Begin typing your search above and press return to search.

అల్లాటప్పా కాని నాయిని కి చాలా కోపం వచ్చింది

By:  Tupaki Desk   |   17 Aug 2015 4:37 AM GMT
అల్లాటప్పా కాని నాయిని కి చాలా కోపం వచ్చింది
X
తెలంగాణ హోం మంత్రి నాయినికి కోపం వచ్చేసింది. తెలుగు యూనివర్సిటీలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన ఆయన ఆగ్గి మీద గుగ్గిలం అయిపోయారు.

తనకు ఎదురైన అధికారులకు ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలిన పరిస్థితి. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక.. కామ్ అయిపోయారు. ఈ వైఖరి నాయినికి మరింత ఆగ్రహం కలిగించేలా చేసింది. కార్యక్రమానికి హాజరయ్యేందుకు కారు దిగిన నాయినికి అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఒక్కదాన్లో కూడా తన ఫోటో లేకపోవటం చిర్రెత్తుకొచ్చింది. తన వద్దకు వచ్చిన అధికారుల్ని ఆయన ఇదే విషయాన్ని మరింత సూటిగా అడిగేశారు.

సమావేశానికి రాని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ఫోటోలతో ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేసినప్పుడు.. తన ఫోటోతో ఉన్న ఫ్లెక్సీల్ని ఎందుకు ఏర్పాటు చేయలేదన్నది ఆయన ప్రశ్న. అంతేకాదు.. ఆహ్వాన పత్రంలోనూ తన పేరును వేయలేదన్న ఆయన.. ఎందుకిలా జరిగిందని నిలదీశారు. బ్యానర్లు.. ఫ్లెక్సీల్లో రాజేందర్ ఫోటో ఎందుకు పెట్టారు..? ఆయన మీటింగ్ కే రాలేదు.. నేను సీనియర్ నాయకుడ్ని.. హోంమంత్రిగా ఉన్నా.. అయినా నా ఫోటో పెట్టరా? లాంటి వరుస ప్రశ్నలతో అధికారుల గొంతులో తడారిపోయిన పరిస్థితి.

తానేం అల్లాటప్పా వ్యక్తిని కానని.. హోం శాఖా మంత్రినని.. అలాంటిది తన ఫోటోలే వేయరా? అని చిందులేసిన నాయిని దెబ్బకు.. అధికారులు మాన్పడిపోయి.. ఆయన దగ్గరకు రావటానికి కూడా భయపడిపోయారు. నాయిని కోపంలో అర్థం ఉంది. అంత పెద్ద హోం మినిస్టర్ ను పిలిచినప్పుడు.. ఆయన పేరు.. ఫ్లెక్సీల్లో ఆయన ఫోటో వేస్తే.. పోయేదేముంది?