Begin typing your search above and press return to search.

ఏంటి నాయిని.. ఈ టంగ్ స్లిప్పులు!

By:  Tupaki Desk   |   22 Jun 2018 4:53 AM GMT
ఏంటి నాయిని.. ఈ టంగ్ స్లిప్పులు!
X
క‌ష్టానికి త‌గిన ఫ‌లితం ద‌క్క‌టం రాజ‌కీయాల్లో అంతే తేలికైన విష‌యం కాదు. ప‌డిన క‌ష్టానికి చ‌క్ర‌వ‌డ్డీతో స‌హా తిరిగి పొంద‌టం చాలా అరుదు. అలాంటి అదృష్టం కోట్ల‌ల్లో ఒక్క‌రికే ద‌క్కుతుంది. అలాంటి అదృష్టాన్ని సొంతం చేసుకున్న నేత‌గా అంద‌రి నోట నానుతూ ఉంటారు నాయిని న‌ర్సింహారెడ్డి. కార్మిక సంఘ నేత‌గా కెరీర్ షురూ చేసి.. ఉద్య‌మ నేత‌గా సుదీర్ఘ‌కాలం ప్ర‌యాణించిన రాజ‌కీయ నాయకుడికి రాష్ట్ర హోంమంత్రి ప‌ద‌వి ల‌భించ‌టం అంత తేలికైన విష‌యం కాదు.

కానీ.. త‌న విధేయ‌త‌తో కేసీఆర్ మ‌న‌సును దోచుకున్న నాయిని.. తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రిగా రికార్డుల్లోకి ఎక్కేశారు. క‌టువుగా మాట్లాడ‌టంలో దిట్ట‌గా పేరున్న నాయిని.. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ టంగ్ స్లిప్ అవుతున్నారు. ప్ర‌త్యేక రాష్ట్రాన్ని పోరాడి మ‌రీ సాధించుకున్న‌ప్ప‌టికీ... సుదీర్ఘ‌కాలం పాటు ఉద్య‌మ జీవితాన్ని గ‌డిపినందుకో ఏమో కానీ.. ఆయ‌న ఇప్ప‌టికే ఉమ్మ‌డి ఏపీని మ‌ర్చిపోలేక‌పోతున్నారు.

త‌ర‌చూ ఏపీ పేరును.. ఏపీకి చెందిన ప్రాజెక్టుల్ని తెలంగాణ స్థానే ప్ర‌స్తావించ‌టం క‌నిపిస్తూ ఉంటుంది. తాజాగా మ‌రోసారి ఇలాంటి త‌డ‌బాటుకే గుర‌య్యారు నాయిని. తెలంగాణ అభివృద్ధిని చంద్ర‌బాబు అడ్డుకుంటున్నారంటూ మండి ప‌డ్డ నాయిని.. కాళేశ్వ‌రాన్ని బాబు అడ్డుకుంటున్నార‌న్న మాట‌కు బ‌దులుగా పోల‌వ‌రానికి అడ్డుప‌డుతున్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ ఏపీ ప్ర‌స్తావ‌న మాన‌రా నాయిని అంటూ ప‌లువురు టీఆర్ ఎస్ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. త‌న త‌ప్పును పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా త‌న‌దైన ఫ్లోలో సాగిపోయే నాయిని తీరుపై టీఆర్ ఎస్ పార్టీలో త‌ర‌చూ చ‌ర్చ జ‌రుగుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.