Begin typing your search above and press return to search.

ఎన్ ఆర్ ఐలకు నిర్మల గట్టి షాక్

By:  Tupaki Desk   |   2 Feb 2020 10:43 AM GMT
ఎన్ ఆర్ ఐలకు నిర్మల గట్టి షాక్
X
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎవ్వరినీ వదిలిపెట్టలేదని అర్థమైంది. పార్లమెంట్ లో శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల వ్యవసాయం - మౌళిక సదుపాయాలకు పెద్ద పీట వేసింది. ఈసారి పారిశ్రామికవర్గానికి షాకులే ఇచ్చింది. దేశాన్ని పట్టి పీడిస్తున్న మాంద్యానికి మందు వేయలేకపోయిందన్న చర్చ సాగుతోంది.

ఇక నిర్మల తన బడ్జెట్ లో ఎన్ ఆర్ ఐలకు కూడా షాకిచ్చింది. 2020-21 బడ్జెట్ లో ఎన్ ఆర్ ఐ పన్ను స్లాబును నిర్మల సవరించింది. విదేశాల్లో ఉండి.. అక్కడ పన్ను చెల్లించని వారు ఇండియాలో పన్ను కట్టాల్సిందేనని నిర్మల బడ్జెట్ లో స్పష్టం చేశారు.

పార్లమెంట్ ప్రసంగంలో ఈ విషయాన్ని నిర్మల ప్రకటించలేదు. అయితే ఆదివారం కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేయడంతో విదేశాల్లో ఉన్న ఎన్ ఆర్ ఐలంతా షాక్ కు గురయ్యారు.

విదేశాల్లో ఉన్న ఒక ప్రవాస భారతీయుడు 240 రోజులు విదేశాల్లో ఉంటే అతను ఎన్ఆర్ఐ గా పరిగణిస్తామని చట్టంలో మార్పులు చేశామని రెవెన్యూ కార్యదర్శి తెలిపారు. 182 రోజులు విదేశాల్లో ఉంటే ప్రవాస భారతీయుడిగా లెక్కగడుతామని తెలిపారు. వీరు పన్ను పరిధిలోకి వస్తారని వివరించారు. విదేశాల్లో ఉండే భారతీయులు ఆ దేశంలో పన్ను చెల్లించకుంటే భారత దేశంలో పన్ను విధిస్తామని తేల్చిచెప్పారు. ఆ దేశంలో పన్ను చెల్లిస్తే భారత్ లో మినహాయింపు ఉంటుందని తెలిపారు. వివిధ దేశాల్లో ఆదాయం ఉంటే ఆ ఆదాయంపై దేశంలో పన్ను విధిస్తామని తెలిపారు.

దుబాయ్ సహా గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికులకు ఇన్నాళ్లు పన్ను తక్కువగా ఉండేది. కొందరికి పన్ను లేనే లేదు.కానీ ఇప్పుడు కేంద్రం తెచ్చిన సంస్కరణతో వలస కూలీలుగా వెళ్లిన గల్ఫ్ కార్మికులపై కూడా భారం పడనుంది. కేంద్రం నిర్ణయంపై వలసవాదులు మండిపడుతున్నారు.