Begin typing your search above and press return to search.

నయీమ్ సెటిల్మెంట్స్ లో మూడు కోణాలు!

By:  Tupaki Desk   |   12 Aug 2016 6:35 AM GMT
నయీమ్ సెటిల్మెంట్స్ లో మూడు కోణాలు!
X
ఎందుకన్నా, రోజులు బాగాలేవు.. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాల్లో నీ కొడుకో.. కూతురో ఉంటే పరిస్థితేంటన్నా? ఈ మాట వింటే.. ఎవరికైనా తెలుగు సినిమాల్లో విలన్ బెదిరింపులు గుర్తుకురాకమానవు. ఇవి సినిమాలో డైలాగులైతే సరే కానీ.. అచ్చూ ఈ డైలాగు - ఇలాంటి డైలాగులనే వాడుతుంటాడట నయీం. ఇతడు ఇంతకాలంచేసిన హత్యలు - దారుణాలు పైకి కనిపిస్తాయి కాబట్టి వాటిని ఎంత కిరాతకంగా చేస్తాడొ చూసిన తర్వాతైనా అర్థమవుతుంది. కానీ.. కత్తి - తుపాకీ వంటి ఆయుదాలు వాడకుండా అంతర్గతంగా చేసే సెటిల్ మెంట్లు ఎలా ఉండేవి అనే విషయాలపై తాజాగా చర్చనడుస్తుంది. దీనికి సంబందించిన బాదితులు కూడా వారి వారి అనుభవాలను ఇప్పుడు ధైర్యంగా చెబుతున్నారట. ఈ విషయంలో నయీం అనుసరించే వ్యవహారం - మాట్లాడే మాటలు - ఆ సమయంలో అతడి ప్రవర్తన గురించి తాజాగా తెలుస్తుంది.

అచ్చూ సినిమాలో చూపించినట్లుగా సాగే డబ్బులు వసూల్ చేసే ప్రక్రియ కానీ - వివాదాలు సెటిల్ చేయాలనుకున్నాకానీ నయీం నేరుగా ఎంటర్ కాడట. ఈ వ్యవహారాలను దాదాపు అనుచరులే పూర్తి చేస్తారట. భాయ్.. భాయ్ చెప్పాడు.. అంటూ భయపెట్టి తమ దారిలోకి తెచ్చుకుంటారట. ఇవి ఒక స్థాయివరకూ అనుచరులే చక్కబెట్టేస్తారు కానీ.. కొన్ని కీలకమైన వ్యవహారాలను మాత్రం నయీమే స్వయంగా పర్యవేక్షిస్తాడట. ఆ సెటిల్ మెంట్లు చేసేందుకు అవసరమైన వ్యక్తులను ‘భాయ్’ దగ్గరకు తీసుకెళ్లేటప్పుడు కూడా వారి వారి కళ్లకు గంతలు కట్టి సీక్రెట్ గా తీసుకెళ్తారట.

తాజాగా తెలిసిన వివరాల ప్రకారం.. నయీం అనుచరులు భయభ్రాంతులకు గురిచేసేలా - అసభ్యకరంగా మాట్లాడతారట కానీ.. నయీమ్ మాత్రం ఏమాత్రం అసభ్యంగా మాట్లాడ కుండా - బెదిరింపుదోరణికి పోకుండానే.. "అన్నా" అని సంబోధించి తనకు కావాల్సిన విషయం స్పష్టంగా చెప్పి.. భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా అని భరోసా ఇస్తాడట. అక్కడితో అయిపోతే సరే.. అలా కాకుండా సదరు వ్యక్తి నయీం మాటలకు లొంగకపోతే అప్పుడు నయీం మరోకోణం బయటపెడతాడట. అప్పుడు సదరు వ్యక్తులకు ఆస్తులు - అమ్మకాలు - కొనుగోళ్లకు సంబంధించి ఆ వ్యక్తి జరిపిన లావాదేవీల వివరాలను డాక్యుమెంట్లతో సహా ఉంచుతాడట. అదే సమయంలో కుటుంబ సభ్యులు వివరాలు.. పిల్లల పేర్లు, వారు చదువుతున్న స్కూల్ మొదలైన వివరాలు బెదిరించకనే బెదిరిస్తూ చెప్పి వారి యోగక్షేమాల గురించి ఆరా తీస్తాడట. దీంతో అప్పటికే విషయం పూర్తిగా అర్ధంచేసుకున్న సదరు వ్యక్తులు.. "భాయ్" కి సరే "భాయ్" అని చెప్పి కిమ్మనకుండా పనిచేస్తారట. ఇప్పటికి కూడా మాటవినకపొతే.. అప్పుడు అంతా అందరికీ తెలిసినట్లే జరుగుతుందట!