Begin typing your search above and press return to search.

ల్యాంకో ఆస్తుల అమ్మ‌కానికి రంగం సిద్ధం!

By:  Tupaki Desk   |   28 Aug 2018 12:53 PM GMT
ల్యాంకో ఆస్తుల అమ్మ‌కానికి రంగం సిద్ధం!
X
ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ విభ‌జ‌న‌కు ముందు కాంగ్రెస్ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పేరు ఇరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు ల‌గ‌డ‌పాటి దీక్ష ఎపిసోడ్ - పార్ల‌మెంటులో పెప్ప‌ర్ స్ప్రే ఎపిసోడ్ ....అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపాయి. రాష్ట్ర‌విభ‌జ‌న జ‌రిగితే తాను రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌ని చెప్పిన ల‌గ‌డ‌పాటి....ఆ మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నారు. ఈ మ‌ధ్య ఏపీలో పాలిటిక్స్ పై త‌న స‌ర్వేల‌తో వార్త‌ల్లో నిలిచిన ల‌గ‌డ‌పాటి తాజాగా మ‌రోసారి వార్త‌లకెక్కారు. ల‌గడపాటికి చెందిన ల్యాంకో ఇన్‌ ఫ్రా... మూసివేతకు రంగం సిద్ధ‌మ‌వ‌డంతో ఆయ‌న పేరు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. అప్పుల‌పాల‌వ‌డంతో పాటు బ్యాంకులకు కనీసం వడ్డీ చెల్లించే పరిస్థితిలో ఆ సంస్థ లేకపోవటంతో ..... ల్యాంకో ఇన్‌ ఫ్రా ఆస్తులన్నిటినీ అమ్మి అప్పులు తీర్చే ప్రక్రియకు (లిక్విడేషన్‌) హైదరాబాద్‌ లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌ సీఎల్‌ టీ) గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ ప్ర‌కారం ట్రిబ్యునల్‌ సభ్యుడు రాతకొండ మురళి సోమవారం ఉత్తర్వులు జారీ చేయ‌డంతో ఆ అమ్మ‌కం అధికారికంగా ఖ‌రారైంది. దాంతోపాటు, సావన్‌ గొడియావాలాను ల్యాంకో ఇన్‌ ఫ్రా లిక్విడేటర్‌ గా నియమించారు. రుణ పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ ఆమోదం తెలపకపోవటంతో ల్యాంకో లిక్విడేషన్ కు ఆదేశాలిచ్చినట్లు ముర‌ళీ తెలిపారు.

ల్యాంకో ఇన్ ఫ్రా ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధ‌మైంది. తాజాగా వెలువ‌డిన ఉత్తర్వులతో ల్యాంకో ఇన్‌ ఫ్రా బోర్డు - ఇతర మేనేజ్‌ మెంట్ - భాగస్వాముల అధికారాలన్నీ రద్దవుతాయి. ఆ ఆస్తుల విక్రయానికి బహిరంగ ప్రకటనను లిక్విడేట‌ర్ చేస్తారు. లిక్విడేషన్‌ మొదలైన 75 రోజుల్లోగా ప్రాథమిక నివేదికను అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీకి సమర్పించాల్సి ఉంటుందని మురళి తెలిపారు. కాగా, తమ ద‌గ్గ‌ర తీసుకున్న‌ రూ.3608 కోట్ల అప్పును ల్యాంకో ఇన్‌ ఫ్రా తిరిగి చెల్లించడం లేదని, అందుకే దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఐబీడీఐ హైదరాబాద్‌.... ఎన్‌ సీఎల్‌ టీలో పిటిషన్ దాఖ‌లు చేసింది. తమకు మొత్తం రూ.49,959 కోట్ల వ‌ర‌కు బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు బ్యాంకులు - ఇతర రుణ సంస్థలు చెబుతున్నాయి. అయితే, త‌మ‌ అప్పులు రూ.47,721 కోట్లని ల్యాంకో ఇన్‌ ఫ్రా చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపిన‌ ట్రిబ్యునల్‌... దివాలా పరిష్కార నిపుణుడిగా సావల్‌ గొడియావాలాను నియమించింది.మ‌రోవైపు, ల్యాంకో కోసం పవర్‌ మెక్‌ కంపెనీ దాఖలు చేసిన దరఖాస్తును ట్రిబ్యునల్‌ తిరస్కరించింది. ల్యాంకో ఇన్‌ ఫ్రా దాఖలు చేసిన అనుబంధ దరఖాస్తులపై విచారణను సెప్టెంబర్‌ 12కి వాయిదా వేసింది.