Begin typing your search above and press return to search.

ముంబైకి సూర్య..భువనగిరికి నయీం!

By:  Tupaki Desk   |   17 Aug 2016 8:44 AM GMT
ముంబైకి సూర్య..భువనగిరికి నయీం!
X
"ప్రతీ టేబుల్‌ పైనా మనం గన్ పెట్టాలి.. అందరూ సూర్యా ట్యాక్స్ పేరుతో పన్ను కట్టాలి.. ఎవడైనా కట్టనని అంటే వాడికి గన్ చూపించి బెదిరించండి" ఈ డైలాగ్ ఏ సినిమాలోదో గుర్తొచ్చే ఉంటుంది. పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన బిజినెస్ మ్యాన్ సినిమాలోది. ఈ సినిమాలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని - ముంబైని --- పోయించడానికి వచ్చానని చెబుతూ.. దేశం మొత్తం ఎలా దోచుకోవాలో తన సహచరులకు - అనుచరులకు చెప్పే సమయంలో మహేష్ బాబు ఈ డైలాగ్ చెబుతాడు. అది సినిమా కాబట్టి జరిగింది కానీ.. అలాంటివి నిజజీవితాల్లో - సమాజంలో జరగవని అంతా అనుకుని ఉంటారు కానీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన నయీం వ్యవహారంతో అలాంటివి ప్రస్తుత సమాజంలో కూడా జరుగుతాయని తెలిసింది.

బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు చేసినట్లుగానే.. నయీం కూడా భువనగిరిలో చేశాడు. ఎన్‌.ఎం.టి (నయీముద్దీన్ ట్యాక్స్) పేరుతో నయీం భువనగిరిలో డబ్బులు వసూలు చేసేవాడట. అతడు అడిగినంతా ఇవ్వలేమన్నవారిని తుపాకి పెట్టిమరీ బెదిరించాడట. అప్పటికీ మాటవిని ట్యాక్స్ కట్టకపొతే హత్యలు కూడా చేశాడని సిట్ దర్యాప్తులో తేలిందట. నల్లగొండ జిల్లా భువనగిరిలోనే వందల మంది "నయీం ట్యాక్స్" చెల్లించిన వారున్నారని తాజా సమాచారం తెలిసినవారికి బిజినెస్ మ్యాన్ సినిమా గుర్తుకురాకుండా ఎలా ఉంటుంది మరి. భూలావాదేవీలు - ఇల్లనిర్మాణాలు - వ్యాపారాలు.. ఇలా డబ్బుతో సంబంధమున్న ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా నయీంకు ట్యాక్స్ చెల్లించాల్సిందేనట.

కాగా ఈ విషయాలపై నయీం డిగ్రీ క్లాస్ మెట్ రామకృష్ణారెడ్డి కూడా తెలిపిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో ఏవరైనా భూములు కొన్నా - అమ్మినా కూడా వారి వారి బందువులకంటే ముందుగా నయీం కు ఆ విషయం తెలిసేదట. అనంతరం ఆ వ్యవహారం విలువను బట్టి సుమారు రూ.10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ నయీం ట్యాక్స్ వసూలు చేసేవాడట. అంటే.. బిజినెస్ మ్యాన్ సినిమాలో ముంబై కి సూర్య (మహేష్ బాబు) ఎంతో.. భువనగిరికి నయీం అంతన్న రేంజ్ లో అన్నమాట.