిపివేసేలా కేంద్రమంత్రి వెంకయ్య నిర్ణయం తీసుకున్నారు. పఠాన్ కోట్ పై ఉగ్రవాదుల దాడి సందర్భంగా ఎన్డీటీవీ ప్రసారం చేసిన సున్నిత దృశ్యాలపై కేంద్రం ఈ తరహా చర్యలకు తెర తీయగా.. తమ లాంటి విజువల్స్ నే మిగిలిన ఛానల్స్ కూడా ప్రసారం చేసినట్లుగా ఎన్డీటీవీ వాదిస్తోంది. తాజాగా మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఈ నెల 9న ఎన్డీటీవీ ప్రసారాలు బంద్ కావాల్సి ఉన్నా.. యథావిధిగా ప్రసారం కానున్నాయి.