Begin typing your search above and press return to search.

థ‌ర్డ్ ఫ్రంట్ ‘సార‌థి’.. ఆయ‌నేనా?

By:  Tupaki Desk   |   14 July 2021 5:30 PM GMT
థ‌ర్డ్ ఫ్రంట్ ‘సార‌థి’.. ఆయ‌నేనా?
X
దేశ రాజకీయాలు ఇప్పుడు సంధికాలంలో ఉన్నాయ‌ని చెప్పొచ్చు. రెండు సార్లు గెలిచిన మోడీ వేవ్ త‌గ్గిపోయే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇటు చూస్తే.. 2014లో ప‌డిపోయిన కాంగ్రెస్ ఒంట‌రిగా తిరిగి లేచే ప‌రిస్థితి క‌నిపించ‌ట్లేదు. దీంతో.. దేశానికి మ‌రో ప్ర‌త్యామ్నాయం క‌నిపించ‌ట్లేదు. అందుకే.. ప్రాంతీయంగా బ‌లంగా ఉన్న పార్టీల‌న్నీ.. త‌మ జెండాల‌ను క‌లిపి కుట్టుకొని కాషాయ పార్టీకి వ్య‌తిరేకంగా రెప‌రెప‌లాడించేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. ఇప్ప‌టికే.. ప‌లుద‌ఫాలుగా స‌మావేశాలు కూడా ముగిశాయి. కానీ.. నిర్ణ‌యం ఏదీ కొలిక్కి రాలేదు.

ప్ర‌ధానంగా.. మోడీకి వ్య‌తిరేకంగా బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌, క‌మ్యూనిస్టులు క‌లిసి థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో స్టాలిన్ వంటి ముఖ్య‌మంత్రులు ఎవ‌రైనా క‌లిసి వ‌స్తారా? అన్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌త లేదు. ఎన్నిక‌ల‌కు ఇంకా మూడేళ్ల స‌మ‌యం ఉంది. దీంతో.. మెల్ల మెల్ల‌గా అడుగులు వేస్తున్నారు.

అయితే.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై దేశం మొత్తం దృష్టి సారించింది. అక్క‌డ మోడీని మ‌మ‌తా బెన‌ర్జీ చిత్తుగా ఓడించ‌డంతో.. మిగిలిన ప్రాంతీయ పార్టీల‌కు ధైర్యం వ‌చ్చేసింది. 2024లో బీజేపీని ఎదుర్కోవ‌డం, ఓడించ‌డం సాధ్య‌మే అనే విశ్వాసం వారిలో పెరిగింది. బెంగాల్ ఫ‌లితాల త‌ర్వాత‌నే వారు థ‌ర్డ్ ఫ్రంట్ విష‌య‌మై ఢిల్లీలో స‌మావేశం నిర్వ‌హించారు. అయితే.. నాయ‌క‌త్వం ఎవ‌రిది? అన్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

ప్ర‌ధాన మంత్రి సీటులో కూర్చోవాల‌ని ఏ రాజ‌కీయ నాయ‌కుడికి మాత్రం ఉండ‌దు? పైగా దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ.. ప్రధాని పదవికోసమే ఎదురు చూస్తున్న‌వారు కూడా ఉన్నారు. ఈ చ‌ర్చ ఇలా ఉంటే.. అస‌లు కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్య‌తిరేక‌ ఫ్రంట్ ఎలా సాధ్య‌మ‌వుతుంది? అన్న‌ది మ‌రికొందిర ప్ర‌శ్న‌. ప్రాంతీయ పార్టీలు ఎంత బ‌లంగా ఉన్నా.. వారి స్టామినా ఆ రాష్ట్రం వ‌ర‌కే. ఇలా చూసుకున్న‌ప్పుడు.. థ‌ర్డ్ ఫ్రంట్ క‌ట్టే పార్టీల రాష్ట్రాలను వ‌దిలేస్తే.. మిగిలిన రాష్ట్రాల్లో ముఖాముఖి పోరు కాంగ్రెస్ - బీజేపీ మ‌ధ్య‌నే కొన‌సాగాల్సి ఉంటుంది. మ‌రి, అప్పుడు కాంగ్రెస్ లేని థ‌ర్డ్ ఫ్రంట్ వ‌ల్ల ఎవ‌రికి ఉప‌యోగం? అంతిమంగా ఓట్లు చీలిపోయి.. బీజేపీకే లాభిస్తుంది క‌దా? అన్న‌ది వారి వాద‌న‌.

పోనీ.. ఈ లెక్క ప్రకారం కాంగ్రెస్ తోనే క‌లిసి న‌డిస్తే.. నాయ‌క‌త్వం ఎవ‌రు వ‌హించాలి? అన్న‌దే మ‌ళ్లీ ప్ర‌శ్న‌. పెద్ద‌న్న పాత్ర నుంచి కాంగ్రెస్ త‌ప్పుకోవ‌డానికి ఇష్ట‌ప‌డుతుందా? అంటే.. దాదాపు నో అన్న‌దే స‌మాధానం. ఇలా.. థ‌ర్డ్ ఫ్రంట్ కు సంబంధించిన చిక్కు ప్ర‌శ్న‌లు చాలా ఉన్నాయి. ఎన్నిక‌ల‌కు మూడేళ్ల స‌మ‌యం ఉంది కాబ‌ట్టి.. మ‌రికాస్త గ్యాప్ తీసుకుంటే ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌కొచ్చు.

అయితే.. కొంద‌రు మాత్రం థ‌ర్డ్ ఫ్రంట్ సార‌ధిని ముందే ప్ర‌క‌టిస్తున్నారు. అది ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ అయితే బాగుంటుంద‌ని చెబుతున్నారు. తాజాగా.. శివ‌సేన నాయ‌కుడు సంజ‌య్ రౌత్ మాట్లాడుతూ.. థ‌ర్డ్ ఫ్రంట్ మోడీని ఢీకొట్ట‌డానికి ప‌వార్ ను మించిన ఆప్ష‌న్ లేదు అంటున్నాడీ కాషాయ నాయ‌కుడు. ప్ర‌తిపక్షాల‌న్నీ కూట‌మిగా ఏర్ప‌డి ప‌వార్ ను ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి, ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని సూచించారు. అందులో శివ‌సేన చేరుతుందా? లేదా? అన్న‌ది మాత్రం చెప్ప‌లేదుగానీ.. ప‌వార్ అభ్య‌ర్థిత్వం గురించి చెప్పేశారు. మ‌రి, ఇది వ్య‌క్తిగ‌త అభిప్రాయమా? పార్టీ అభిప్రాయమా? అన్నది కూడా తెలియదు. మొత్తానికి.. శరద్ పవార్ పేరైతే తెరపైకి వస్తోంది. మరి, థర్డ్ ఫ్రంట్ పార్టీలు ఏమంటాయో..? ఈ కూట‌మి ఏర్పాటు ఎంత‌దాకా వ‌స్తుంద‌న్న‌ది చూడాలి.